STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

అంతులేని సంపద

అంతులేని సంపద

1 min
20

అంతులేని సంపద.
(వచనకవిత)

**********************************
ధనము కనిపెట్టి మనుజుడు దానికే దాసుడై చరియించుటేల?
మునిగిపోవునకటా! మాయలోబడి మురికి కూపము లోపల!

కపటమెంతయొ చేయుచుండును కాసుకై సతము కడుపుగొట్టి.
చపలత్వముతో బ్రతికి మనశ్శాంతినే కోల్పువునే మదముపట్టి.

ఆయురారోగ్యములు నశియింప నా జీవితమున కర్థమేమిటి?
చేయగలిగిన దేమున్నది? జీవితమ్మున కూడబెట్టున దేమిటి?

ధనమూల మిదం జగత్తను సామెతను తరచి తెలుసుకోవలె!
కనుపించు భోగములు కాటిదాకా వెనుక ముందు నడచి రావులె!

దయాగుణముతో నడచి దానగుణముతో సాగుచుండుటే ధనము.
ప్రయత్నపూర్వకముగా పరులకుపకారము చేయుటే విధివిధానము.

బంధుమిత్రులను కూడి కష్ట సుఖాలను పంచుకొనుటే గొప్ప పెన్నిధి.
బంధములు నిల్పి తల్లిదండ్రులను బాధ్యతగా గాంచుటే పరమావధి.

పసిపాపల బోసినగవులే పసిడి ధారలై గృహమునందు కురియునుగ.
వసివాడని యనురాగముతో భార్యా భర్తలు జీవించుటే భోగమనగ

ఎంచి చూడగా కీర్తి ప్రతిష్ఠలే యెనలేని సొమ్ములై యలరారునుగ.
మంచి తనముతో మెలగుటే మహిలోన తరగిపోని భాగ్యమనగ.

పేదగొప్పయను భేదమును చూపకుండుటే విలువైన విద్యయనగా.
'నాది నాది!' యను భావనయే తుదకు నష్టమును కలిగించుగా.

ఆరోగ్యముతో నూరేళ్లు హాయిగా సాగుటే అంతులేని విభూతి.
తేరిచూడగా పరమాత్మ నెఱుంగుటే దివ్యమైనట్టి యనుభూతి.//
*****


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics