క్షీరసాగర మథనము
క్షీరసాగర మథనము
క్షీరసాగర మథనము
సురలు దైత్యులు కూడి సుధఁ గోరుచు కూర్మిని
బిరబిరా చిల్కిరా పెన్నిధి పాలేఱుని
కవ్వపు కొండపట్టి కలశాబ్ధి పైనుంచి
చివ్వున తిరుగుచుండి చెలిమిని విజృంభించి
వాసుకిని త్రాడుగా వాలంబునా సురలు
భాసురంబుగ త్రిప్ప బలముతో దైత్యులు
నురగంపు శీర్షంబు నుద్ధతిగ చేకొనుచు
చెరచెరా చిల్కిరా క్షీరాబ్ధిని తెరలుచు
మందరంబట మున్గ మాధవుండరుదెంచె
ముందుగా నా గిరిని మూపున పట్టియుంచె
కూర్మరూపము దాల్చి కూర్మితో హరి నిల్వ
నర్మిలిని దేవతలు నయముగా నట కొల్వ
దేవదానవు లిట్లు దిశలనే మ్రోగించ
సావధానంబుగా సాధ్యులై దీపించ
హాలాహలము పుట్టె నా జగము వణుకంగ
ఫాలాక్షు డరుదెంచి పానంబు సల్పంగ
పార్వతీ పతిఁ గొల్చి ప్రణతిగ నుతించంగ
సర్వజగంబులే సవ్యమై తిరుగంగ
కామధేనువు దివ్య కల్ప వృక్షము తోడ
కామితంబులు తీర్చు కల్యాణి సిరితోడ
నచ్చరలు పుట్టగా నశ్వ రాజంబురికె
ముచ్చటగ చంద్రుండు మురిపెంబుగా కులికె
సిరినితా పత్నిగా శ్రీకరుడు వరియించ
విరులనట జల్లుచూ వేల్పులే నుతియించ
సుధాకలశంబుతో శోభితముగా నిలిచి
నా ధన్వంతరి జిగి నద్భుతముగా తలచి
మునులు దేవతలు వే మ్రొక్కిరా తరుణాన
కనులలో దివ్యమౌ కాంతులా సమయాన
వరములే పండగా వాంఛలే తీరంగ
మురియుచూ జనులెల్ల ముకుందుని మ్రొక్కంగ
శ్రీకరంబుగ జగతి సిరులతో సాగింది
ప్రాకటంబగు భాతి వర్థిల్లి వెల్గింది //
