నా ప్రాణ సఖి కుంభమేళ -పుష్కర గాథ అర్జున్ నర్ర
నా ప్రాణ సఖి కుంభమేళ -పుష్కర గాథ అర్జున్ నర్ర
ద్వాదశ దాంపత్య
వసంతాల కుంభమేళ
నాప్రాణ సఖి – పుష్కర గాథ
పన్నెండేళ్ల మన ప్రేమ అనుబంధం
పన్నెండు నదుల సంగమం
కాల గడియారంలో
ఒక కుంభమేళ-పుష్కరాల మహోత్సమై నిలిచింది
పన్నెండు వసంతాల జీవనయానంలో
నా బాధలు, ఆపదలు,
కష్టాలు, కన్నీళ్లు
అన్నీ నీ ప్రేమజలాల్లో కరిగించి
సంతోషాల స్వరమాలికలు వినిపించావు
నదిలో...
ప్రతి ఏడాది పుష్కర స్నానం
పాపక్షాళన చేస్తే
నీతో నడిచిన ప్రతి అడుగులో
గడిచిన ప్రతి గడియలో
బాధాక్షాళన చేసి
కొత్త ఉత్సాహాన్ని ప్రసాదించి
నా జీవనమేళలో
అనుభూతులను ఉప్పొంగించావు
నదితీరంలో..
పుష్కర మేళాలో లక్ష దీపాలకాంతిలా
మా ఇంట్లో ఆప్యాయతల
వెలుగును వెదజల్లి
ప్రేమ మూర్తికి ప్రతిబింబమైనావు
నా తమ్ముళ్ళ మాంగల్య ఘంటికల
శుభనాదం వెనుక
నీ నిశబ్ద త్యాగ గీతం వినిపించింది
నీ మౌన స్వరం వారికి
గృహాల రూపంలో ఆశీర్వాదమైంది
నీ చేతులు
ఆకాశాన్ని తాకే నా ఆశయాలకు
హద్దు లేని వంతెనగా మారాయి
నువ్వు అడిగింది ఏమీ లేదు
నీ మౌన గర్భం నుంచి అన్నీ ఇచ్చావు
నా నేత్రంలో నక్షత్రం వలె
నా పక్కన నిలిచిన నిస్వార్థ సహచరిణివి
నీ పెదవులు ఏనాడు అడ్డు చెప్పని
ఓ సహనా నది ప్రవాహ వాహిణివి
ఎంత చెప్పినా – చెప్పడానికి
భాషల్లో పదాలు ముద్రించబడలేదు
నీ హృదయం నది కన్నా విశాలం
నీ సున్నితత్వం పుష్పమంత మృదువైనది
ఈ ద్వాదశ వసంతాల గడియారం
మన విజయ దరహాస మధుర స్మృతులను,
మన ప్రేమ యాత్రల ఘంటలను
ఢమరుకంలా మ్రోగిస్తుంటే
నా హృదయ గర్భం నుంచి
పొంగిన జీవన సత్యం
నువ్వు – నేను
ఒకే శ్వాసలో సమన్వయం చేయబడ్డ అర్ధనారీశ్వరలం
మన ఉనికే ఒక శివశక్తి సాక్ష్యం
- నా అర్థాంగికి అంకితం

