Spoorthy Kandivanam

Inspirational Others

4.5  

Spoorthy Kandivanam

Inspirational Others

ఇంకా ఎందుకీ భయాలు..?

ఇంకా ఎందుకీ భయాలు..?

4 mins
400


"బాబు కొంచం ఈ అడ్రస్ ఎక్కడనో చెప్తారా? ఇటు దిక్కే అన్నారు, దొరకడంలేదు. అమ్మాయికి పరీక్షకు టైమవుతుంది", అటుగా వెళుతున్న ఒకతన్ని ఆపి వినయంగా అడిగాడు సాంబయ్య. 

అతను సాంబయ్య ఇచ్చిన కాగితం ముక్కను చూసి, "ఇక్కడినుంచి కొంచం ముందుకు వెళ్లి, ఆ మెడికల్ షాపు ఉంది కందండి, దాని పక్క సందులోకి వెళితే మీకు అప్పుడే బోర్డ్ కనిపిస్తుంది", చేతులతో సైగ చేస్తూ దారి చెప్పాడు.

"చాలా థాంక్స్ బాబు..!", అని చెప్పి ముందుకు కదిలాడు సాంబయ్య. అడ్రస్ చెప్పిన అతను కూడా బదులుగా ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.

సాంబయ్యని అనుసరిస్తూ అడుగులు వేసింది అతని కూతురు స్వాతి.

సాంబయ్య, అతని కుటుంబం హైద్రాబాదుకు దగ్గర్లో ఉండే చిన్న టౌనులో నివాసం ఉంటారు. ఇవాళ స్వాతి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి హాజరవ్వాల్సుంది. సెంటర్ హైదరాబాదులో పడటంతో దాని కోసం పట్నం వచ్చారు.

మామూలుగానే హైదరాబాదులో ఏదైనా అడ్రస్ వేతకాలంటే చాలా కష్టం, ఇక సాంబయ్యలాగా వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకైతే అది మరీ కష్టం. బస్టాండు నుంచి వాళ్ళనీ వీళ్ళనీ అడిగి కనుక్కుంటూ ఇక్కడిదాకా చేరుకున్నారు. కానీ ఆ తరువాతే సెంటర్ అడ్రస్ కనుక్కోడానికి కాస్త గందరగోళంగా అనిపిస్తే దారిలో కనిపించిన ఒకతన్ని ఆపి అడ్రస్ కనుక్కునే ప్రయత్నం చేసాడు.

                             * * * *

ఇందాక అతను సూచించిన విధంగా వెళ్లగా వాళ్ళు వెతుకుతున్న ఎగ్జామ్ సెంటర్ కనబడగానే, "నాన్న! అదే అనుకుంటాను. అదిగో అక్కడ చాలా మంది ఉన్నారు", అని స్వాతి అనడంతో ఇద్దరూ అటు వైపుకు వేగంగా నడుచుకుంటూ సెంటర్ కి చేరుకున్నారు.

స్వాతి బ్యాగులోంచి తన హాల్టికెట్ తీసి, తనది ఏ హాలో కనుక్కుందామని అక్కడ ఉంచిన బోర్డు వైపుకు నడిచింది.

కానీ అక్కడ మగపిల్లల గుంపు ఎక్కువగా ఉండడంతో, "నీ హాల్ టికెట్ ఇవ్వు, ఏ హాలో కనుక్కొని వస్తా", అంటూ స్వాతి హాల్ టికెట్ తీసుకొని గుంపులోకి దూరాడు సాంబయ్య. నెంబర్ వెతకడంలో కాస్త అయోమయంగా అనిపించింది అతనికి. దాంతో తన పక్కనున్న అబ్బాయి సహాయంతో స్వాతి హాల్ నంబరు తెలుసుకున్నాడు.

స్వాతి నిలుచున్న దగ్గరికి వచ్చి వివరాలు చెప్పి, "సరే టైమవుతున్నట్టుంది లోపలికి వెళ్లమ్మ. నేను ఇక్కడే ఈ చెట్టు దగ్గరే ఉంటా, ఎగ్జామ్ అయిపోయినాక ఇక్కడికే రా. టెన్షన్ పడకుండా బాగా రాయి తల్లి సరేనా!", అంటూ జాగ్రత్తలు చెబుతుంటే స్వాతి "సరే" అన్నట్లు తలాడించి చేతిలో ఉన్న బ్యాగును తండ్రికి ఇచ్చి పౌచ్, హాల్ టిక్కెట్ మాత్రం తీసుకుని ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళింది. 

