Spoorthy Kandivanam

Drama Others

4.7  

Spoorthy Kandivanam

Drama Others

ఆ అయిదు రోజులు పక్కకు....

ఆ అయిదు రోజులు పక్కకు....

3 mins
443


"మిథునా...! ఏం చేస్తున్నావ్? మేలుకతోనే ఉన్నావా! మరి ఇందాక నుండి నేను పిలుస్తుంటే ఉలకవూ పలకవే..?", అసహనంగా అంది నీరజ మిథునా భుజం మీద తట్టి లేపుతూ.

"ఆ...మేలుకతోనే ఉన్నానులే. నువ్వూ, మీ అత్తగారు చేసినదానికి నాకు ఒక పక్క వళ్ళు మండిపోతుంటే ఇక మళ్ళీ నిద్ర కూడానా...?", చిరుకోపంగా అంది మిథునా.

"అంటే ఇంకా నీ కోపం చల్లారలేదన్నమాట..."

మిథునా "అవును" అన్నట్లు చూసి నిర్లక్ష్యంగా ముఖం పక్కకు తిప్పుకుంది.

"హ్మ్...సరేలే భోజనానికి రా...! అంతా ఎదురుచూస్తున్నారు", అంది నీరజ.

"నేను రాను. నాకు ఆకలిగా లేదు", సీరియస్ గా చెప్పింది మిథునా.

"అలా అంటే ఎలా మిథునా? మరీ చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నావ్. పొద్దున కూడా చెల్లితో టిఫిన్ పంపిస్తే వొద్దన్నావంటా, ఇప్పుడు కూడా తినకపోతే ఎలా. ఈ సమయంలో తినకుంటే బాగా నీరసంగా ఉంటుంది"

"నీకేం తెలుసమ్మా నా బాధ. ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాము. పిన్ని, బాబాయిలు, అత్తమ్మలు, మామయ్యలు, వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు, చాలా రోజుల తర్వాత అందరినీ ఓకే చోట కలుస్తున్నందుకు ఎంత ఎగ్జైట్ అయ్యాను తెలుసా. కానీ మీ అత్త, అదే నానమ్మ మొత్తం డిస్సపోయింట్ చేసింది. మళ్ళీ దానికి తోడు నువ్వు కూడా నానమ్మనే సపోర్ట్ చేస్తూ నన్ను హర్ట్ చేసావు", బుంగమూతితో చిరుకోపంగా చెప్పింది మిథునా.

"అది కాదే పెద్దవాళ్ళు..పైగా వాళ్ళ చాదస్తాలు, పద్దతులు వాళ్ళకుంటాయి. అర్థంచేసుకోవాలే కానీ ఇలా ప్రవర్తిస్తే ఎలా?"

"ఏంటమ్మా అర్థం చేసుకునేది. నా ఖర్మ కాలి ఈ సారి నాకు నాలుగు రోజుల ముందే పీరియడ్స్ వచ్చాయి. వ్రతం కోసం ఇల్లు శుద్ధి చేసుకున్నాం కదా, ఇప్పుడు నువ్వు ఇల్లంతా తిరిగితే ఎలా అంటూ నిన్నటినుండి నన్ను మేడ మీద ఈ గదిలో ఉంచారు. నాకు ఒక్కదానికే ఎంత బోర్ గా ఉందో తెలుసా. వ్రతం చేసేది హాల్లో, అక్కడికొక్కటి రాకపోతే సరిపోతుందిగా. అలా కూడా వొద్దు అంటూ నన్ను ఇక్కడ ఉంచారు. పొద్దున నుంచి క్రింద మా పిల్లల గ్యాంగ్ అంతా ఎంజాయ్ చేస్తుంటే నేను వాళ్ళందరినీ ఎంత మిస్సవుతున్నాను తెలుసా. అంతే కాకుండా మిథునకి ఏమైంది ఎందుకు మేడ మీద ఉంది అని అంతా అడుగుతుంటే నాకు ఇక్కడ ఎంత ఇబ్బందిగా ఉందో..!", ఏడుపు ముఖంతో చెప్పింది మిథునా.

"ఇది ప్రతీ ఇంట్లో ఆడవాళ్లకు నెల నెలా వచ్చేదే, అందరికి తెలుసు. దీని గురించి నువ్వు అంత ఇబ్బందిగా ఫీలవ్వనవసరం లేదు మిథునా", కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది నీరజ.

