Spoorthy Kandivanam

Drama Tragedy

3.0  

Spoorthy Kandivanam

Drama Tragedy

ఆఖరి చూపు

ఆఖరి చూపు

4 mins
418


భుజానికి బ్యాగు తగిలించుకుని అమ్మా నాన్నలకి వీడ్కోలు చెప్తూ ఇంటినుంచి బయలుదేరింది వసు. భారంగా పడుతున్న తన అడుగులని ముందుకు కదిపింది. మధ్యమధ్యలో వెనక్కి తిరిగి అమ్మా నాన్నను చూస్తూ అడుగులు వేస్తుంది.


కూతురు హాస్టల్ కి వెళుతునందుకు తండ్రి కళ్ళల్లో చెమ్మ చేరింది, తల్లి బెంగగా చూస్తుంది. వీధి చివరి వరకు వాళ్ళని చూస్తూ చేయి ఊపుతూ వీడ్కోలు చెప్పి తన కళ్ళ వెంట వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ ముందుకి నడిచింది వసు.


వసు ఉద్యోగరీత్యా పట్నంలో వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉంటుంది. మూడేళ్ళుగా సహోద్యోగి వాసుని ప్రేమిస్తుంది. కానీ ఇంట్లోవాళ్ళకి చెప్పే ధైర్యం లేదు. అందుకు ఒక కారణం, కులాలు వేరు కావడం అయితే మరొకటి వసు వాళ్ళింట్లో బంధువుల అభిప్రాయనికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం. వాళ్ళు ఎలాగో వాసుతో తన పెళ్లికి ఒప్పుకోరు, ఇక ఇంట్లోవాళ్ళు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని తనకి బాగా తెలుసు.


అందుకే ఇక తన మనసులోని మాటని ఎవ్వరికీ వ్యక్తపరచలేకపోయింది. కనీసం చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయింది. ఎందుకంటే ఒకవేళ చెబితే ఒప్పుకోకపోగా బంధువుల భయానికి ఎక్కడ తనను ఇంట్లోనే నిర్బంధిస్తారో అన్న భయం కూడా వేసింది. అందులోనూ వసుకి పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. రేపోమాపో ఎదో ఒక సంబంధం ఖాయమయ్యేలా ఉంది. ఇక పరిస్థితి తన చేయి దాటే లోపే ఎదో ఒకటి నిర్ణయించుకోవాలనుకొని వాసుని పెళ్లి చేసుకోడానికి నిర్ణయించుకుంది.


ఆఫీసుకి రెండు రోజులు సెలవులుంటే ఆఖరి సారిగా అమ్మా నాన్నను చూసి వెళదామని ఇంటికొచ్చిన వసు ఎప్పటిలాగే హాస్టల్ కి వెళుతున్నట్టే ఇంటి నుంచి బయలుదేరింది.


ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ కన్న వారిని మోసం చేస్తున్న భావనతో తన మనసు నలిగిపోయింది. కానీ తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాసుని తప్ప మరెవ్వరినీ తన జీవితంలోకి ఆహ్వానించలేక మనసు చంపుకుని మరో దారి లేక ఇలా ఎవ్వరితో చెప్పకుండా వాసుతో పెళ్లికి సిద్ధపడింది. తాను తీసుకున్న ఈ నిర్ణయానికి అమ్మా నాన్నకు మనసులోనే లెక్కలేనన్ని సార్లు క్షమాపణలు చెప్పుకుంది.


ఇక వాసు, పట్నంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడడంతో అతనికి వచ్చే కట్నంపైనే ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. తన ఇంట్లో పరిస్థితులు ఇలా ఉండడం వల్ల ఇప్పుడు తన ప్రేమ గురించి చెబితే చస్తే ఒప్పుకోరు అని వాసుకి గట్టి నమ్మకం.


జీవితాంతం నీ చేయి వదలను అని మాటిచ్చిన తన ప్రాణాన్ని కట్నకానుకల కోసం వదులుకోడానికి ఏమాత్రం సిద్ధంగా లేడు వాసు. తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పినా ఉపయోగంలేదని వాసు కూడా ఇంట్లో చెప్పకుండా వసుని పెళ్లిచేసుకోడానికి సిద్ధపడ్డాడు.


* * * * * *


వసు హాస్టల్ కి చేరుకుంది.


మరుసటిరోజు ఆఫీసుకి లీవ్ పెట్టి వసు, వాసులు కొంతమంది స్నేహితుల సహాయంతో, వారి సమక్షంలో గుడిలో ఆ దేవుడి మీదే భారమేసి, దైవసాక్షిగా వసు మెడలో వాసు మూడుముళ్లు వేసాడు. స్నేహితులంతా శుభాకాంక్షలు చెప్పారు. రేపు ఇంట్లో వాళ్ళకి చెప్పాక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినా మెల్లిగా కొన్ని రోజులకు అవే సర్దుకుంటాయిలే అని చెప్పి వాళ్ళిద్దరికీ మనోధైర్యాన్నిచ్చారు. తరువాత స్నేహితులంతా చిన్న పార్టీ చేసుకున్నారు.


