Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.
Read a tale of endurance, will & a daring fight against Covid. Click here for "The Stalwarts" by Soni Shalini.

Spoorthy Kandivanam

Comedy Drama Romance

4.6  

Spoorthy Kandivanam

Comedy Drama Romance

గోపాలం పెళ్లి

గోపాలం పెళ్లి

6 mins
517


"భగవంతుడా...! ఈ సారైనా వీడు ఒప్పుకునేలా చూడు తండ్రి", అంటూ ఎదురుగా ఉన్న కృష్ణుడిని వేడుకుంటున్న కస్తూరి చెవిలో, "ఈ విషయంలో నువ్వు వేడుకోవాల్సింది ఆ గోపాలుడిని కాదు ఈ గోపాలంని", ముప్పైరెండు పళ్ళు బైటపడేలా నవ్వుతూ అన్నాడు గోపాలం.

అసలే పెద్దగా ఉన్న కళ్ళను మరింత పెద్దగా చేసి గుర్రున చూసింది కస్తూరి.

"ఒరేయ్..! ఎందుకురా నిద్రపోతున్న సింహాన్ని కదిలిస్తావు..", వ్యంగ్యంగా అన్నాడు జగన్నాథం. కస్తూరికి మరింత కోపం వచ్చి భర్తను, కొడుకుని ఏదో అనబోతుంటేనే హారతి పళ్లెంతో పూజారి వాళ్ళను సమీపించడంతో ఆగిపోయింది.

"మా పాలిట ఆ కృష్ణ భగవానుడిలా వచ్చి మమ్మల్ని బ్రతికించావయ్యా..", అంటున్న జగన్నాథంని అయోమయంగా చూసాడు పూజారి.

"మ్మ్... మ్మ్....సెటైర్లు వేసింది చాలు గాని ముందు హారతి తీసుకోండి", అంది కస్తూరి సర్రున చూసి.

ముగ్గురూ హారతి మొక్కి, ఆ తర్వాత తీర్థం, ప్రసాదం తీసుకుని క్యూలోంచి బయటపడ్డారు. కాస్త ఖాళీగా ఉన్న వైపు వెళ్ళి కూర్చున్నారు.

"ఒరేయ్..! ఈ సారి ఏమైనా వెధవేశాలు వేశావంటే చూడు", అంది కస్తూరి గోపాలం నెత్తిమీద మొట్టి.

"అబ్బా..అమ్మా...!", అంటూ తలను రుద్దుకుని, "నచ్చాలిగా...", అన్నాడు చిరుకోపంగా చూస్తూ కొబ్బరి తీసి తల్లికి ఇస్తూ.

"నచ్చకపోవడానికి ఏమైందని..! ఇంతవరకు చూసిన అమ్మాయిలు అందరూ ఎంత లక్షణంగా ఉన్నారు. నీ చెత్త అనుమానాలతో వాళ్ళందరినీ కాదన్నావ్"

"అనుమానాలు కావు అవి, జాగ్రత్తలు.."

"అఘోరించావు...! ఏంటా జాగ్రత్తలు! అసలు మనం మొదట చూసిన అమ్మాయి సినిమా హీరోయిన్ లా ఎంత బాగుంది, సాఫ్ట్వేరు జాబు...ఎంతసేపూ కంప్యూటర్లు, ప్రోగ్రాములు, క్లైంట్స్ అంటూ బిజీగా ఉంటుంది పైగా ఫాస్ట్ కూడా ఉంటారు అంటూ ఆ అమ్మాయిని కాదన్నావు. రెండో సారి చూసిన సంబంధం...అమ్మాయి డాక్టరు, ఆ అమ్మాయిని చేసుకుంటే మీ జంట చూడముచ్చటగా ఉండేది. కానీ డాక్టరు అంటే ఎప్పుడూ పేషెంట్లు, మందులు, హాస్పిటల్ ఇదే ఉంటుంది, పైగా ఇది తినొద్దు, అది చేయొద్దు అంటూ స్ట్రిక్ట్ గా ఉంటారు వొద్దు, అని ఆ అమ్మాయిని కూడా వొద్దన్నావు. ఆ అమ్మాయి మన ఇంటి కోడలు అయ్యుంటే ఎంత బాగుండేది. మనకి బాగోలేనప్పుడు ఎక్కడో ఉన్న హాస్పిటల్ కి పరిగెత్తే బదులు మన ఇంట్లోనే ఓ డాక్టర్ ఉంటే ఎంత బాగుండేది.."

