ఒక్క ఉచ్వాస్వపు నిస్వాసనంలో...
ఒక్క ఉచ్వాస్వపు నిస్వాసనంలో...
ఒక్క ఉచ్వాస్వపు నిస్వాసనంలో...
ఒక సంస్కరణ చేపట్టాలంటే అధికారానికి
ఒక దేశ పతాకమంతా పొగరుండాలి...
ఒక ఊడలమర్రి చీడ తొలగాలంటే
దాని పాతాళ మూలాగ్రానికి మందు కొట్టాలి...
ఒక వ్యవస్థ ప్రక్షాలింప బడాలంటే
భగీరధ యత్నాన్ని సిద్ధింప చెయ్యాలి...
సప్త సంద్రాల ఆవల చెట్టుతొర్రలో చిలుక ప్రాణం కోసం
మొదటి అడుగే లక్ష్య ప్రకంపన కావాలి...
అర్ధరాత్రి మొదలయ్యే ప్రళయానికయినా
అమ్మకడుపు చలువ ఆలంబన కావాలి.
* * *
ఎక్కడెక్కడో అనంతాల దిగంతాలలో
లంకెల బిందెల కొట్లాట మొదలయ్యింది...
వర్ణ వర్గ లింగబేధాలు మరచి ఆర్జించిన
“ కట్టల “ పాములలో
కకలావికలమైన కలవరం...
భరించలేని దుర్గంధాల మధ్య దాచినగుప్తనిధులు
బంధనాల గుండెలు బాదుకుంటూ బయటపడ్డ వైనం...
లంచగొండి, ఆర్ధిక నేరస్తుడు,నల్లకుబేరుడు
బిరుదాంకితులంతా అభ్యంగస్నానానికి ఉపక్రమించినవేళ
స్వార్ధపరత్వపు ఆలోచనల వలల మధ్య ముక్కలైన ధనలక్ష్మి
బిందు స్థానంలో బీటలబొమ్మై ప్రతిష్టింపబడింది.
* * *
ఒక చట్ట బద్ద కార్యాచరణ
నిజసేవకుడిలో ఊపిరి పోసుకుని
కార్చిచ్చులా వ్యాపించిన తరుణంలో
అచ్చమైన పేద సామాన్యునికి
ఒకింత సాయం చేసే కార్యసిద్దికి
పరిపాలనా చతురతకు
ప్రణమో “వ్యూహం “... ప్రణమామ్యహం!!!
<<<<<< :: >>>>>>>