మన మామిడి పండ్లు
మన మామిడి పండ్లు
మన మామిడి పండ్లు.
(తేటగీతి మాలిక )
మండు వేసవి కాలంబు మరల వచ్చె
ఫలము లందున మామిడి ఫలము రాజు
తీయ తీయని పండ్లను తృప్తి మీర
తినెడి వారిదే భాగ్యమీ దేశమందు //
ఆవకాయను బెట్టగా నతివ లిపుడు
సంత లందున జేరిరి సంతసముగ
మంచి మామిడి కాయల నెంచి చూచి
బేర మాడిరి వెలదులు విలువ తెలిసి.
ముక్క కొట్టించి నింటికి మోసుకొచ్చి
నావ కాయను బెట్టిరి 'యాహ!'యనుచు
క్రొత్త పచ్చడిన్ బెట్టుచు కొంతతీసి
వేడి యన్నము కలుపుచు వేడ్కతోడ
పిల్లలందరిని బిలిచి పెట్టిరపుడు.
ఆంధ్రజాతికి గర్వమీ యావకాయ.
తెలుగు వారిసత్కీర్తిని దిశల యందు
వ్యాప్తి చేసిన మామిడి పండ్ల రుచికి
వివిధ దేశాల వారును ప్రీతి చెంది
భరత భూమిని పొగడుచు 'భళి!భళి!యని
ధనము నిడుచుండి కొనుచుంద్రు ఘనముగాను.
కలిమి పంటయౌ ఫలములన్ గలుషితముగ
కృత్రిమరసాయనంబుల చిత్రమైన
పధ్ధతుల తోడ మగ్గించి వణిజులిపుడు
సంతలందున నమ్ముచు జనులనెల్ల
మోస పుచ్చుట వలననే ముప్పు వచ్చె!
బలము పెంచెడి మామిడి పండ్లు తినగ
జబ్బులెన్నియో వచ్చుట సత్యమాయె!
మందు జల్లుచు పండ్లను మగ్గబెట్టు
దోషులందరిన్ శిక్షించి దొరలు నేడు
మంచి పండ్లను ప్రజలకు పంచవలయు!//
