Spoorthy Kandivanam

Drama Inspirational Others

4  

Spoorthy Kandivanam

Drama Inspirational Others

రామయ్య కానుక

రామయ్య కానుక

3 mins
351


పొద్దున్న అయిదు గంటలకు నిద్రలేస్తే రాత్రి పడుకునే వరకు ఇంటి పనులు, వంట పని, తన ముగ్గురు పిల్లల ఆలనా పాలనా, భర్త, అత్తా మామలకు ఏలోటు రాకుండా వారికి సేవలు చేయడం, ఇలా ప్రతిరోజూ రోజంతా ఎడతెరిపిగా పనుల్లో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటుంది మహాలక్ష్మి.

రోజూలాగే పనులన్నీ ముగించుకుని, తమ గదిలో మంచంపై పిల్లలను వరుసగా పడుకోబెట్టి వాళ్ళను నిద్రపుచ్చి, లేచి వెళ్లి గూట్లో ఉన్న అమృతాంజనం డబ్బా తీసుకుని వచ్చి పిల్లల కాళ్ళ క్రింద కాస్త చోటు ఉంటే అక్కడ కూర్చుంది మహాలక్ష్మి.

అలసిన తన పాదాలకు అమృతాంజనంతో నిదానంగా మర్దనా చేసుకుని అలా ఓ పక్కకు నడుము వాల్చి కళ్ళు మూసుకుంది.

గదంతా నిశ్శబ్దం....

భర్త రామయ్య ఆఫీసు పని చేసుకుంటున్నాడు. ఆ నిశ్శబ్దంలో ఆయన వేళ్ళతో నొక్కుతున్న టైప్ మెషిన్ కీ బోర్డు చప్పుడు లయబద్దంగా మహాలక్ష్మి చెవులను తాకుతుంది.

కాసేపటికి ఆ శబ్దం ఆగిపోయింది. ఇంకా పూర్తిగా నిద్రలోకి జారుకోని మహాలక్ష్మి ఆ శబ్దం ఆగిపోయేసరికి నిద్రలోనే అప్రయత్నంగా తన బృకుటిని కాస్త ముడిచి మళ్ళీ యథాలాపంగా నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇంతలో హటాత్తుగా ఎవరో తన భుజాన్ని చిన్నగా తడుతున్న సంకేతాలు తన మస్తిష్కానికి చేరి ఒక్క ఉలికిపాటుతో తనని నిద్ర మేలుకునేలా చేసింది.

మహాలక్ష్మి టక్కున లేచి కూర్చుని, "మీరా..?", అని కాస్త ఊపిరి పీల్చుకుని, "చెప్పండి...ఏమైనా కావాలా?", తనకి ఎదురుగా నిలబడున్న భర్తను ఆతృతగా అడిగింది.

"ఊహు...", అన్నట్లు తల పంకించాడు రామయ్య.

"మరి...", అన్నట్లు చూసింది మహాలక్ష్మి.

"కూర్చోడానికి కాస్త చోటు ఇవ్వు", అన్నట్లు చూసాడు రామయ్య.

ఆ విషయం అప్పుడే గుర్తొచ్చినదానిలా చప్పున తన కాళ్ళను దగ్గరికి ముడుచుకుంది మహాలక్ష్మి. రామయ్య భార్యకి ఎదురుగా కూర్చున్నాడు.

"ఇప్పుడు చెప్పండి విషయం ఏంటి" అన్నట్లుగా ఆదుర్దాగా భర్తనే చూస్తుంది మహాలక్ష్మి.

ఇంతలో రామయ్య చిన్న చిరునవ్వు నవ్వి, మహాలక్ష్మి చేతిలో కొన్ని పేపర్లు పెట్టాడు.

"ఏంటివి?", అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూసింది మహాలక్ష్మి.

"తెరిచి చూడు", అన్నట్లుగా సైగ చేసాడు రామయ్య.

మహాలక్ష్మి చేతిలో ఉన్న పేపర్లను తెరిచి పరిశీలనగా చూసి, "నేను మళ్ళీ ఉద్యోగంలో చేరడమా...?", అని ఆశ్చర్యంగా అడిగింది భర్తని.