"అవునవును...హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయి...", అన్నాడు జగన్నాథం కొడుకు ఇచ్చిన కొబ్బరి ముక్కను నములుతూ. తండ్రి అలా అనేసరికి గోపాలం ఫక్కున నవ్వాడు.

ఇద్దరినీ అలా చూసి కస్తూరికి కోపం వచ్చి, "నేను ఇక్కడ ఇంత సీరియస్ గా చెప్తుంటే మీకిద్దరికీ నవ్వులాటగా ఉంది..", అంటూ అసహనంగా మొఖం పక్కకు తిప్పుకుని కూర్చుంది.

"అమ్మా..కస్తూరమ్మా.. ప్లీస్ క్షమించండి! మీరు ఇలా కోపంగా ఉంటే అస్సలు బాగోదు", తల్లిని కూల్ చేయడానికి ప్రయత్నిస్తూ అన్నాడు గోపాలం.

"నువ్వు చేసే దానికి కోపం కాకుంటే ఇంకేం వస్తుంది. సరే ఆ రెండు సంబంధాలు అలా అన్నావు. మూడో సంబంధం ఏమైందని. ఎంత హుందాగా పద్దతిగా ఉంది ఆ అమ్మాయి. నాకు చాలా నచ్చింది ఆ సంబంధం. కానీ నువ్వేమో అమ్మో..! స్కూల్ టీచరా!వొద్దు, ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుంది, అన్నిటికీ క్లాసు పీకుతుంది", అన్నావు.

"అవును మరి. స్కూల్లో మా టీచరు చెప్పే క్లాసులే సరిగా వినలేదు, ఇహ ఇప్పుడు టీచరమ్మని చేసుకుంటే స్కూలు నుంచి నేను మిస్సయిన క్లాసులన్నీ రోజూ వినాల్సొస్తుంది"

"ఆ...అలా అనే...వొద్దే వొద్దు అని ఆ అమ్మాయిని కూడా రిజెక్ట్ చేశావ్. వాళ్ళు రెండు మూడు సార్లు ఫోను చేసి అడిగారు. వాళ్ళకి కూడా మన సంబంధం బాగా నచ్చింది, నువ్వు ఒప్పుకోనుంటే ఈ పాటికి పెళ్లి కూడా అయిపోయేది. పాపం వాళ్ళు ఎంత బాధపడుంటారో ఏమో"

"వాళ్ళు బాధ పడతారని చెప్పి నాకు నచ్చకున్నా ఒప్పుకోమంటావా..", అన్నాడు గోపాలం.

"నచ్చకపోడానికి ఆ అమ్మాయికి ఏం తక్కువ. నువ్వు ఇలానే చేస్తూ పోతే, ఇంకొన్ని రోజులు ఆగితే ఏజ్ ఎక్కువైంది అని నీకు ఎవ్వరూ పిల్లనివ్వరు", అంది కస్తూరి.

"అప్పుడు వీడికంటే అదృష్టవంతుడు మరొకరు ఉండరు..", ఒకచేత్తో కళ్ళజోడు సరిచేసుకుంటూ మరో చేత్తో ఫోను నొక్కుతూ అన్నాడు జగన్నాథం.

చిన్నగా నవ్వాడు గోపాలం.

"మీకు ఈ మధ్య నా మీద సెటైర్లు ఎక్కువయ్యాయి..", అంది కస్తూరి కళ్లెర్రజేసి భర్తను చూసి.

"ఏదో నీ అభిమానంలే కస్తూరి", అన్నాడు జగన్నాథం వ్యంగ్యంగా.

