సీతాకళ్యాణం
సీతాకళ్యాణం
సీతాకళ్యాణం.
(తురగవల్గన రగడ )
వ్రాసి రామ కథను బోయ పరమ పథము పొందినాడు
దాసకోటినెల్ల బ్రోచు దాశరథిని చేరినాడు
గాధిసుతుని యజ్ఞమునట కావ రాము డరుగుదెంచె
బాధపెట్టు రక్కసులను బలము తోడ సంహరించె
రామపాద మహిమ వలన రాయి నాతి రూపుగాంచె
తామసంబు తొలగి పోవ తరుణి మిగుల సంతసించె
మేటితనముఁ జూపుచుండి మిథిల కేగ దాశరథులు
సాటిలేని యందగాళ్ళు సాగుచుండ జానపదులు
2.
మురిసి మూర్ఛపోయిరంట!ముద్దులొల్కు రాజసుతులు
తరలు చుండ మిథిల జనులు తరచి కనిరి మరచి మతులు.
హరుని విల్లుఁ జూపి జనకు డాసభాభవనమునందు
చరిత నచట తెల్ప ఋషికి హర్షమొంది మౌని ముందు
వరుడు రామచంద్రు గాంచి పాటవంబు జూపుమనగ
చిరునగవుల రాఘవుండు చేత విల్లునందుకొనగ
ఫెళ్లుమనుచు కొండ వంటి పెద్ద విల్లు విరిగె నపుడు
త్రుళ్లి పడె జగంబులచట తోష మొందె వాణిధవుడు.
3.
వీర్యశుల్కయైన సీత వీరరాఘవుడిని గాంచె
కార్యశూరుడంచు తలచి కరము వణుక శిరము వంచె
సిగ్గులొల్కుమోము వెలుగ సిరుల తల్లివోలె కలికి
నిగ్గు దేలు తనువుతోడ నెమ్మితనపు నగవు చిలికి
పారిజాతమాల తెచ్చి వరుని కంఠమందు వేయ
శ్రీరఘువరుడపుడు సీత చేయి పట్టి యడుగు వేయ
శివుడు మురిసి నాట్యమాడ చెంత గిరిజ నవ్వినపుడు
దివిజవరులు దివిని నిలిచి దిగులు వీడి మ్రొక్కిరపుడు //
