నేను నాది
నేను నాది
తనివితీర వ్రాసుకున్న..ఉత్తరాన్ని చింపేశా..!
బాధంతా ఒంపేయగ..నచ్చకనే మింగేశా..!
వాడు నన్ను చేర రాడు..ఎప్పటికీ ఇదే నిజం..
పలు ఆశల గాలిపటం..సుడిగాలికి విసిరేశా..!
హాయికి అర్థం చెప్పను..మాటలకేం తెలుస్తుంది..
అనుభవాల సుగంధాన్ని..మట్టికి కానుక చేసేశా..!
పరదాలో ఓ కోకిల..విరహగీతి పాడుతోంది..
వసంతాన్ని తనకోసం..హృదిలోనే దాచేశా..!
తెలిమబ్బే జాడలేదు..వానెప్పుడు వచ్చేనట..
ఎదురుచూపు వాకిట్లో..నా ప్రశ్నను పాతేశా..!
'నేను-నాది' లేవన్నది..రుజువెలాగ పట్టాలో..
జన్మల గది తాళంచెవి..గాలింపే వదిలేశా..!
