Spoorthy Kandivanam

Drama Inspirational

4  

Spoorthy Kandivanam

Drama Inspirational

సత్యవతి హ్యాండ్లూమ్స్

సత్యవతి హ్యాండ్లూమ్స్

2 mins
297


"నేసిన బట్టలు అమ్ముడుపోక, నిల్వలు పేరుకుపోయినయి. మూడు నాలుగు నెలలుగా సంపాదన లేక ఒక పూట తింటే ఇంకోపూట పస్తులుండే పరిస్థితి. ఇవేమీ పట్టకపొగ, పెద్ద ఫోను కావాలని మొండికేస్తే, అప్పు తెచ్చి కొనిచ్చిండు మీ నాయిన. సదువుకోకుండ పొద్దస్తమానం ఆ ఫోను పట్టుకొని దోస్తులెంబడి తిరుక్కుంట వుంటున్నవు. ఎందుకిట్ల తయారయినవు రా..? మీ నాయిన చాన ఫికర్ జేస్తున్నడు నీ విషయంల", కొడుకు కృష్ణతో ఆవేదనగా అంది సరస్వతమ్మ.

తల్లి మాటలు ఏమీ పట్టనట్లుగా ఛార్జింగ్ పెట్టిన తన స్మార్ట్ ఫోనును తీసుకుని విసవిసగా బయటికి వెళ్లిపోయాడు కృష్ణ. 

"కాలేజీకి పోయి మంచిగ సదువుకుంటే కనీసం వీడి భవిష్యత్తన్నా మంచిగుంటదేమో అనుకుంటే వీడేమో ఇట్ల తయారైతున్నడు. వీనికి బాధ్యతలెప్పుడు తెలుస్తయో ఏమో", అంటూ బాధపడుతున్న సరస్వతమ్మను చూసి, "ఏం జేస్తం! ఈ కాలం పిల్లలే ఇంత...!", అంటూ అసహనంగా నిట్టూర్చాడు సత్యం.

వారం పది రోజులు గడిచాయి. ఇల్లు శుభ్రం చేస్తున్న సరస్వతమ్మ బట్టలు నిల్వ ఉంచిన గదిలోకి వెళ్లి చూడగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాంట్లో కొంత సరుకు మాయమవడంతో ఇదంతా కొడుకు కృష్ణ పనే అయ్యుంటుందని ఆగ్రహావేశాలతో భర్త దగ్గరికి వెళ్లి విషయం చెప్పి, "సదువుకోకుండ తిరగడమే కాకుండా ఇప్పుడు దొంగతనంగ సరుకు కూడా తీసుకపోయి అమ్ముకొని ఆ పైసలతోని జల్సాలు చేస్తున్నడో ఏమో!", అంది ఆవేదనగా.

అది విన్న సత్యంకి ఆవేశం కట్టలు తెంచుకుంది. తన గదిలో ఫోను నొక్కుతూ కూర్చున్న కొడుకు కృష్ణను బయటికి లాక్కొచ్చి తిట్టి తనపై చేయజేసుకోబోయాడు.

ఇంతలో, కృష్ణను కలవడానికి అతని స్నేహితుడు మురళి వచ్చి, "అరేయ్ కృష్ణ! నువ్వు చెప్పిన అడ్రస్సుకి పోయి డెలివర్ చేసొచ్చిన రా. ఇగో పైసలు", అంటూ కృష్ణ చేతికి డబ్బు ఇచ్చాడు.

సరస్వతమ్మ, సత్యం ఆ డబ్బు ఏంటో, ఎక్కడిదో ఏమీ అర్థంకాక ప్రశ్నార్థకంగా మురళి వైపు చూసారు.

"అంకల్! ఇప్పటినుంచి మీ కష్టాలు కొంత తీరినట్టే. కృష్ణ తన ఫోను ద్వారా సత్యవతి హాండ్లూమ్స్ అని ఓ ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేసి ఆన్లైన్ షాపింగ్ ద్వారా మీరు నేసిన బట్టలను అమ్మకానికి పెట్టిండు. మొదట్లో అసలేమీ రెస్పాన్స్ రాకున్నా మెల్లిగ ఇప్పుడిప్పుడే రెండు మూడు ఆర్డర్స్ వచ్చినయి. నేనే డెలివర్ చేసి వస్తున్నా", అంటూ ఆతృతగా చెప్పాడు మురళి.

కొడుకుని తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా బాధపడ్డారు సరస్వతమ్మ, సత్యం.

కృష్ణ... తల్లిని, తండ్రిని చూసి ఒక చిరునవ్వు నవ్వి, మురళి ఇచ్చిన డబ్బుని తన తండ్రి చేతిలో పెట్టాడు.

చెమ్మగిల్లిన కళ్ళతో కొడుకుని హత్తుకున్నాడు సత్యం.

..........సమాప్తం......

(లోగిలి సాహిత్య మాస పత్రిక వారు నిర్వహించిన గాంధీ జయంతి 2020 సింగల్ పేజీ కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)



Rate this content
Log in

Similar telugu story from Drama