కస్తూరి అసహనంగా, "ఇవన్నీ కాదు ఇప్పుడు మనం చూడ్డానికి వెళుతున్న అమ్మాయిని నువ్వు ఓకే చేయాల్సిందే. అందరికి అది ఇది అని వంకలు పెట్టావు. అమ్మాయి ఉద్యోగం చేసేది, పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనేసిందంట. ఇక నీకు వంకలు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. పైగా అమ్మాయి చాలా బాగుంది, నాకే కాదు మీ నాన్నకు కూడా నచ్చింది", అని, "చెప్పరేం", అంటూ భర్త వైపు చూసింది.

"అవును రా. నాక్కూడా నచ్చింది ఈ అమ్మాయి", అన్నాడు జగన్నాథం.

"నాన్న! ఇలా హాండ్ ఇచ్చారెంటి...", అన్నాడు గోపాలం తెల్లమొకంతో.

జగన్నాథం భుజాలు ఎగరేసి తిరిగి ఫోను వైపు చూసాడు.

"అయినా మీకు నచ్చితే సరిపోదు, నాక్కూడా నచ్చాలి. సరేలే ఏం చేస్తాం. ముందు అమ్మాయినైతే చూద్దాం", అన్నాడు గోపాలం నీరసంగా.


గోపాలం బ్యాంకు ఉద్యోగి, ఏడాది నుంచి అతనికి ఇంట్లోవాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే గోపాలంకి కాస్త ఫాంటసీలు ఎక్కువ. సినిమాల్లో లాగా తనకు వచ్చే అమ్మాయిని గురించి చాలానే ఊహించుకుంటూ ఉంటాడు. అతనికి చందమామ అన్నా, వెన్నెల అన్నా చాలా ఇష్టం. తన భార్యతో కలిసి ఆ చంద్రుడి వెన్నెల దుప్పట్లలో అల్లుకుపోవాలని కలలు కంటూ ఉంటాడు. అతనికి వచ్చే అమ్మాయికి కూడా తనలాగే అభిరుచి ఉండాలని అతని కోరిక. అలాంటి అమ్మాయి దొరక్కపోదా అని ఎదురుచూస్తున్నాడు.

* * * * * *

ఇక ముగ్గురూ అమ్మాయిని చూడ్డానికి వాళ్ళింటికి చేరుకున్నారు. పరిచయాలు, కాఫీలు, టిఫిన్లు అయ్యాక, అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పెద్దవాళ్ళు మాట్లాడాకా, అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోడానికి కాస్త ప్రైవసీ ఇచ్చారు.

ఇద్దరికీ ఎలా మొదలు పెట్టాలో తెలీక కాసేపు వారి మధ్య మౌనం పోరాటం చేసింది. దాన్ని చేదిస్తూ గోపాలమే ముందుగా, "మీ పేరు..!", అని అడిగాడు.

"రచన..", సౌమ్యంగా చెప్పింది రచన.

"ఒహ్..నైస్ నేమ్..", అంటూ అలా కొన్ని పొడి పొడి మాటలు మాట్లాడుకున్నాక.

"మీ అభిరుచులు తెలుసుకోవచ్చా", అన్నాడు గోపాలం.

రచన, "ఆహ్..నాకు పుస్తకాలు చదవడం, రాయడం అంటే చాలా ఇష్టం", అంది.

"రాయడమా..! అంటే..ఏం రాస్తారు..?"

"కథలు, నవలలు.."

"ఒహ్ వావ్...ఇంట్రెస్టింగ్... అయితే మీరు రైటర్ అన్నమాట.."

"ఈ మధ్యే మొదలు పెట్టానండి", సిగ్గులమొగ్గై చెప్పింది రచన.

గోపాలం "ఒహ్..", అని "తను రైటర్ ఆ..వావ్..రైటర్ అంటే ఎంత మంచి టేస్ట్ ఉంటుంది. అలా ఊహా లోకానికి తీసుకెళ్లి మైమరిపించేస్తారు. మరో లోకానికి తీసుకెళ్లి విహరింపజేస్తారు. ఏమో నేను వెతికే అమ్మాయి తనే అయ్యిండొచ్చుగా", అనుకున్నాడు మనసులో.

ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తల్లికి, తండ్రికి తనకు అమ్మాయి నచ్చింది అని చెప్పాడు.

రచనకు కూడా గోపాలం నచ్చడంతో అంతా సంతోషించారు.

