నా బిడ్డ.....పడినా లేచే కెరటం
నా బిడ్డ.....పడినా లేచే కెరటం
టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, కరోన,
సీబీపి, సిఆర్ పి, డబ్ల్యూ బి సి, ఆర్ బి సి, క్యూ,
సిరం ఎలెక్ట్రోలైట్స్, యూరిన్, సిరం క్రీయాటిన్,
టెస్టుల మీద టెస్టులు ఏమిలేదని తేల్చేసుడు
గంట గంటకు డిఎన్ఎస్ బాటిల్స్,
ఫెవరి డోల్-IV, పిపెరసిల్లన్ లింటాజ్,మేరోపినేమ్, వొమికిండ్,మెఫ్టల్ P, ఏవేవో ఇంజెక్షన్స్,సిరప్ లు
టాబ్లెట్స్ అయిన 83.5% బ్లడ్ ఇన్ఫెక్షన్ తో
సి ఆర్ పి, మాత్రం కంట్రోల్ కావట్లేదు ..
తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం వల్ల
కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయేమోనని
కాలేయం కమిలిపోయిందేమోనని అనుమానం
చెక్ చేసి స్కాన్ చేసి చూసారు
గాల్ బ్లాడర్ విసుగుచెందింది కానీ
నా బిడ్డ పక్షం రోజులుగా తగలబడిపోతుంది
పక్షవాతం వచ్చిన దానిలా బెడ్ మీద పడుకొనివుంది
ఫిట్స్ రాలేదు, దద్దుర్లు లేవు, కడుపు ఉబ్బరం లేదు
మూత్రం సాఫీగానే ఉన్నది, అన్నం తింటున్నది,
మొబైల్ గేమ్స్ ఆడుతూ నొప్పిని మరిచిపోతున్నది
చాలా చురుకుగా కనబడుతుంది కానీ
పాలిపోతున్న వంటి వర్ణం,
కాలిపోతున్న లేత చర్మం,
తీవ్ర జ్వరంతో వణుకుతు అర్తి నిండిన కళ్ళతో
ఇంటికిపోదాం పద నాన్న అంటున్నది,
ఎగతన్నుకువొస్తున్న దుఃఖాన్ని లోపల అనుచుకుంటు
ఒకటి రెండ్రోజుల ఆగుబిడ్డ పోదాం...అనేస్తు
డాక్టర్ అన్న మాటలు గుర్తుచేసుకున్న
"నా వల్ల కాదు ఇక మీ బిడ్డను హైద్రాబాద్ కు తీసుకెళ్లండి కేవలం బ్లడ్ కల్చర్ టెస్ట్ చేసిన తరువాత మాత్రమే సరైన వైద్యం చేయగలం ......"
నా మనసులో మాత్రం....
గంట గంటకు గండంతో,
రోజు రోజుకో మరణ మృదంగంతో
మా నుండి బిడ్డను నిర్దయగా తీసుకు పోతానంటు
వెకిలి స్టెప్స్ వేస్తూ భయపెడుతున్న మృత్యువు
వేదన రాత్రులు, కంటికి కునుకులేని మేము
తడి ఆరని నా భార్య కళ్ళు కుమిలిపోతు
కళ్ళతో నన్ను .......ప్రశ్నిస్తున్నది
లేలేత భానుడు ఉదయిస్తూనే అస్తమించాలా
అని దీనంగా అడుగుతుంది.....
నెలవంక వెన్నెల పరువక ముందే కనుమరుగవ్వలా
అంటు వెక్కి వెక్కి ఏడుస్తుంది.......
బొడ్డు తాడు తెగి ఐదు సంవత్సరాల కాకముందే
నా బిడ్డను బొంద పెట్టాలా......
అని హృదయవిధారకంగా రోధిస్తుంది......
నా ప్రేమ తోటలో అంకురించిన మొగ్గ వెంటనే తెగిపడాల అని దుఃఖిస్తుంది....
ఈ నాన్న ప్రేమ చాలా విశాలమైనదే
కానీ ఆమె (అమ్మ) ప్రేమ ఆనంతమైనది
నా బిడ్డ లేచిపడే కెరటం కాదు......కాకూడదు
పడినా లేచే కెరటం......కావాలి....అని
నేను భగవంతుడుని మ్రొక్కుకున్న....
చావుకు బ్రతుకుకి మధ్యలో డాక్టర్స్
DNS బాటిల్స్ నుండి ఒక్కొక్క చుక్క
సిరంజీల నుండి మరో చుక్కను
నా చిట్టి తల్లి చిట్టి గుండెకు
నరాల నుండి పంపిస్తూ
డోసు పెంచుతూ లేదంటే
మరో మెడిసిన్ మార్చుతూ,
దాదాపుగా 15 రోజులుగా
104° డిగ్రీల టెంపరేచర్ తో మరిగి
చితిలోకి పోబోయే నా పసి బిడ్డ
మొండి రోగాన్ని మెడలను వంచి
తన్ని తరిమేసి నా చేతికి ఇచ్చి
విషాదవదనులైన మా అందరి ముఖాన
చిరునవ్వులు పూయించిన దేవుడు....
మా బిడ్డ ప్రాణ ప్రదాత.......
Dr. యశ్వంత్ రెడ్డి పటేల్....గారికి
మా ప్రత్యేక పాదాభివందనం....మరియు
నియో వైద్య బృందానికి
మా కుటుంబం తరుపున
నా శత కోటి వందనాలు......
