సాహితీ 'గురు' జాడ
సాహితీ 'గురు' జాడ


అతడు తొలి తెలుగు కథానిక
'దిద్దుబాటు'తో మనకు
ఓనమాలు దిద్దించి కథకులను చేసి
తెలుగు సాహిత్య జాడకు...'చాన'కు
జడలు అల్లిన అక్షర అమ్మ...నాన్న!
వెలుగు లీనలేని వాడుకభాషకై
జనభాష ఉద్యమాల గిడుగు
పురిటి నొప్పులు భరించి
మన భాషకు జన్మనెత్తించినప్పుడు
గిడుగుకు చాందస్తుల గోడు వేడి
తగలకుండా తనదైన శైలిలో
గొడుగుపట్టి వాడుక భాషకు
కవిసామ్రాట్టుల మదినుండి
మద్దతు తెప్పించి జననాడి
అనిపించుకున్న గురజాడ మనవాడే
అంటూ గుండెనిబ్బరంగా
వాడుక భాషలో సాహిత్య సేద్యం
చేసుకోడానికి సాహసం నేర్పిన
గురజాడ తెలుగు కథల ఓడ!
కున్యాశుల్కం శిల్పిగా....
కలకాలం 'నాటకం' నిఘంటువై
విశ్వతెలుగు వినువీధుల్లో...
సాంఘిక సంస్కరణ పరమార్ధం
పంచిపెట్టి సాంఘిక నాటకాలకు
పంచె కట్టి హుందాగా నడిపించిన
నవయుగ వైతాళికుడు గురజాడ!
ముత్యాల సరాలతో మాడువాసన
ఒట్టి సాంప్రదాయవాదులు
మనస్సుల చీకటికి వెలుగులు నింపి
గట్టివాడు మన అచ్చతెలుగువాడు
అని పిలిపించుకుని మంచి అన్నది
పెంచుటే దేశభక్తని చాటిన
శిఖరాగ్ర సాహితీ శిఖామని గురజాడ!
అటు ఆంగ్లం ఇటు ఆంద్రం రెండింటిలో
రాశికన్నా వాసి ముఖ్యమన్నట్లు మెరిసి
సాహితీ వినీలాకాశంలో నిండుచంద్రుడై
వెలిగి వెన్నెల వెలుగు పెంచుతున్న
బహుముఖ సాహితీ తార గురజాడ!
కవితలు,నాటకాలు, కథానికలు
వ్యాసాలు, సాహితీ వ్యాపకాలు
అతని మదినుండి మల్లెపూలై
గుభాళించాయి..గుభాళిస్తున్నాయి
గుభాళిస్తూనే వుంటాయి... ఉంటాయి!
......'గురజాడ' వర్ధంతి సందర్భంగా