Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Spoorthy Kandivanam

Others


5.0  

Spoorthy Kandivanam

Others


షాకిచ్చిన అమ్మాయి

షాకిచ్చిన అమ్మాయి

4 mins 424 4 mins 424

చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం కోసం హైద్రాబాదుకి వచ్చిన రోజులవి. మాదాపూర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అదే నా మొదటి ఉద్యోగం కూడా. కంపెనీ మాదాపూర్ లో ఉండడంతో దగ్గరగా ఉంటుందని అదే ఏరియాలోని ఓ వర్కింగ్ వుమన్స్ హాస్టల్లో చేరాను. హాస్టల్ అంతగా బాగోలేకున్నా, ఆఫీసుకి దగ్గర అందులోనూ అక్కడ చుట్టుపక్కల ఉండే హాస్టల్స్ తో పోలిస్తే ఆ హాస్టల్లోనే కాస్త ఫీస్ తక్కువగా అనిపించి ఇక వేరే దారిలేక, పైగా ఆఫీసుకి చాలా దగ్గర్లో ఉండడంచేత అందులోనే చేరిపోయాను.


నాకు నాలుగో ఫ్లోర్లో రూము ఇచ్చారు. ఒక పక్క ఆఫీసుకి టైమవుతుంటే మరో పక్క బాత్రూముల కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడడం ఎందుకని సౌకర్యంగా ఉంటుందని, మిగతా రూముల కంటే ఓ ఐదువందలు ఎక్కువ ఫీజు ఉన్నా తప్పదని అటాచ్డ్ బాత్రూం ఉన్న రూము తీసుకున్నాను. నా అదృష్టం కొద్దీ నేను ఉన్న ఫ్లోరు ఇంకా రూము మిగతా ఫ్లోర్ల కంటే కాస్త శుభ్రంగా ఉండేవి.


మొదటిసారిగా నా స్నేహితులు ఎవరూ తోడు లేకుండా ఒక్కదాన్నే హాస్టల్లో చేరడం తొలత కాస్త నాలో గుబులు, భయం నిండుకున్నాయి. అసలే ఆ ఏరియాలో అమ్మాయిలు కొంచం ఫాస్ట్ గా ఉంటారని విన్నాను. అప్పటివరకు ఇల్లు, కాలేజీ, స్నేహితులు అదే తెలుసు నాకు, స్నేహితులు అంటే బయట తిరిగేవాళ్ళం కాదు, గ్యాంగ్ లో ఎవరైనా ఒకరి ఇంట్లో కలుసుకునేవాళ్ళం. అలా ఒక బౌండరీలోనే ఉన్న నేను ఇప్పుడు వీళ్ళతో అడ్జెస్ట్ అవగలనో లేదోనని జంకు ఉండేది నాలో. అందులోనూ మా రూంలో ఇద్దరూ నార్త్ అమ్మాయిలే.


భయంగా, మోహమాటంగా వారం గడిచింది, తర్వాత మెల్లిగా అలవాటు పడ్డాను. ఇక్కడ కూడా నా అదృష్టం కొద్దీ నా రూమ్మేట్స్ చాలా మంచివాళ్ళు. అసలే నార్త్ వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ అలవాట్లు వగైరా ఎలా ఉంటాయో అని చాలా హైరానా పడ్డాను. కానీ ఇద్దరూ చాలా హుందాగా ఉంటూ వాళ్ళ పనేంటో వాళ్ళు చూసుకునేవారు. నేను వాళ్ళకంటే మూడు నాలిగేళ్ళు చిన్నదాన్ని కావడంతో నాపై కేరింగ్ చూపేవాళ్ళు. దాంతో నా మనసులోని అన్ని భయాలను నెమ్మదిగా బయటకు నెట్టేసాను.


ఇక రోజూ ఆఫీసుకి వెళ్లడం నేరుగా హాస్టల్ కి రావడం, ఇలా గడిచిపోతుంది...


