శ్రీనాథుడు
శ్రీనాథుడు
1.
సీసము.
చిఱుతప్రాయంబున శ్రీనాథ కవిరాజు
కావ్యముల్ రచియించి ఘనతకెక్కె
కంచుఢక్కను గొట్టి కనకాభిషేకంబు
పొందినాడానాడు పుడమి మెచ్చ
సారసత్వ సభలో సార్వభౌమపదవి
కూడగట్టుకొని తాన్ కొలువు తీరె
వివిధసీమలఁ గెల్చి విజయుడై నిల్చుచు
సౌఖ్యంబుల దవిలి సంతసించె.//
తేటగీతి.
గండపెండేరముఁ దొడిగి పండితుండు
సంస్కృతాంధ్రకన్నడములన్ శాస్త్రరీతి
నభ్యసించిన కవివరుడాంధ్రమాత
పాదములఁ బట్టి కొల్చెను భక్తిమీర.//
2.
సీసం.
పరమేశు చరితముల్ వ్రాసిన కవిరాజు
నైషధంబును జెప్పి నేర్పరిగను
భోగభాగ్యంబుల భువిలోన స్వర్గంబు
కాంచిన మేటియా కవివరుండు
ముదుసలి వయసున మోయుచు భారంబు
పేదరికంబులో భీతినొంది
పలుతెఱంగుల వేడి పరమాత్ముని గొలిచి
దివికేగినాడు యా ధీవరుండు.//
తేటగీతి.
భారతీ దేవి పుత్రుడై భాషయందు
కీర్తిశిఖరాల నందెను స్ఫూర్తి నొసగు
ఘనుడు శ్రీనాథ కవిరాజు గాథ వినుచు
ప్రణతిఁ జేసితి నా తెల్గు పండితునికి.//
