జననీ జన్మ భూమిశ్చ (కవిత)
జననీ జన్మ భూమిశ్చ (కవిత)


జననీ జన్మ భూమిశ్చ (కవిత)
సుషుప్తిలో వచ్చిన కమ్మని కలలా
నిరంతర జీవన పోరాటపు శ్రామికశక్తిలా
జాతి నిత్యం పాడుకునే జాతీయగీతంలా
జీవితేఛ్ఛను ప్రసాదించే పల్లె కన్నె పైరగాలిలా
దేశరక్షణే జీవనశ్వాస అయిన వీరజవాను పహారాలా
మమతానుబంధాల పొదరిల్లై
అలరిస్తుంది మా జన్మభూమి...
దూరంగా ఉన్నామన్న బాధా వీచిక మెలిపెట్టినప్పుడు
ప్రపంచపటంలో భారతాన్ని చుంబిస్తే చాలు
లవకుశలు అమ్మవొడిని పవళించిన దివ్యానుభూతి...
మంచుగొడుగుక్రింద మూడు చలివేంద్రాలమధ్య
ఒక నిత్య చైతన్య దీపిక మా జన్మభూమి...
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా
మా " నవ "జాతి శ్వేతపత్రంపై
ఆకుపచ్చని సంతకం మా జన్మభూమి...
సెలవుల విరామంలొ వలసపక్షులమై
వాలినప్పుడు తన వెచ్చని రెక్కల్లో
పొదువుకునే నెమలితల్లి మా జన్మభూమి...
తరతరాల చరితను భావితరాల ప్రపంచీకరణకు
విత్తులుగా వెదజల్లిన కర్షకుని
ప్రతిరూపం మా జన్మభూమి...
మనిషి మనుగడకు మనసును
అనుసంధానంచేసి జీవనపరమార్ధాన్ని
పరిమళించే వేదభూమి మా జన్మభూమి...
ప్రపంచజ్ఞానాన్ని పరి "పూర్ణం "తో మేళవించిన
అగణిత విజ్ఞానవారధి నా జన్మభూమి...
మానవీయతా మడి చమరించినప్పుడు
ఆర్ద్రతా నయనాలు సాయంచేసే చేతలై
కర్తవ్యదీక్షను శిరసావహించినట్టే...
అనన్య దేశభక్తి వందేమాతరగీతమై
త్రివర్ణ పతాకపు నీడలో నడిపించేది
మా జన్మభూమి... !!!
**************************
.