తధ్యం...తధ్యం(కవిత)
తధ్యం...తధ్యం(కవిత)


తధ్యం ...తధ్యం...!!!
ఏమిటో ...
ఉదయం లేచేసరికి సువిశాల ప్రపంచమంతా
వలయచట్రంలో బిగించబడి విలవిలలాడుతున్నట్టుంటోంది.
రోజు రోజుకూ వలయ రూపం విలయంగా మారి
స్పైరల్ గా రూపాంతరం చెందడం వైరల్ అవుతోంది.
ఆకుపచ్చని అంతర్గత కణాలేవో
తనచుట్టూ పరిభ్రమణం చేస్తున్న కలవరం.
మనషి మనిషితో మాట్లాడే మాటలే కాదు
తనతో తాను మాట్లాడుకునే వాక్యాలు
నిశ్శబ్ద లోతుల్లోకి జారిపోతున్నాయి.
గత నాలుగు తరాలుగా అమ్మల, అమ్మమ్
మల
మాటలు చాదస్తమని చీదరించుకుని
పాశ్చాత్యంవైపు పరుగెత్తిన ప్రాయశ్చిత్తపు ఫలితం
రక్తబంధాల్ని, ప్రేమపాశాల్ని తాకలేని, తాకరాని దుస్థితి
రాత్రీ పడుకున్నప్పుడే కాదు పగలు కూడా ఎవరో
ఆకుపచ్చని దుప్పటిని ప్రపంచంపై పరుస్తున్న భావన.
యంత్రాలకు సమానంగా సమాంతరంగా తన జీవితాన్ని
మలచుకున్న మానవుడు ఇపుడు ధ్యానం లోకి
పరకాయప్రవేశం చేయడం అత్యంత ఆవశ్యకం.
నిరసిస్తే, సమాధిలోకి వెళ్ళడం మాత్రం తధ్యం తధ్యం!!!~
సమాప్తం