అతను మన ఘంటసాల
అతను మన ఘంటసాల
సప్తస్వరాలు సప్తవర్ణాలై
అతని పాటను అల్లుకుంటాయి
గాన గంధర్వుడు కదా
ఆ గంధర్వ పరిమళాన్ని తమలో నింపుకోవాలని ఆశ...
అతను గతించి దశాబ్దాలు దాటినా
అతని పాట ఇప్పటికీ నిత్యనూతనమే
ఆ పాట చెవిన పడిన ప్రతిసారీ
మనసు కన్నీరెడుతుంది
ఆనందభాష్పమవుతుంది
రెక్కలు విప్పిన పక్షవుతుంది
విరిసిన మందారమవుతుంది
ఆ ఆనుభూతిని ఎంతని చెప్పగలం...
సినిమా పాటేగా అని తీసేయకండే
సినిమా పాట లలితంగా కమ్మగా హృద్యంగా చెవిలో వెన్నెల జల్లు కురిసిన కాలంలో
అతన్ని హత్తుకోని వారెవ్వరు
వారెవ్వా అని గుండె లోలకమై ఊగాల్సిందే కదా ఇప్పటికీ...
ప్రేమికుడు,భగ్నప్రేమికుడుకీ
అతనే ఆధారం
భక్తి,రక్తి,ముక్తి ద్వారాలను మురిపెంగా తెరుస్తుంది అతని పాట
అతని స్వరం ఈనాటికీ తెలుగుజాతి వరమేకదా
భాష కల్తీకాని రోజుల్లో వాయిద్యాలు హోరై కమ్మేయని కాలంలో
అతని పాట గుండెను ఒరుసుకుంటూ లోనకి
సెరయేటి గానంలా జారిపోతూఉండేది
కాలం మారినా అనుభూతి మారలేదు
సరికదా పదునెక్కుతోంది..
.
ఎక్కడున్నాడో
ఏ గంధర్వలోకం ఆస్థానగాయకుడయ్యాడో
కమ్మని పాటను
తీయని రాగాన్ని తీగెతో చుట్టేసిన పీచుమిఠాయిలా ఇచ్చి వెళ్ళిపోయాడు
కావాలనిపించినప్పుడల్లా నాలుకపై అద్దుకోండర్రా అంటూ
అది చాలుగదా మనకు....
తండ్రీ ఘంటసాలా
పరిగెట్టే జీవితంలో అసంతృప్తి జ్వాలు ఎన్నో
మారుతున్న కాలంతో
మారలేని బతుకులెన్నో
భయపెట్టే పోటీ ప్రపంచంలో
'జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా' అంటూ ధైర్యమిచ్చే నీ పాట ఒక్కటే
మూగపోయిన గుండెకు
'పాడుతా తీయగా చల్లగా
పసిపాపలా నిదురపో' అంటావు చూడు అది చాలయ్యా
నువు 'మధురం శివమంత్రం మహిలో మరువకె ఓ మనసా'
అంటే చాలు
పరమేశుడు గుండెలో వాలిపోతాడు కదా
మనసు వాపోయినప్పడల్లా
'మనసు గతి ఇంతే మనిషి బతుకింతే'అని ఓదారుస్తూనే ఉంటావుగా
అవిభాజ్యంగా నీ పాట
మా తరం జీవితాలకు తోడుగా
కాచే నీడగా మాతో సాగుతూనే ఉంటుంది
ఏమిచ్చి ఋణం తీర్చుకుంటాం
నీ పాటను వీలయినప్పుడల్లా నెమరువేసుకోవడం తప్ప...
(డిసెంబర్ 4 ఘంటసాల జయంతి)