వాయుపుత్రుడు
వాయుపుత్రుడు
ఫలమటంచును తల్చుచు పరుగు పెట్టి
బాల భానుని మారుతి పట్టవచ్చె
వాయుసూనుని శక్తికి' భళి!భళి!'యని
వేల్పులెల్ల వరమిడి దీవించి రపుడు
వరసుగ్రీవుని సచివుడై వరలుచుండి
కష్టసుఖముల యందున కాపుగాచె
వీర రాఘవుడిని కొల్చి వినయమొప్ప
దాసుడై చెలగిన మేటి ధర్మశాలి.
సీత జాడకై వెదుకుచు శీఘ్రగతిని
జలధి లంఘించి నిల్చిన జయకరుండు
తల్లి సీతనోదార్చెను తనయుడౌచు
ముద్రిక నిడుచు మాతకు ముదము కూర్చె
బలము చూపుచు పెకలించి పాదపముల
రాక్షసాధములన్ జంపి రంకెవేసి
లంక దగ్ధంబు గావించి రయ్యిమనుచు
రామచంద్రుని చేరెను రవణ జూపి
భావి తరమున జగముకు బ్రహ్మయతడు
భక్త హనుమకు మ్రొక్కిన వరములొసగి
వెంట వెనుక చరించుచు భీతిమాన్పు
మారుతిని కొల్చి పూజించ మంగళంబు
జరుగుచుండగా జనులకు జయము కలుగు.//
