వేదసంస్కృతి
వేదసంస్కృతి
వేదసంస్కృతి.
(తేటగీతి పద్యములు)
మనము నందున మొలకెత్తి మత్సరంబు
క్రోధగుణముగా మారిన కొఱత యగును
శాంతి సహనంబు వీడిన జనుల బుద్ది
పరుల హింసకై నిత్యము పరితపించు!
పెద్ద వారిని దూలుచు వెఱ్ఱిపుట్టి
నేటి తరమున కొందరు నీచులైరి
పరుల దేశంపు పోకడ పట్టుకొనుచు
పాడు పనులను చేయుచు వరలిరకట!
విలువ నెరిగించు ధర్మమౌ విద్య నేర్పి
పిన్నవయసులో పిల్లలన్ ప్రేమతోడ
మంచి పౌరులుగా తీర్చి మానితముగ
కట్టుబాట్లతో పెంచిన కలదు సుఖము!
సాధులౌ పాలకు లెపుడు జాతి నేల
వేద సంస్కృతిన్ గైకొని విబుధవరులు
ముందు చూపుతో జనులకు బోధచేసి
వెలుగు నింపగా సీమలో వెతలు తీరు!
