ఆమె ఆమెనా
ఆమె ఆమెనా
ఆమె
సుకుమారి
సుమ పారిజాతం
ఆమె
హరిచందనం
దేహమే కాదు
సుగంధమే స్వేదం కూడా
ఆమె
వెన్నముద్ద
వేడి చూపుకే కరిగిపోయే
మృదు ముగ్ధ.......
ఆమె
రాగరాగిణి
అనురాగాన్నంతా
హృదయ లాకర్లో దాచుతుంది....
ఆమె
మాతృమూర్తి
తన రక్తాన్ని పంచుతుంది
రాగాన్ని కడవలతో వొంచుతుంది....
ఆమె
అతి పవిత్ర
మనో తనువులను
తనవాడికే పంచుతుంది....
అనుకున్నా నిన్నాళ్లు!
అరిగించుకోలేకున్నా
గరళ సత్యాన్ని
అనుకున్నానిన్నాళ్లూ
మగాడే మృగాడనీ
మదన కైపులో అంధుడౌతాడనీ
డామిట్...కాలం అడ్డం తిరిగిందేమిటి?
వింటూనే వున్నా
విధిని నిందించుకుంటూ..
ఈ చిత్త విభ్రమమేమో!
ఈ మదన ప్రకోపమేమో!
ఈ కామాగ్రహమేమో!
ఈ అక్రమ ప్రియుళ్లేమిటో!
ఆ మోజులో
ఆ మత్తులో
నిక్రృష్ఠ శృంగారోన్మత్తులై
ఆమెలు మట్టు పెట్టిన మొగుళ్ళూ...
పసిగాయల గొంతులు పిసికిన తల్లులూ...
చిత్రం!
దారుణంగా
క్రూరంగా
ఘోరంగా
పైశాచికంగా
కుటిల పథకాలతో
ఊహకందని జిత్తులతో..
ఊహించ లేకున్నాను
ఉదతిలో ఇంత కాఠిన్యమా !
కార్యాలయంలో ఆడబాసుల
లైంగిక వేదింపులా!!
హతవిధీ
మతి చెడిందా?
కాలమా!
నీదింత నికృష్ట రూపమా!