ఓ రోజు రాత్రి డిన్నర్ చేసి నిద్రపోయాను. సుమారు పన్నెండు గంటలకి నా ఫోను మోగడంతో ఉలికిపాటుగా నిద్రలేచాను. ఎవరా...అని చూస్తే ఆ కాల్ మా అక్క (కజిన్) నుండి రావడం చూసి "ఈ టైంలో ఎందుకు చేసిందబ్బా!", అనుకుంటూ కాల్ రిసీవ్ చేసుకున్నాను.


"పడుకున్నావా?" అడిగింది అక్క.


"అవునక్కా చెప్పు!", అన్నాను నేను నిద్రమబ్బుగా.


"ఏంలేదే తిరుపతికి వెళ్ళాం, రిటర్న్ అవుతున్నాం. మీ హాస్టల్ వైపు నుండేగా వెళ్ళేది, అందుకే ఒకేసారి నీకు ప్రసాదం ఇచ్చేసి వెల్దామని. నేను, మీ బావ వస్తున్నాం, అక్కడికి దగ్గర్లోకి వచ్చాక నీకు కాల్ చేస్తా క్రిందకొచ్చి ఉండగలవా?"


"సరే అక్కా!", అని చెప్పేసి కాల్ కట్ చేసి, అక్క నుండి మళ్ళీ కాల్ కోసం ఎదురుచూస్తూ కాసేపు ఫోనులో గేమ్ ఆడుతూ కూర్చున్నా.


అరగంట తర్వాత అక్క కాల్ చేసి దగ్గర్లోనే ఉన్నాం అంటే క్రిందకి వెళ్లి, అది అర్ధరాత్రి కాబట్టి బయటికి వెళ్లకుండా లోపలే మెట్ల దగ్గర నిలుచుని వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నా. మెట్ల దారికి ఎదురుగా ఉండే రూంలో వాచ్మాన్ వాళ్ళ కుటుంభం ఉంటారు.


నేను అలా వాళ్ళకోసం చూస్తూ చిన్నగా మిగతా మెట్లు దిగుతున్నాను. ఇంతలో ఒకమ్మాయి వాచ్మాన్ వాళ్ళ రూము దగ్గర నుండి వచ్చి మెట్లు ఎక్కుతూ నేను కనబడగానే ఒక క్షణం ఆలోచనగా నా ముఖంలోకి చూసింది. ఆ అమ్మాయిని ఇదివరకే హాస్టల్లో రెండు మూడు సార్లు చూసాను. అయితే... "ఈ టైంలో ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుందబ్బా...?" అని నేను కూడా ఆ అమ్మాయి వైపు ఆలోచనగా చూసాను. 


ఆ అమ్మాయి టక్కున తన చూపుని పక్కకి తిప్పి టకటకా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది. అయితే అలా నా పక్క నుండి వెళ్తున్నప్పుడు నేను ఒక్కసారిగా బిత్తరపోయి నిలబడిపోయాను.


అసలు విషయమేంటంటే...ఆ అమ్మాయి అలా నా పక్కనుండి వెళ్తున్నప్పుడు తన నుండి సిగరెట్ పొగ వాసన గుప్పున నా ముక్కుపుటాలను తాకింది. అసలే సిగరెట్టు వాసన పడని నాకు అది చాలా ఘాటుగా నా శ్వాసలో కలిసి కడుపులో తిప్పేసినట్టయ్యింది. ఒక్కసారిగా నా నిద్రమత్తంతా వదిలిపోయింది.

అంతే...ఒక రెండు సెకండ్లు ఏమీ అర్థంకాలేదు. "ఆ వాసన ఆ అమ్మాయి నుండి వచ్చిందా? చ ఛా...అలా ఎలా కుదురుతుంది? కానీ...మరి ఇక్కడ మరెవ్వరూ లేరు కదా! అందులోనూ తను వెళ్ళినప్పుడే కదా నాకు ఆ వాసన వచ్చిందీ...", ఇలా పలు ఆలోచనలు, ప్రశ్నలు నా మెదడును దాడిచేస్తుండగా కాస్త అయోమయంగా ఒక్కో మెట్టు దిగుతూ వెళుతున్నాను.


మెట్లు దిగగానే వాచ్మాన్ భార్య అక్కడికి వచ్చి నన్ను చూసింది. ఆ అమ్మాయి వెళ్లడం, నాకు ఏదో అనుమానం రావడం, బహుశా ఆవిడకి అర్థమయినట్లుంది.

