మా బామ్మ
మా బామ్మ
మా బామ్మ.
బామ్మ వత్తుల పెట్టెలో పైకముండు
నర్థరూపాయి పెట్టి నా హస్తమందు
ముద్దు చేయుచు మా బామ్మ మురిసిపోవ
చెంగుచెంగున దూకుచు చిందు వేసి
పాఱి పోయితి నా చిఱు ప్రాయమందు.
తిక్క పనులను జేసి నే బిక్కమొగము
వేసి భయముతో నుండగా వెనుక వచ్చి
అమ్మ కోపంబు నార్పుచు నడ్డు తగిలి
'వెఱ్ఱి భడవ!'డనుచు నన్ను పిలిచి నగుచు
కాచు కొనుచుండు మా బామ్మ కలిమి నాకు.
పట్టెడన్నము తినలేక పరుగు పెట్టి
నాట లాడుచు నుండగ నాకలెఱిగి
కథలు కబురులు చెప్పుచు కమ్మనైన
బువ్వ పెట్టును మా బామ్మ బొజ్జనిండ.
తారలన్ జూచి రాతిరి తన్మయముగ
"కోసుకొందము రమ్మ!"నికోరుకొనగ
మాట మార్చుచు మా బామ్మ పాట పాడి
నిదుర బుచ్చును నా మీద నెమ్మి జూపి.
"వేడ్కమీరగ వీడికి పెండ్లి జేయ
కనుల పండువగా గాంచి కాలిపోదు "
ననుచు మా బామ్మ పలుకగా నశ్రువులిట
జారు చున్నవి బుగ్గపై ధారవోలె.
మనవరాలగు నా పత్ని మనసు పడగ
పట్టు చీరలు నాణ్యమౌ పసిడి నగలు
ముచ్చటగ పెట్టి మా బామ్మ పొంగిపోవు.
"నలుసు నొక్కని కన రాద!నాకమునకు
వెడలి పోవుదు నేనంచు" వెఱ్ఱి బామ్మ
హరిని వేడుచు గరుడవి హంగమిపుడు
పంప మనుచుండి భక్తితో ప్రణతు లిడును.
బామ్మ ఋణమును దీర్చెడి పసిడిరాశి
చెంత లేదనుచుండి నే చింత బోతి
బామ్మ ప్రేమను తల్చుచు వందనములు
చేయు చుందును నిత్యము శిరమువంచి.//