"అయినా ఏంటమ్మా ఈ రోజులో కూడా ఈ పట్టింపులు. ఇప్పుడు కూడా అది తాకొద్దు, ఇది తాకొద్దు, పక్కకు ఉండాలి..అంటూ ఈ ఆంక్షలేంటి? ఇది నెల నెలా మన ఆడవాళ్ళ శరీరాల్లో జరిగే మామూలు ప్రక్రియనే. ఎందుకు ఇంకా ఈ చాదస్తాలు"

"అసలు ఆ అయిదు రోజులూ పక్కకు ఉండాలన్న నియమాన్ని మన పెద్దలు పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా! ఆ సమయంలో విశ్రాంతి చాలా అవసరం. అలా పక్కకు ఉంచడం వల్ల వాళ్లకు ఆ అయిదు రోజులు ఏ పనీ చేయకుండా విశ్రాంతి ఉంటుందని. కానీ క్రమేణా దానికి మరికొన్ని నియమాలు మనమే జోడించుకున్నాము. ఈ కాలంలో చూస్తే ఆ ఐదురోజులు కూడా ఆడవాళ్లు ఇంటి పని, వంట పని, ఆఫీసుల పని ఇలా అన్నీ చేస్తుండడం వల్ల బాగా స్ట్రెస్ అయ్యి అధిక రక్త స్రావం జరగడం, నీరసం ఇలా ఎన్నో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కనుక ఇలా పక్కకు ఉంచడాన్ని నెగటివ్ గా ఆలోచించే బదులు పోసిటివ్ వే లో ఆలోచించి చూడు. అప్పుడు నువ్వు ఇలా ఫీలవ్వవు", కూతురి ముఖంలోకి చూస్తూ మృదువుగా చెప్పింది నీరజ.

ఆలోచనగా చూసింది మిథునా.

"అయినా నిన్ను ఇలా వేరుగా ఉంచినందుకు నానమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా. మనవరాలు లంగా ఓని వేసుకుని చక్కగా అలంకరించుకుని, గలగలా మాట్లాడుతూ అందరిమధ్య మహాలక్ష్మిలా తిరుగుతుంటే ముచ్చటగా చూసుకునేది, కానీ ఇలా అయ్యిందని నిన్నటినుండి నీ గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆవిడ కూడా ఇంకా భోజనం చేయకుండా నీ కోసమే ఎదురుచూస్తున్నారు. కనుక ఇక ఈ నెగటివ్ వే లో ఆలోచించడం పక్కన పెట్టేసి, భోజనానికి వెళ్దాం పదా..", మృదువుగా నవ్వుతూ అంది నీరజ.

తల్లి మాటలు ఆలొచ్చింపచేసాయి మిథునకి. తల్లి చెప్పింది కూడా ఒక విధంగా ఆలోచిస్తే కరెక్ట్ ఏ కదా అనుకుని అప్పటివరకు రుసరుసలతో నిండిన తన ముఖం, అందమైన చిరునవ్వుతో నింపుకొని, లేచి తల్లి వెంట వెళ్ళింది మిథునా.

*********

తరచూ మన నానమ్మలు, అమ్మమ్మలు చెప్పేది, చేసేది చాదస్తం అంటూ వారి మాటలను కొట్టిపరేస్తూ ఉంటాం. కానీ వాటిలో చాలా మటుకు మంచి విషయాలే ఉంటాయి. ఒకప్పుడు ఆ అయిదు రోజులు ఉండే నియమాన్ని తరువాత అది చాదస్తం అంటూ పాటించడం మనేసాము. ఇప్పుడు చూడండి మన ఆడవాళ్లకు అసలు సెలవు లేకుండా పోయింది. ఓ విధంగా ఆలోచిస్తే ఆ నియమం అలానే ఉంటే కనీసం ఆ అయిదు రోజులైనా విశ్రాంతి దొరికేదేమో, అలా అయినా మనకు సెలవులు దొరికేవి అనిపిస్తుంటుంది. 😉 కాదంటారా?😁

©స్ఫూర్తి కందివనం.



Rate this content
Log in

Similar telugu story from Drama