"అవును లక్ష్మి! నీ మనసు నాకు తెలీదా...! చిన్నప్పటినుంచి నీకు చదువంటే ఎంత ఇష్టం. అత్తమ్మా, మామయ్య పొద్దున్నే పొలం పనులకు వెళితే చిన్న వయసులోనే ఇంట్లో పనంతా చేసుకుని అలాగే నీకంటే చిన్నవాళ్లయిన నీ చెల్లి, తమ్ముళ్లకు పళ్ళు తోమి స్నానాలు చేయించడం దగ్గర నుండి వాళ్ళ బాగోగులు అన్నీ నువ్వే చూసుకుంటూ, వాళ్ళని అక్కగా కంటే ఓ అమ్మలా చూసుకునేదానివి. అవన్నీ చేస్తూనే నీ చదువును ఎక్కడా ఆటంకం లేకుండా, ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పకున్నా నువ్వే శ్రద్ధతో, శ్రమతో, ఆసక్తితో, అంకితభావంతో చదువుకున్నావు. స్కూలు అయిపోయాక మీ ఊళ్ళో కాలేజీలు లేకపోతే, రోజూ బాక్స్ కట్టుకొని అయిదు మైళ్ళు నడిచి వెళ్ళి పక్క ఊరిలో ఉండే ప్రభుత్వ కాలేజీలో నీ చదువుని కొనసాగించావు. అక్కడితో ఆగావా...ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువులు ఎందుకు... అనేవారు ఎంత మంది ఉన్నా, అవి లెక్కజేయనట్లు మామయ్య నిన్ను పై చదువులకు టౌనుకు పంపడానికి కూడా వెనకంజ వేయలేదు. నీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టౌనులో ఓ చిన్న రూము తీసుకుని, నీకు తోడుగా మీ నాయనమ్మను పెట్టుకుని నీ చదువు పూర్తిచేశావు. పట్టుదలతో నువ్వు అనుకున్నట్లు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించావు. ఇంత కష్టపడి చదివి, నీ ఆశయాన్ని నెరవేర్చుకున్నావు, కానీ పెళ్లయ్యాక నీ అన్నేళ్ల కష్టం వృధాగా పోతుంది అని తెలిసి కూడా నాకోసం, నా ఇంటికోసం, మన పిల్లల కోసం కష్టమైనా ఇష్టంగా నీ ఉద్యోగాన్ని వదులుకుని ఓ భార్యగా, తల్లిగా, ఈ ఇంటి పెద్ద కోడలిగా నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంటిని చక్కదిద్దుతూ గృహిణిగా ఉండిపోయావు. ఇంత చేస్తున్న నీకు ఏమివ్వగలను అని ఆలోచించినప్పుడు... నువ్వు కలలుగన్న నీ భవిష్యత్తును తిరిగి నీకు కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను మహాలక్ష్మి!", భార్య కళ్ళలోకి చూస్తూ చెప్పాడు రామయ్య.

"ఇవన్నీ మీకెలా తెలుసు?", విస్తుపోతూ అడిగింది మహాలక్ష్మి.

"నేను నీ భర్తని లక్ష్మీ! నీ మనసుని ఆ మాత్రం అర్ధం చేసుకోలేనా", మృదువుగా నవ్వి అన్నాడు రామయ్య.

మహాలక్ష్మి కళ్ళు ఉద్వేగంతో చెమ్మగిల్లాయి. అంతలోనే తమాయించుకుని, "కానీ నేను...ఇప్పుడు... ఉద్యోగం అంటే...మరి పిల్లలు...? అత్తమ్మా, మమయ్యని ఆడిగారా?", సాలోచనగా చిన్నగా అంది మహాలక్ష్మి.

"అదేం పెద్ద సమస్య కాదు లక్ష్మీ! ఇంట్లో ఇంతమందిమి ఉన్నాము. అమ్మ, చెల్లెళ్ళు, తమ్ముడు, మరదలు అందరూ ఉన్నాం కదా. పిల్లల గురించి నువ్వేం దిగులుపడకు మేము అందరం చూసుకుంటాము. ఇక ఇంటి పని అంటవా... చెల్లెళ్ళు సాయం చేస్తారులే. ఇహ అమ్మా, నాన్న సంగతి నాకు వదిలేయి. నేను చెబితే కాదనరు. తప్పకుండా ఒప్పుకుంటారు. పైగా మనింట్లో అందరూ చదువుకున్న వాళ్లే కాబట్టి ఇది పెద్ద సమస్యేమీ కాదులే", నమ్మకంగా చెప్పాడు రామయ్య.

"కానీ...", అంటూ మళ్ళీ ఏదో చెప్పబోతున్న భార్యను ఆపి, "కానీ లేదు..ఏమీ లేదు. నువ్వు ముందు ఈ సందేహాలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఉద్యోగానికి అప్లై చేయి. ఈ అప్లికేషన్ ఫారంలో నీ వివరాలు నింపితే నేను రేపే వెళ్ళి పోస్ట్ చేసి వస్తాను", లేచి వెళ్లి టేబులుపై పెన్నుల స్టాండులో ఉన్న పెన్నుల్లో ఓ పెన్ను తెచ్చి మహాలక్ష్మి చేతికి ఇస్తూ అన్నాడు రామయ్య.

అన్యమనస్కంగానే పెన్నుని అందుకుంది మహాలక్ష్మి. అప్లికేషన్ పై రాయబోయి మళ్ళీ భర్త ముఖంలోకి సందేహంగా చూసింది. రామయ్య చిరుమందహాసంతో భార్య కళ్ళల్లోకి భరోసాగా చూశాడు.

తాను చెప్పకున్నా తన మనసు తెలుసుకున్న భర్త కళ్ళలోకి ఆనందంతో మెరిసిన కళ్లతో చూసింది మహాలక్ష్మి. అప్లికేషన్ ఫారంలో తన వివరాలు అన్నీ నింపి, అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు కూడా వాటితో పాటు పెట్టి భర్త చేతికి ఇచ్చింది.

సీతమ్మ నోరు తెరిచి బంగారు లేడి కావాలని కోరితే దాన్ని తెచ్చివ్వడానికి వెళ్ళాడు ఆ రామయ్య. కానీ తన రామయ్య తాను కలలు కన్న భవిష్యత్తు కలలాగే మిగిలిపోనివ్వకుండా, తన మనసు తెలుసుకుని ఇచ్చిన ఈ కానుకకి మహాలక్ష్మి మనసు ఆనందంతో నాట్యమాడింది.

....సమాప్తం....



Rate this content
Log in

Similar telugu story from Drama