శివ శివ
శివ శివ
శార్దూలం.
ఏమయ్యా శివ!మమ్ములన్ గనవు? మేమీ హీనమౌ జన్మలో
కామోద్రేకములందు మున్గితిమి మా కర్మంబులన్ గాల్పగా
నీ ముందున్ బడి వేడుచుంటిమయ మా నేరంబులన్ దల్చకో!
భీమేశా!దరిఁ జేర్చి జ్ఞానమిడుచున్ బ్రీతిన్ గటాక్షింపుమా!//
శార్దూలం.
ఈ దేహంబును బెంచి భోగములచే నింపార పోషించుచున్
మోదంబొందిన వారమై బ్రతుకుచున్ పుణ్యంబు క్షీణింపగా
నే దారిన్ గనలేని దీనత మెయిన్ హే!శంకరా!యంచు నిన్
మా దిక్కంచు తలంచి మ్రొక్కితిమి సన్మార్గంబు చూపించుమా!//
శార్దూలము.
దీనాలాపన మాలకింపవయ!సందేహంబు నీకేలనో!
ప్రాణంబుల్ కడగట్టిపోవగ నిటన్ భారంబుతో నిల్చి ని
న్నో నాగేశ!యటంచు పిల్చితిమి మా యుద్వేగమున్ ద్రోలగా
కేదారేశ్వర!రావ!మాదరికి నీ క్రేగన్నుతో గాంచగన్ //
ధ్రువకోకిల.
ధనము శాశ్వతమంచు నిత్యము తల్చి మోహపు దారిలో
చనుచు దుఃఖము పొందువారము శాంతినీయుమ దేవరా!
ఘనుడ వీవని నమ్ము కొంటిమి గౌరినాథ!ఉదారతన్
మనికి నిల్పుమ జీవ రక్షక!మాకు దేవర వీవెగా!//
మత్తకోకిల.
సత్య సద్గుణ రూప!ధూర్జటి చంద్రశేఖర రక్షమామ్!
నిత్యనిర్మల తేజ మమ్ముల నెమ్మితో కరుణించుమా!
నృత్యకేళి విలాస భైరవ!నిష్ఠ మీరగ సేవ చేయు నీ
భృత్యులన్ విడనాడకో!ప్రేమతో మము సాకుమా!//
