STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Comedy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Comedy

వంకాయ మహత్యం

వంకాయ మహత్యం

2 mins
363

            వంకాయ మహత్యం

            -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   " వంకాయ వంటి శాకముతో భోజనం తినడానికి కూడా అదృష్టముండాలి. నిజంగా నీ మొగుడు అదృష్టవంతుడే శ్రావ్యా!" కూతురుకి నచ్చచెబుతూ భార్య అన్నపూర్ణ చేసే వంట రుచిని తలచుకుంటూ చెప్పాడు పరమేశం. 


   "ఏంటి నాన్నా... మీరూ అలాగే చెప్తారు. మార్కెట్ లో ఎన్నో రకాల కూరగాయలు ఉండగా ఈవంకాయలు తప్పించి ఏమీ దొరకనట్టు గంపెడు మోసుకొచ్చారు. ఇంటికొచ్చే కొత్తల్లుడికి ఇవేనా వండిపెడతారు?" చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలాంటివి తెచ్చి పెట్టి భోజనం పెట్టాలి గానీ...మరీ ఈ వంకాయ కూరతోనా...?" భర్త దగ్గర తన పరువేం కానుందోనని తెగ ఫీలైపోతూ తండ్రి దగ్గర వాపోయింది శ్రావ్య.


    "ఎంత అల్లుడైతే మాత్రం శనివారం పూట చికెన్లూ, మటన్లు ఎలా వండిపెట్టగలను..? రేపు ఎలాగూ ఆదివారమే కదా. మటన్ బిర్యానీ చేసి చికెన్ కూరతో పాటూ గారెలు చేస్తాను. అవి చాలవనుకుంటే రొయ్యలు కూడా తెప్పించి వేపుడు చేసి పెడతానులేవే." చేతులు పైట చెంగుతో తుడుచుకుంటూ వంట గదిలోంచి వచ్చి చెప్పింది తల్లి అన్నపూర్ణ.


   "ఏంటోనమ్మా! ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే ఈ వంకాయ కూరకటి చేయకుండా మానవు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నేను టెన్త్ చదివేటప్పుడు అనుకుంటాను నువ్వు ఊరెళ్లినప్పుడు వంకాయ వేపుడు చేయడం ప్రయత్నిద్దామని వంకాయ ఇలా కోసానో లేదో...ఇంత పురుగు బయటపడింది. అప్పటినుంచీ నాకు వంకాయ అంటేనే అసహ్యం" అంది ముఖం ముడుచుకుంటూ శ్రావ్య. 


   అబ్బబ్బా...నువ్వూరుకోవే తల్లీ . రొయ్యల్నీ, చేపల్నీ పట్టుకోవడం నాకూ చిరాకే. మరేం చేస్తాను చెప్పు...వాటిని నేను తినకపోయినా మీ అందరికీ ఇష్టమని చెప్పి నేను వండటం లేదా? నీకు వంకాయ అసహ్యమని చెప్పి...అందరికీ ఇష్టం లేకుండా పోతుందా చెప్పు. అందులోనూ నేను వంకాయలతో రకరకాల కూరలు చేస్తాను. అవన్నీ నాన్నగారికి నచ్చుతాయి. నేను వండినట్టు ఎవరూ వండలేరన్న ధీమా కావచ్చు. అందుకే ఎవరైనా వస్తున్నారంటే అన్ని వంకాయలు మోసుకొచ్చేస్తారు. 


   "సర్లే అమ్మా...అమ్మ ఎలాగూ ఒక్క వంకాయ కూరతో సరిపెట్టదు కదా...దానితో పాటూ సాంబారూ, కొబ్బరి పచ్చడి, అప్పడాలు, బంగాళదుంప వేపుడు కూడా చేస్తుంది. దానితో పాటూ కొత్తావకాయ కూడా రుచి చూపిద్దాం". అయినా...వంకాయతో చేసినన్ని రకాల కూరలు ఏ కాయగూరతోనూ చేయలేము. పచ్చడి, పులుసు, వంకాయ పచ్చిపులుసు, వంకాయ కారం, వంకాయ ఇగురు కూర, వంకాయ వేపుడు, గుత్తివంకాయ ఇలా ఎన్నెన్నో చేయొచ్చు" అంటూ తండ్రి పరమేశం లొట్టలేస్తుంటే...ఇక చెప్పడం అనవసరమని నెమ్మదిగా లోనికి జారుకుంది శ్రావ్య.


            ***    ***    ***


   అల్లుడు వినయ్ రానేవచ్చాడు. అత్తగారు కంచంలో గుత్తివంకాయ కూర వడ్డిస్తుంటే "చాలు చాలు" అని అల్లుడు అనడంతో....శ్రావ్య ముసిముసిగా నవ్వుకుంది. 


   " ఏం అల్లుడు గారూ! మా శ్రావ్యలా మీకూ వంకాయ కూర నచ్చదా? అన్నాడు పరమేశం.


   అబ్బే అదేం లేదు మావయ్యా! రుచి చూడాల్సినవి చాలా వున్నాయి కదాని...అంటూ అన్నంలో కూర కలుపుకున్నాడు వినయ్.


           ***   ****   ***


   మర్నాడు ఆదివారం శ్రావ్య కోరుకున్నట్టుగా అల్లుడు కోసం మాంసాహారంతో వంటలన్నీ ఘుమ ఘుమ లాడించేసింది అన్నపూర్ణ.


   భోజనాల సమయం అవ్వడంతో...అన్ని రకాలు వడ్డించారు అల్లుడికి.


   కంచం ముందు కూర్చుని..."ఇవన్నీ మాఅమ్మ ఎప్పుడూ చేసి పెడుతూనే ఉంటుంది. ఫ్రిడ్జ్ లో రాత్రి చేసిన వంకాయ కూర ఏమైనా మిగిలిందేమో చూడు" అన్నాడు భార్య శ్రావ్య చెవిలో గుసగుసగా వినయ్.


   ఆ వంటలు కాకుండా వంకాయ కూరని అడుగుతున్న భర్త ముఖాన్ని అయోమయంగా చూసింది .


   "నిజానికి మా అమ్మ వంకాయ కూర వండితే పెద్ద ఇష్టంగా తినను గానీ...అత్తయ్య ఎంతో అద్భుతంగా వండారు. రాత్రి మళ్లీ వడ్డించుకోడానికి మోహమాటపడి వేసుకోలేదు." అన్నాడు మళ్లీ.


   భర్త మాటలకు శ్రావ్య కెవ్వున కేకేసింది.

   "నాన్నోయ్... నువ్వన్న మాట నిజమేనన్న మాట...వంకాయ వంటి శాకము దగ్గర మాంసాహారం కూడా దిగదుడిపే. నువ్విచ్చినట్టుగా మీ అల్లుడు కూడా అమ్మ వంకాయ కూరకు సర్టిఫికెట్ ఇచ్చేసారు" అంటూ.


  పరమేశం, అన్నపూర్ణ ముఖాలు నిగనిగలాడే వంకాయల్లా మెరిసిపోయాయంటే...నమ్మాలి మరి...!!*


   



Rate this content
Log in

Similar telugu story from Comedy