మంగళ వాయిద్యాలు, పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా జరిగింది గోపాలం, రచనల పెళ్ళి.

ఆ రోజు ఇద్దరికీ మొదటి రాత్రి.....

మల్లెల గుబాళింపుతో నిండి ఉన్న ఆ గదిలోకి బాల్కనీలోంచి పొడుచుకువస్తున్న వెన్నెల కిరణాలు ఆ గదికి మరింత అందాన్ని ఇచ్చింది. వెన్నెల వెలుగులో నిలబడి రచనను తలచుకుంటూ కలల లోకంలో విహరిస్తూ ఆమె కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాడు గోపాలం.

ఇంతలో తలుపు చప్పుడు వినిపించడంతో రచన వచ్చినట్లుందని చప్పున లోపలికి వచ్చాడు గోపాలం.

రచన ఒక చేత్తో పాల గ్లాసు, మరో చేత్తో బుక్కు, పెన్ను, ఫోను పట్టుకుని గదిలోకి రావడం చుసి షాకయ్యాడు గోపాలం.

"ఏంటి ఇవన్నీ...", అని అడిగాడు వెంటనే.

"ఆ...అదీ...ఇది నేను కథలు రాసుకునే పుస్తకంమండి. ఇది లేకుండా నేను ఎక్కడికీ వెళ్ళను", అంది.

"ఒహ్..సరే అవిటివ్వు, ఇక్కడ టేబుల్ పై పెడతాను"

"పర్లేదు..నేను పెట్టేస్తాను", అని చెప్పి రచన తన చేతిలో ఉన్న బుక్కు, పెన్ను, ఫోను అక్కడే ఉన్న టేబుల్ పై పెట్టి, మరో చేతిలో ఉన్న పాల గ్లాసుని గోపాలంకి అందించింది.

ఇద్దరూ చెరో సగం తాగారు. వెన్నెల వెలుగులు, మల్లెల గుబాళింపు...గోపాలం ఇక ఆగలేకపోయాడు, రచనని అమాంతం హత్తుకోబోతుండగా.."ఒక్క నిమిషం...", అంది రచన హటాత్తుగా, సినిమాల్లో పెళ్లి సీన్లలో తాళి కట్టేటప్పుడు మధ్యలో ఎవరో వచ్చి "ఆపండి", అన్నట్లుగా.

"ఏమైంది...", కంగారుగా అడిగాడు గోపాలం.

"ఏం లేదు..నేను రాస్తున్న సీరియల్ లో రీడర్స్ కి ఏం ట్విస్ట్ ఇస్తే బాగుంటుందా అని పొద్దున్నుంచి ఆలోచిస్తుంటే ఇప్పుడు వచ్చింది ఐడియా. మళ్ళీ ఫ్లో పోతుంది, నేను ఇప్పుడే వస్తాను", అంటూ చకచకా లేచి వెళ్లి టేబులుపై ఉన్న తన పుస్తకం తెరిచి కుర్చీలో కూర్చుని రాయడం మొదలుపెట్టింది రచన.

గోపాలం బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు. అలా కొద్దిసేపు గడిచింది. రచన తన రచనను కొనసాగిస్తూ నిమగ్నమయిపోయింది.

గోపాలం ఎదురు చూసి చూసి మూతలు పడుతున్న కళ్ళను అదుపు చేయలేక నిద్రలోకి జారుకున్నాడు.

ఇలానే వారం గడిచింది....

గోపాలంకి ఓపిక నశించింది.....

"ఇలా కాదు. ఈ రోజు ఎలాగైనా సరే రచనను రాయనివ్వకూడదు", అనుకుని రచన గదిలోకి రాకముందే తన పుస్తకం, పెన్ను దాచేశాడు గోపాలం.

రచన రోజూ లాగే గదిలోకి వచ్చింది. గోపాలం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని రచనతో అవీ ఇవీ కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఇద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా రచన మధ్యలో లేచి దేనికోసమో వెతుకుతుంటే, "ఏంటి వెతుకుతున్నావు", అన్నాడు గోపాలం ఏమీ తెలీనట్టు మనసులో నవ్వుకుంటూ.

