పేదోడి కలలు… -అర్జున్ నర్ర
పేదోడి కలలు… -అర్జున్ నర్ర
పేదోడి కలలు….
పెద్ద చదువులు చదివి
పేదరికాన్ని
రూపుమాపుతా
అనుకున్న కానీ….
పేదవాళ్ళ జాబితాలో
మొదటి స్థానంలో
నేనే ఉంటా అనుకోలేదు
అక్షరాలు నేర్చుకోని
సర్టిపికెట్ పట్టుకోని
ఎంగిలి మెతుకులు తింటు
ఆకలి పరీక్షలు రాస్తునే ఉన్న…
ప్రశ్న పత్రాల లీకేజిలకి
నా కలల ఉద్యోగం
'కల’గానే మిగిలింది
అమ్మ నాన్నల
చెమట చుక్కలతో
అక్షరాల విత్తనాలు నాటారు
మా ఇంట్లో డిగ్రీ సర్టిఫికెట్స్
పూలు పూసాయి
కానీ
ప్రశ్న పత్రాల లీకేజీలకి
వాటి పరిమళం వాడింది
స్కూల్ చదువు వెయ్యిల్లో
కళాశాల చదువు లక్షల్లో కట్టి
కోటి ఇచ్చి కొలువును
కొనుక్కున్నాడు వాడు
మతం సృష్టించిన
కులానికి-వృత్తికి
నేను పరాజీతుడనైనాను!
అక్షరాలు నేర్చుకున్నా
అన్నం కోసం వెతుకుతూనే ఉన్నా!
జ్ఞానం మరియు నైపుణ్యం ఉన్న
దరఖాస్తులకు ధనముండాలన్నారు
పరిశ్రమలకు సిఫార్సు ఉండాలన్నారు
మౌఖిక పరీక్షలో
డబ్బు ముఖాన్ని చూపమన్నారు
సామాజిక న్యాయం లేని వ్యవస్థలో
మానవత్వం నశించిపోయినట్లే!
