కొత్తపొద్దు
కొత్తపొద్దు
చీకటి పొరలు చీల్చుకొచ్చే
సూర్యోదయం అందాన్ని
కనులారా ఆస్వాదిస్తూ వున్నా..
ఆ అందమైన చిత్రం
కనుల కెమెరాలో
రెటీనా పై నిక్షిప్తం చేశా..
అంతలోనే ..ఏమయిందో మరి..?
లేలేత కిరణాలు కాస్త
కోపంతో ఆక్రోశంతో
పగను పెంచుకున్న
శత్రువులా
పోరాడే సైనికుని
తుపాకీ తూటాలా
నాపై దూసుకొచ్చాయి..
ఆపై చాలదనక
మా అరుగు మీదకు
ఆపై గది గోడలకు
కసిమీద ఇల్లెక్కేసింది
అదేనండోయ్ ఎండ..!
భస్మాసుర నృత్యంలా
శివతాండవం చేసింది
ఆటవిడుపుకు ఆతిధ్యమిచ్చే
మా ఇంటి అరుగు కాస్త
కర్ఫ్యూ విధించిన వీధిలా
ఖాళీగా బోసిపోయింది
కత్తికున్న వాడి వేడి
ఆ ఎండలో అగుపించింది
సలసల మరుగుతున్న
నీటినుండి వెలువడే ఆవిర్లను
నిప్పుల కుంపటి ముందు
రగిలే సేగలను తలపించింది
తనకే హాని తలపెట్టని
నాపై ఎందుకింత కక్షనో
ఇప్పటికీ అర్థంకాని
భేతాళ ప్రశ్నగానే
మిగిలిపోయింది నాలో..