పరీక్ష మొదలయ్యింది. స్వాతి క్వశ్చన్ పేపర్ చదువుతూ తనకి తెలిసిన ఆన్సర్లను మార్క్ చేస్తుంది. ఓ అరగంట గడిచాక, స్వాతికి కడుపులో బాగా నొప్పి మొదలయ్యింది. విషయం అర్థమయిన స్వాతి, "ఇంకా వారం టైం ఉంది కదా...అప్పుడే వచ్చిందేంటి! ఇప్పుడెలా? ఏం చేయాలి? సమయానికి నా దగ్గర ప్యాడ్ కూడా లేదు", అంటూ తనలో తానే మధనపడింది. కంగారు పడుతూ కాళ్ళని దగ్గరికి ముడుచుకుని కూర్చుంది. అలా మరికొద్దిసేపు గడిచాక, రక్తస్రావం పెరగడంతో స్వాతికి కంగారు రెట్టింపయ్యింది, దానికి తోడు కడుపు నొప్పి తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం వల్ల పరీక్షపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోయింది. 

అలా పరీక్ష సమయం అయిపోయేవరకు ఇకమతులు పడింది. హాల్లో మిగతా విద్యార్థులంతా ఒక్కొక్కరు వాళ్ళ ఓఎమ్ఆర్ షీట్స్ ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేసి హాల్ బయటికి వెళ్లిపోతున్నారు. స్వాతి మాత్రం తన ప్లేస్ నుండి కదలలేదు. డ్రెస్సుకు మరక అయ్యుంటుందేమో అన్న భయంతో బెల్లు మోగినా కూడా అక్కడినుంచి లేవలేదు స్వాతి. హాల్లో ఉన్న వాళ్లంతా వెళ్లేవరకు ఉండి చివరగా తను వెళ్ళింది. వాష్రూమ్ కి వెళ్లి చూసుకోగా, డ్రెస్సుకు కాస్త మరక అయివుండడం చూసి, "ఇప్పుడెలా! బయటికి ఎలా వెళ్ళాలి?", అంటూ ఆందోళన పడింది. తన చున్నీని ఒక వైపుకు వేసుకుని వెనక మరక కనిపించకుండా అడ్డుగా ఉండేలా మరో వైపుకు పట్టుకుని బెదురు బెదురుగా అక్కడే నిలుచుంది.

అదే సమయంలో అక్కడ పనిచేసే ఆయా ఒకావిడ వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి అటుగా వచ్చింది. పరీక్ష అయిపోయింది, అంతా వెళ్లిపోతున్నారు, తను మాత్రం ఇంకా వెళ్లకుండా ఇక్కడేం చేస్తుంది... అన్నట్లుగా స్వాతి వంక చూసింది ఆవిడ.

స్వాతి చాలా కంగారుగా ఉండడం గమనించి, "ఏమైందమ్మా...ఎల్లకుండ ఇక్కడనే నిలబడ్డవ్?", అని అడిగింది ఆవిడ, అక్కడే మూలకు పెట్టి ఉన్న చీపురును తీసుకుంటూ.

స్వాతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అది చూసిన ఆయా స్వాతిని సమీపించి, "ఏమైంది బిడ్డ! పార్శాన్ల ఉన్నవ్?", అని అడిగింది ఆతృతగా.

"అదీ...ఆంటీ...నాకు పీరియడ్స్ వచ్చాయి. వెళ్లలేని పరిస్థితి. నా దగ్గర ప్యాడ్ కూడా లేదు. మాది ఈ ఊరు కూడా కాదు. ఇప్పుడెలా వెళ్ళాలో అర్థంకావడంలేదు", ఏడుపు గొంతుతో చెప్పింది స్వాతి.

"అరే...అవునా....! అయినా మీరు సదువుకున్న పిల్లలు, ఎప్పుడు ఎంబడి పెట్టుకోవాలి. ఆడిపిల్లలకు ఎప్పుడు ఏ అవసరమొస్తదో తెల్వది. మల్లిప్పుడేం జేస్తవ్? ఎట్ల పోతవ్? నీ ఎంబడి ఎవరొచ్చిన్రు?"

"మా నాన్న. బయట అక్కడే పెద్ద చెట్టు కింద కూర్చుని ఉంటా అన్నారు. ఆయన పేరు సాంబయ్య"

"మీ నాయిననా! ఆయనకెట్ల చెప్పాలబ్బా...! సరేలే ఎట్లనో ఒకట్ల ఆయనకే చెప్తే అయిపా. ఇంకిప్పుడు ఎవరు తెస్తారు నీకు", అని చెప్పి, గబగబా నడుచుకుంటూ బయటికి వెళ్లి చూసింది. స్వాతి చెప్పినదాన్ని బట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, "సాంబయ్య అంటే మీరేనా...? మీ పాపా....", ఆవిడ చెప్పేది పూర్తికాకుండానే, అప్పటికే కూతురు ఇంకా రాలేదన్న కంగారులో ఉన్న ఆయన, "మా పాపనా...ఏదీ? ఇంకా రాలేదు. అందరూ వెళ్లిపోతున్నారు. తను మాత్రం ఇంకా ఎందుకు రావడంలేదు.. ", ప్రశ్నల దాడి చేశాడు సాంబయ్య.