వెంటనే, "ఎవ్వరికీ చెప్పొద్దమ్మా...! మేడమ్ కి తెలుస్తే మా ఉద్యోగం పోతుంది. ఆ అమ్మాయి రోజూ ఈ టైముకు ఇక్కడికి వచ్చి సిగరెట్ కాల్చి వెళ్తుంది. ప్లీస్ అమ్మా! మేడమ్ కి చెప్పొద్దూ...", అంటూ బతిమిలాడింది. అంతే కాకుండా వాళ్ళకి అప్పుడప్పుడు అవసరాలకు డబ్బు కూడా ఇస్తుంది అని చెప్పింది.


ఆవిడకి ఒక కొడుకు, కూతురు. చిన్న వాళ్లే, కానీ కొడుకు ఫిజికల్లి హ్యాండికాప్డ్. భార్య, భర్త, పిల్లలు వాళ్లకు చేతనైనంత పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నేను ఇక ఏమీ అనలేకపోయాను. పైగా నేను అక్కడ కొత్త, అందుకే ఇక చూసి చూడనట్టు వెళ్లిపోవాల్సొచ్చింది.


కానీ అమ్మాయిలు ధూమపానం చేయడం అనేది అప్పటివరకు కేవలం సినిమాల్లోనే చూసిన నేను నిజ జీవితంలో కూడా స్మోక్ చేసేవాళ్ళు ఉన్నారా? అని అసలు నమ్మలేకపోయాను, చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 

"వామ్మో...ఇంత షాకిచ్చిందేంటి ఈ అమ్మాయి!", అని మనసులోనే అనుకుంటూ నిలబడిన నేను మా అక్క కాల్ వచ్చేసరికి నా ఆలోచనల్లోంచి తేరుకుని కాల్ రిసీవ్ చేసుకుని, అక్క వాళ్ళు హాస్టల్ దగ్గరికి వచ్చేసాము అంటే వెళ్లి ప్రసాదం తీసుకుని తిరిగి నా రూంకి వెళ్ళిపోయాను. కొద్దిసేపు మళ్ళీ ఆ అమ్మాయి గురించే ఆలోచనలు....

ఒక నిట్టూర్పు వదిలి నిద్రలోకి జారుకున్నా.


ఇలా ధూమపానం ఒక్కటేనా! ఈ మధ్య మద్యం కూడా విచ్చలవిడిగా తాగేస్తున్నారు అమ్మాయిలు.

సూటిగా మాట్లాడితే....నేడు మద్యం కోసం బార్ల ముందు ఆడవాళ్లు కూడా క్యూలో నిలబడడం చూస్తే మన విలువలు ఎంత దిగజారి పోతున్ననయో తెలుస్తుంది.


ఈ కాలంలో అన్ని రంగాల్లో మగవాళ్ళతో పోటీ పడుతున్న ఆడవాళ్లు ఇలాంటి అలవాట్లల్లో కూడా పోటీ పడుతున్నారేమో అన్నట్లుగా తయారయ్యింది నేటి పరిస్థితి. దానికి తోడు సినిమాల్లో అదీ పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం ఇటువంటి అలవాట్లను ప్రోత్సహిస్తూ స్క్రీన్ మీద నటించడం నాకు ఎప్పుడూ మరింత ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.


ఎటు వెళ్తుంది మన సమాజం? పాశ్చాత్య అలవాట్ల మోజులో పడి, ఆడవాళ్ళని చూస్తే చేతులు జోడించి నమస్కరించే రోజులు పోయి వేలెత్తి చూపే రోజులకు దారితీయడానికి కారకులు ఎవరు...? ఇలాంటి పరిస్థితిని మనమే చేతులారా తెచ్చుకున్నాం అనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు తరాలు ఇంకెలా ఉంటాయోనని ఆలోచిస్తేనే ఒక రకమైన అలజడి కలుగుతుంటుంది నా మనసులో....


........సమాప్తం.....


-స్ఫూర్తి కందివనం


Rate this content
Log in