మహిళామణి
మహిళామణి
తనశక్తిని తాను సరిగ..తెలిస్తేనె మహిళామణి..!
నిర్భయముగ ప్రశ్నించగ..ఎదిగితేనె మహిళామణి..!
సాధికారతంటే అది..ఒకరిచ్చే దానమేమి..
ప్రేమమీర ఉపాయముగ..గెలిస్తేనె మహిళామణి..!
స్త్రీ అంటే ఆదిపరా..శక్తి కదా అబల ఎలా..
సదావేశ స్ఫూర్తితోటి..కదిలితేనె మహిళామణి..!
కన్నతల్లి తానేగా..అనురాగ సుధారాశి..
నిదానముగ చెలిమిమీర..చరిస్తేనె మహిళామణి..!
సామాజిక సంక్షేమం..తనలక్ష్యం కావాలిక..
న్యూనతాభావం విడనాడితేనె మహిళామణి..!
ప్రగతిని సాధించగా ముందడుగు వేయాలిక..
స్వయంప్రేరక శక్తిగా మారితేనె మహిళామణి..!
సామూహిక ఆధ్యాత్మిక..నవశక్తిని పొందాలిక..
తరుణీమణి త్యాగధనిగ..మిగిలితేనె మహిళామణి..!
పురుషులమది మేలుకొల్పు..సిరియె కదా అసలు ధనం..
మరి సాహస సహనాలను..ధరిస్తేనె మహిళామణి..!
మానవతా మూర్తులైన..మాతృమూర్తులదే రాజ్యం..
సమయానుకూలముగా స్పందిస్తేనె మహిళామణి..!