ఆయన కంగారు చూసి ఆయాకు కూతురి సంగతి ఎలా చెప్పాలో తెలీక, "ఏంగాలే సార్! మీ పాప మంచిగనే ఉంది...కానీ...జర...మైలయింది... భయంతోని కొంచం కండ్లల్ల నీళ్లు తెచ్చుకుంది. ఇక్కడనే మూలకు మందుల షాపుంది, ఆమెకు కావలసినవి జర జెల్ది పోయి తెస్తే....", తడబడుతూ ఇబ్బందిగా చెప్పింది ఆయా.

సాంబయ్యకు విషయం అర్థమయ్యి, సరే అన్నట్లుగా తల పంకించి అన్యమనస్కంగానే గబగబా నడిచి సందు చివర్లో ఉన్న మెడికల్ షాపులోకి వెళ్ళాడు.

"ఏం కావాలి సార్?", మరో కస్టమర్ కి మందులు ప్యాక్ చేసిస్తూ అడిగాడు ఆ షాపులో పనిచేస్తున్న అతను.

"అదీ...", ఎలా అడగాలో అర్థంకాక ఆగిపోయాడు సాంబయ్య. "ఊర్లో అంటే వాళ్ళ అమ్మతోపాటు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు. అక్కడ లేడీస్ కార్నర్లోనే కాబట్టి ఆడవాళ్లు ఉంటారు, సులభంగా తెచ్చుకోగలరు. ఇక్కడంతా మగవాళ్లే ఉన్నారు. వీళ్లనేలా అడిగేది....", ఆలోచనల్లో మునిగిపోయిన సాంబయ్యను, "సార్ మిమ్మల్నే! ఏం కావాలి", షాపులో అతను కాస్త గట్టిగా అన్నాడు.

ఉలికిపాటుగా ఆలోచనల్లోంచి తేరుకుని, "అదీ....అదీ...", అంటూ నాంచాడు సాంబయ్య.

షాపు వాడు అసహనంగా చూసాడు.

"అసలు ఇందులో అంత ఇబ్బంది పడాల్సింది ఏముంది? ఇది ఆడపిల్లల్లో సహజంగా ప్రతీ నెలా జరిగేదే. వీటి అవసరం ప్రతీ ఆడపిల్లకు తప్పనిసరిగా ఉంటుందనేది జగమెరిగిన సంగతే. దానికి ఎందుకింత తటపటాయింపు", మనసులో అనుకున్నాడు సాంబయ్య. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా, "ఇది ఒక ప్యాకెట్...", అని అక్కడున్న సానిటరీ ప్యాడ్స్ వైపు చూయించి అడిగాడు.

షాపు వాడు 'దీనికి ఇంత ఆలోచించాలా' అన్నట్లు సాంబయ్య వంక ఒక చూపు చూసి టకటకా తీసి ప్యాక్ చేసిచ్చాడు. సాంబయ్య అది తీసుకుని, అతనికి డబ్బులు ఇచ్చి, పరుగు లాంటి నడకతో నడిచి సెంటర్ కి చేరుకున్నాడు. అక్కడ అతని కోసమే ఎదురుచూస్తున్న ఆయాని సమీపించి, ఆమెకు తన చేతిలో ఉన్న కవర్ ఇచ్చాడు.

ఆవిడ వెంటనే వెళ్లి ఆ కవర్ స్వాతికి ఇచ్చి, "తొందరగా పో...మీ నాయిన నీ కోసం పర్శానయితున్నడు", అంది.

స్వాతికి ప్రాణం లేచొచ్చినట్టైంది. కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఓ పదినిమిషాల తర్వాత సెంటర్ బయటికి వచ్చింది. కూతురిని చూడగానే సాంబయ్యకు కూడా కాస్త హైరానా తగ్గింది.

"సారి నాన్న! ఎగ్జామ్ సరిగా రాయలేకపోయాను", గిల్టీగా ఫీలవుతూ చెప్పింది స్వాతి.

"ఏంకాదులే తల్లి! పరీక్ష ఇప్పుడు కాకుంటే మళ్ళీ రాయొచ్చు. నువ్వు బాగానే ఉన్నావ్ కదా...ఇబ్బందేం లేదు కదా? అయినా ఇది ఆడపిల్లలకు ఎప్పుడూ ఉండేదే కదా...దానికి ఎందుకు ఏడవడం? నువ్వేదో తప్పు చేసినట్లు ఎందుకు భయపడటం?", అడిగాడు సాంబయ్య.

తండ్రి అంటున్నది నిజమే కదా అనిపించి స్వాతికి కాస్త మనసు కుదుటపడింది.

"సరే...నువ్విక దానిగురించేం ఆలోచించకు. పదా వెళ్దాం. బస్సు దొరికే వరకు ఎంత టైమవుతుందో ఏమో..", అంటూ ముందుకు కదిలాడు. సరే అన్నట్లు తలాడించి తండ్రిని అనుసరిస్తూ అడుగులు వేసింది స్వాతి.

........సమాప్తం......

©స్పూర్తి కందివనం.



Rate this content
Log in

Similar telugu story from Inspirational