"నా పుస్తకం ఇక్కడే కదా రోజూ పెట్టేది, కనిపించడంలేదు. మీరేమైన చూసారా? చాలా అవసరం. నా కథలో హీరోయిన్ కి ఎదురైన ఓ సమస్యకి తరువాత ఏం నిర్ణయం తీసుకుంటుందా అని సస్పెన్స్ లో ఉంచాను. నెక్స్ట్ ఎపిసోడ్ రాయడానికి ఓ మంచి ఆలోచన తట్టింది", అంటూ ఆతృతగా వెతుకుతుంటే, "వెతుకు వెతుకు...అది నీకు దొరకదుగా...", అని మనసులోనే నవ్వుకుంటూ, "పోనీలే రేపు వేతకొచ్చులేగాని నువ్వు ముందు ఇలా రా..", అంటూ భార్యని మంచంపై కూర్చోబెట్టాడు. ఎగ్జైట్ అవుతూ తను కూడా పక్కన కూర్చున్నాడు.

ఇంతలో, "ఆగండి..", అంటూ మళ్ళీ సడన్ బ్రేక్ వేసింది రచన. గోపాలం ఆతృతగా చూస్తూ ఉండిపోయాడు.

"బుక్కు లేకపోతేనేం, ఫోను ఉందిగా. దాంట్లోనే డైరెక్టుగా టైప్ చేసి రాసేస్తాను..", అంటూ టకటకా ఫోను తీసుకుని రాయటం మొదలు పెట్టింది.

గోపాలం నోరెళ్ళబెట్టి బిత్తరపోయి చూసాడు.

"రైటర్ అంటే కలల లోకంలో విహరింపజేస్తుంది అనుకున్నా. అది నిజమే అనుకుంటా..", అని మనసులో అనుకుని అసహనంగా బాల్కనీలోకి వెళ్ళి చిరాకుగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు.

అప్పుడే ఎక్కడో సన్నగా..."రావోయి చందమామ...మా వింత గాధ వినుమా...", అంటూ పాట వినబడింది.

"నా బతుక్కి మళ్ళీ సిట్యుయేషల్ సాంగ్ కూడా నా...", అంటూ కోపంగా ఆకాశం వైపు చూసాడు.

ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్న చంద్రుడు దర్శనమిచ్చాడు.

"నవ్వు..బాగా..నవ్వు. నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంటే నువ్వు ప్రశాంతంగా నవ్వుతున్నావా...! అయినా అందరి గాధలు వింటావు..కాస్త నా గాధ కూడా వినవయ్యా మామ...", అంటూ తన గోడుని ఆ చల్లని చంద్రుడికి వెళ్లబుచ్చుకున్నాడు.

ఇంతలో "ఛా...కరెక్ట్ గా ఇప్పుడే ఈ కరెంట్ పోవాలా. బుక్కూ లేదు...ఫోనులో రాద్దామంటే ఛార్జింగ్ కూడా అయిపోవొచ్చింది...", అంటూ చిర్రుబుర్రులాడుతూ బాల్కనీలోకి వచ్చింది రచన.


ఆ మాట వినగానే చుట్టూ ఒక్క లైటు లేకున్నా, గోపాలంకి మాత్రం మనసులో వేయి బల్బుల వెలుతురు వెలిగింది.

ఉప్పొంగుకొస్తున్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి చంద్రుడి వంక చూసాడు. చంద్రుడు మరింత అందంగా నవ్వుతూ అల్లరిగా కన్ను గీటినట్లు అనిపించింది గోపాలంకి. ఆలస్యం చేస్తే మళ్ళీ తన భార్యకు ఎక్కడ ఏ కొత్త ఆలోచన వస్తుందో అని క్షణం ఆలస్యం చేయకుండా ఇక రచనని అల్లుకుపోయి, ఆ వెన్నెల రేయిని ఓ అందమైన అనుభూతిగా మార్చుకున్నాడు గోపాలం.


........సమాప్తం......


©స్పూర్తి కందివనం


Rate this content
Log in

More telugu story from Spoorthy Kandivanam

Similar telugu story from Comedy