విత్తనం
విత్తనం
విత్తనం
విత్తనం కలలు కన్నది
సకల జీవులకి ఆయువునన్నది
ధరణి గర్భమందు పురుడు పోసుకొని
గగన తలంలోకి ఎగబాకుతానంది
గల గల పారేటి సెలయేటి నీరు తాగి
శాఖాను శాఖలుగా ఎదుగుతానంది
విరబోసుకొన్న కురులలో విరులను తూరుముకొని
మలయ మారుతం రాగాలను ఆలాపిస్తానంది
ఘీంకార, ఝంకార నాదాలకు నాట్యమాడుతానంది
పచ్చపచ్చని వనమై పసిడి సిరుల పంటనైతానంది
వత్తులుగా, గుత్తులుగా
పువ్వులుగా, కాయలుగా
ఫలాలుగా, మారి సకల ప్రాణులకు
ఆహారాన్ని అమృతంలా అందిస్తానంది
చిగురునై, వగరునై, తరువునై
తనువంత రోగాన్ని హారించే దినుసునై
దివ్య ఔషధంగా ఔతానంది
చెట్టునై, పట్టు దారమై, నారనై, నేత చీరనై
పెళ్లి మంటపంలో వధువుతో ముస్తాబైతానంది
రైతు పొలంలో నాగలినై
గురువు చేతిలో బెత్తంమై
రక్షక బటుని చేతిలో లాఠీనై
న్యాయస్థానంలో గావెల్స్ నై
రాజు చేతిలో రాజదండంనైతనంది
కలపనై, కిటికీ రెక్కనై
తలుపునై, కట్టే మంచమై
పొయ్యిలో వంటసరుకునై
పేదోడి గుడిసెలో వాసమై
ముసలి వారికి ఉతకర్రనై
దేవుడి గుడిలో పీఠంమై,
చివరికి వల్లకాడిలో
కాయాన్ని కాల్చే కట్టెనై
శివైక్యం చెందుతానంది.
రచన © : అర్జున్ నర్ర
