"నడివీధి భారతం"
"నడివీధి భారతం"
" నడివీధి భారతం " - రాజేష్ ఖన్నా
నడివీధిలో నగ్నంగా నడిస్తే నవ్వులపాలౌతారు
నవీనంలో నటలెక్కువైతే నట్టేటా మునిగిపోతారు
నవ్వినా, నవ్వించినా చీకటిబాధలో వెలుగౌతారు
నాది అన్నా స్వార్థమెక్కువైతే ఆ చీకట్లోనే కలుస్తారు
మనుషుల్లో మచ్చుకైనా మాధవుల్లేరు కేవలం
మహీశుడవ్వాలనుకొనేటోళ్లు తప్పా
మాతృభూమిని కీర్తించే మాగధుడు సహితం
మహీశ్వరుడి కంటే అవుతాడా గొప్పా
అంతా నటనే, అగుపించేదంతా నాటకమే
వేదికగా సరిపోలేని విశ్వమంతా విస్తుపోయే కదా
విశ్వవేదికలపై విచ్చలవిడిగా నటననేర్చిన
నరులకి నడివీధులెలా సరిపోతాయి
సామాజిక బాధ్యతలు సంసిపోయాకా
సమైక్యతా భావాలు సన్నగిల్లిపోయాకా
సత్సంబంధాలు మంటగలిసిపోయాకా
నకిలీ సంబరాలు అంబరాన్నంటాకా
చిత్తుకాగితాలు చిందరవందరగా పరిగెత్తాకా
చిత్రమైన బ్రతుకుతెరలు చిరిగి తల్లడిల్లకా
నడివీధి చీకట్లు పగటిసూర్యుణ్ణి మింగాకా
మిగిలిందేమిటని, నడివీధి నటన తప్పా
నట్టింటి ఎండుటాకులు నడివీధిలోకి నడిసొచ్చి
గాలితెరలపై గాయపడిన బ్రతుకుల్ని చిత్రంగా వేస్తే
అలిగి నలిగినా చెత్త కాగితాలు కవిత్వాలు రాస్తే
జాలిలేని చలిచీకట్లు వీధుల్లోపడి విసురుగా వీస్తే
పాదచారుల నగ్నపాదాలకింద నలిగిన దిగంబరినేలని
పడకలుగా చేసిన అమాయకుల ఆశలు అరిస్తే
పట్టించుకొని తలపంకించే నాథుడెక్కడా
వీధులెవరికి సొంతం? వీధిదీపాల వెలుగుకి
పారిపోలేకా అక్కడే పడుకున్నా అమాయకుల
జీవితాల్లో నక్కినా చీకటికా లేకా
జడివానలకి జడిసిపోని అలుపెరుగని
అభాగ్యుల రుధిరపాద ముద్రలకా?
అక్రమంగా అన్యాయంగా అడ్డదిడ్డంగా
సంపాదనెంటా
పరిగెత్తే పగటివేషగాళ్లకా?
అవి అందరికీ సొంతమైనప్పుడు
వాటిమీదా అందరికీ హక్కున్నప్పుడు
అందరూ వాటి గురించి మరీ ఆలోచించరే!...
అమాయకంగా మూగబోయినా వీధుల్లో
ఎన్నో అభాగ్యుల జీవిత చిత్రాలేయబడ్డాయి
వాటిని తూడ్చేయ్యడానికి, పూడ్చేయ్యడానికి
ఒకడు ప్రమాదాలు సృష్టించిపోతాడు
మరొకడు ప్రమాదాలు కొనితెచ్చుకొంటాడు
పాదచారుల త్రోవలమీదున్న జీవితాల్ని చూసి
ఒకడు చలిస్తాడు, మరొకడు ఛీ అంటాడు
ఆపసోపాల్ని ఆకళింపు చేసుకొన్న ఆ ఆవాసాలు
అభాగ్యులకి అనుకూలంగా మారి ఆదుకొంటాయా
ఆ వీధిమనుషుల్ని నడివీధులు ప్రేమించినట్టుగా నరుడు తన తెలివితో ప్రేమించలేడేమో
మనిషికి నడివీధులు ఎందుకు
నడివీధులు నరుడికి తుమ్మడానికి
నిర్లక్ష్యంతో నీడున్నచోటా ఉమ్మడానికి
అమాయకుల బ్రతుకుల్ని అమ్మడానికి
పాదాచారులకెప్పటికీ ఆ నడివీధులు మట్టినేలలే
ఆ వీధిమనుషులకవీ అన్నం వడ్డించే పళ్లెంలా
ఏహ్యంగా ఎంగిలి మెతుకులు విసిరిన బల్లెంలా
బ్రతుకులు మారకుండా బంధించినా గొళ్ళెంలా
ఎక్కడికీ ఎగిరిపోకుండా కాళ్ళకేసినా కళ్లెంలా
ఈ నవీన భారత నడివీధులు వెలిగిపోతున్నాయి
అభాగ్యులకళ్ళల్లో వెలుగుతేని వీధిదీపాలతో
విచిత్రమైనా విన్యాసలెందుకనీ
ఆశలురేపని ఉదయానికి మెరుగుల
తళుకులు ఎందుకనీ
తలంపులు రాని నడివీధుల్లోకి తలుపుల
వలపులు ఎందుకనీ
దేశం నడివీధుల్లోనే వెలిగింది
దేహంలేని వీధినపడ్డ జీవితాల్ని వెలేసింది.
నట్టింటా అత్యాశలతో వెలిగిన ఆరాటాలు
నడివీధిలో నలిగిన జీవిత పోరాటాలు
నవీనభారతంలో నడివీధులెప్పటికీ మారునో
నా గుండెల్లో రేగిన అగ్ని జ్వాలలెప్పటికీ చల్లారునో!..
--- RK