లాక్-డౌన్(కవిత)
లాక్-డౌన్(కవిత)
లాక్ - డౌన్ (కవిత)
ఇంతవరకు తెలియని
ఒక కొత్తసముద్రంలో
మనిషి నిరంతర ఈత మొదలైంది.
అవాంతరాలన్నింటిని
వీరసైనికునిలా తుత్తినియలు చేస్తూ
పరవళ్లు తొక్కుతూ ప్రవహించిన
ఆతని తీరుకు జీవనదులు ఉలిక్కిపడ్డాయి.
సముద్రాలు లోతులు తడుముకున్నాయి.
సముద్రం ఎప్పటికీ ఆదర్శమే...
లక్ష్యపు తీరంచేరేవరకు అలుపెరుగని
ఉత్సాహపు మల్లెల నురగలు...
మరో సమస్య సాధనకోసం
మౌనంగా వేసే వెనకడుగు
కదనోత్సాహపు ముందడుగు కోసమే...
ప్రపంచాన్ని వణికిస్తున్న
ఒక జిగట
జీవి - కరోనా
సృష్టించిన లాక్ - డౌన్
మున్నెరగని మహాసముద్రమై
మనిషిని ముంచేస్తుంటే ...
బతికి బతికించడంకోసం
ఈతమొదలెట్టాడు...
మనిషికి బ్రతుకు ఈత కొత్తేమీకాదు ...
అవసరమైనప్పుడు నిశ్శబ్డాన్ని ఛేదించినవాడే
తనచుట్టూ మౌనకవచాన్ని ధరించి
"విశ్వ మిత్రుడు" కాగలడు.
తనకు తానే ఆదర్శమై
సంఘటిత సహకారంతో
లాక్-డౌన్ మౌనసముదాన్ని
గెలిచేరోజు రేపు కాని నేడే...!!!
**************
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్