ద్వేషమొక ప్రేమగా..
ద్వేషమొక ప్రేమగా..
నన్ను తాకిన గాలి
నీ వైపే వస్తోంది
అదిగో
నువ్వలా చింతనిప్పులాంటి కళ్ళతో చూస్తే
భయపడి ఎగిరిపోయింది
నా మీద కురిసే వర్షం
లోపలున్న నీకు ముచ్చెమటలు పట్టించింది
నువ్వు తడమని చోటుని వెతికి
మరీ మరీ ముద్దాడింది
ఇష్టమే లేకపోతే
అంత కోపమెందుకు
నన్నెవరైనా తాకితే
ఇంత ఉలికిపాటు దేనికి
నీ వశం కాలేదనా
నీ వశమై
మాయ నుంచి బయటపడి
ప్రేమను కోరాననా
నీకంటే గట్టిగా ఎవరైనా కౌగిలించుకున్నప్పుడు
నీలాగే బండరాయిలా ప్రవర్తించినప్పుడు
నీ వైపు చూసిన నా అశక్తత
వేదనను దిగమింగి
నీకోసం వేడుకల్లో పాల్గొన్నాను
ఇంకా నీకర్థం కాకుంటే
ఆ నేరం నాది కాదు
ద్వేషమొక ప్రేమయే అని నీవంటే
నే గంతులు వేస్తూ
నీకోసం రాలేను