అక్కడినుంచి వాసు స్నేహితుడు మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. మహేష్, వాసు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అతనికి కూడా ఆ మధ్యే పెళ్ళయి ఉద్యోగారిత్యా సిటీలోనే ఉంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరే ఉండడంతో వసు, వాసును ఓ రెండు రోజులు వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక సమయం చూసి ఇంట్లో వాళ్ళకి విషయం చెబుదాం అనుకున్నారు.


తెల్లవారింది...


వసు వాళ్ళింట్లో వాళ్ళకి తన పెళ్లి విషయం ఎలా చెప్పాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంది. చెప్పే ధైర్యం లేక రేపు చెప్దాము, రేపు చెప్దాము అనుకుంటూ అలా రెండు రోజులు గడిచిపోయాయి.


ఈ టెన్షన్ లో ఉన్న వసు తన మొబైల్ గురించి అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజు తన మొబైల్ ని ఇంట్లో వాళ్ళకి లేదా బంధువులకు ఏ మాత్రం అనుమానం వచ్చి విషయం తెలిస్తే పెద్ద సమస్య అవుతుందని భావించి స్వచ్ ఆఫ్ చేసింది. ఆ రోజు నుండి అది ఆఫ్ లోనే ఉంది. తరువాత వచ్చే గొడవలు, సమస్యల గురించి ఆలోచిస్తూ తన మొబైల్ గురించి పట్టించుకోలేదు, బ్యాగులోంచి బయటికి కూడా తీయలేదు.


కానీ తను చేసిన ఆ పొరపాటు వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుందని వసు కల్లో కూడా ఊహించలేదు. రేపు, రేపు అని వాయిదా వేయడం వల్ల తన జీవితంలో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది వసుకి.


రెండు రోజులు గడిచాక ఇక ఎప్పుడైనా చెప్పక తప్పదు కదా అని ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పడానికి ధైర్యం తెచ్చుకొని బ్యాగులో ఉన్న తన మొబైల్ను తీసుకుంది వసు. అది ఆ రోజు నుంచి ఆఫ్ లోనే ఉందని అప్పుడే చూసుకుని వెంటనే చాలా కంగారుగా ఆన్ చేసింది. చేయగానే అమ్మ, నాన్న, చెల్లి, బంధువుల నంబర్ల నుంచి వచ్చిన చాలా మెసేజులు, మిస్స్డ్ కాల్స్ కనపడ్డాయ. ఒక్కసారిగా భయమేసింది. వణుకుతున్న చేతులతో, అదురుతున్న పెడవులతో భయం భయంగా తన తల్లికి కాల్ చేసింది.


తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బోరున ఏడ్చింది. తన తండ్రి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది.


విషయమేంటంటే వసు వాళ్ళ నాన్న గుండెపోటుతో రెండు రోజుల క్రితమే కనుమూశారు. ఆ విషయం వసుకి తెలియజేయడానికి ఇంట్లో వాళ్ళు చాలా ప్రయత్నించారు. వసు ఉండే హాస్టల్ కి తన మామయ్య వెళ్లి కనుక్కోగా తను ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్లిందని చెప్పారు. వసు హాస్టల్ వాళ్ళకి అలానే చెప్పింది.


ఆఫీసు వివరాలు తెలియని వసు మామయ్య తిరిగి ఊరికి వెళ్లిపోయారు. వసుతో మాట్లాడడం కోసం తన చెల్లి, బంధువులు ఎంత ప్రయత్నించినా తన ఫోన్ ఆఫ్ చేసుకోడంతో తనకి విషయం తెలియజేయిలేకపోయారు.


ఇక వాసు ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆమె కన్నీళ్లు ఆగడంలేదు, తన వల్ల జరిగిన పొరపాటుకి గుండెపగిలేలా ఏడవసాగింది వసు.


ఇంటినుంచి బయలుదేరినప్పుడు తండ్రి తడిసిన కళ్ళతో తనకి వీడ్కోలు చెప్తూ చూసిన ఆ ఆఖరి చూపే వసు కళ్ళల్లో మెదులుతూ తన మనసుని మెలితిప్పుతుంది. అది తన తండ్రి శాశ్వతంగా వెళ్లిపోతున్నానని చెప్పడానికి చెప్పిన వీడ్కోలులా అనిపించింది వసుకి.


"ఏం చేసినా సమయాన్ని ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేరు. రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు, ఊహించనూలేము. అది ఎవ్వరి చేతిలోనూ ఉండదు.


మన జీవితంలో రేపు అనేది ఉండొచ్చు, ఉండకపోవొచ్చు. అందుకే మనం బ్రతికే ఈ రోజు, ఈ క్షణాలు ఎంతో విలువైనవి. అవి ఒక్కసారి దాటిపోతే ఎప్పటికీ వెనక్కి తీరిగి రాలేవు".

తండ్రి ఎప్పుడూ చెప్పే ఈ మాటలు గుర్తుకొచ్చి కన్నీటిపర్యంతమయ్యింది వసు.


.......సమాప్తం......


©స్పూర్తి కందివనం


Rate this content
Log in

Similar telugu story from Drama