Spoorthy Kandivanam

Drama Others

4  

Spoorthy Kandivanam

Drama Others

పాపం అమ్మ...!

పాపం అమ్మ...!

15 mins
612


గాఢ నిద్రలో ఉన్న నేను హఠాత్తుగా మోగిన అలారం శబ్దానికి ఉలిక్కిపడి నిద్ర లేచాను. ఆ శబ్దానికి నా పక్కనే పడుకున్న మా ఇద్దరు పిల్లలు ఎక్కడ నిద్రలేస్తారో అన్న కంగారుతో దిండు పక్కనున్న నా సెల్ ఫోన్ లోంచి మొగుతున్న అలారంను బంజేయడానికి దాన్ని నా చేతిలోకి తీసుకున్నాను.


ఈ లోగా...."ప్చ్....సంయుక్త....! అలారం ఆఫ్ చేయి, డిస్టర్బెన్స్ గా ఉంది...ఎన్ని సార్లు చెప్పాను సౌండు తగ్గించి పెట్టుకోమని", అంటూ విసుగ్గా మరో పక్కకి తిరిగి పడుకుంటూ అన్నారు మా వారు.


నేను వెంటనే అలారంను బంజేసాను, అప్పుడు సమయం ఐదవుతుంది. 'ఇంకాసేపు పడుకోవచ్చుగా..' అని నా మెదడు పదే పదే సందేశాన్ని అందిస్తుంది. దాని మాట కాదనలేక మళ్ళీ మంచంపై అలా ఒరిగి కళ్ళు మూసుకున్నాను. 


అయిదు నిమిషాలు గడిచాక..."సంయుక్త! ఇంకా పడుకున్నావేం...? లే... ఆలస్యమవుతోంది...మ్మ్...", అంటూ హెచ్చరించింది నా అంతరాత్మ.


దాంతో ఒక్క ఉదుటున లేచి కూర్చుని, ధీర్ఘంగా నిట్టూరుస్తూ మంచం దిగి, పిల్లల దుప్పట్లు సరిచేసి, నేను పక్కన లేకపోడంతో దొర్లి క్రిందపడిపోకుండా మా బుజ్జిగాడి పక్కన దిండుని అడ్డుగా పెట్టి బెడ్రూంలోంచి బయటకు నడిచాను.


పది నిమిషాల్లో కాలకృత్యాలు ముగించుకుని, ఇల్లంతా ఊడ్చి, అట్లాగే కాంపౌండ్ అంతా కూడా ఊడ్చి, వాకిట్లో ముగ్గు వేసి పైకి లేస్తుండగా, ఉన్నట్టుండి కళ్ళు బైర్లు కమ్మాయి. ముని వేళ్ళతో నుదుటిని నొక్కి పట్టి గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచాను. 


రాత్రి పనంతా పూర్తిచేసుకున్నాక, మా మీను, అదే మా పెద్దదాని స్కూలు పుస్తకాలకు అట్టాలు వేద్దామని కూర్చున్నాను. పుస్తకాలన్నింటికీ అట్టాలు వేసి పడుకునేసరికి రాత్రి పన్నెండున్నరయ్యింది. బహుశా నిద్ర సరిపోలేదేమో, అందుకే కాబోలు కళ్ళు బైర్లు కమ్మాయి, అనుకుంటూ మెల్లిగా ఇంట్లోకి నడిచి, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి ఓ సారి నీళ్ళతో కళ్ళను తడిపి, ముందుకి వంగి నైటీ అంచులతో ముఖమ్మీది తడిని తుడుచుకున్నాను.


ఆ సమయంలో ఇంట్లో వాళ్ళంతా హాయిగా నిద్రపోతున్నారు. నిశ్శబ్దంగా ఉన్న హాల్లో టిక్...టిక్... మంటూ శబ్దం చేస్తూ, సమయం ముందుకు నడుస్తుంది అని నన్ను హెచ్చరిస్తున్నట్లుగా నా దృష్టిని తనవైపుకు మళ్లించింది గోడకు ఉన్న గడియారం నావైపే చూస్తున్నట్లు. నా మేలు కోరే నన్ను పిలుస్తుంది కదా అన్నట్లు నేను కూడా దాని వంక చూసాను.


"ఐదున్నర అవుతుందా...? అమ్మో...అప్పుడే అరగంట గడిచిపోయిందా...? ప్చ్....", అంటూ గబగబా వంటింటి వైపు నడుస్తూ దారిలో "నన్ను పలకరించి వెళ్లందే నీ పని ఎలా మొదలుపెడతావ్...?", అన్నట్లుగా ఠీవిగా నిలుచున్న ఫ్రిజ్ ని పలకరింపుగా చూసి, అందులో చల్లగా సేదతీరుతున్న పాల ప్యాకెట్లను, వంటకి కావలసిన కూరగాయలను తీసుకుని వంటింట్లోకి వెళ్లి నా పని మొదలు పెట్టాను.


చక చకా కూరగాయలు తరుక్కుని, మా వారికి, పెద్దదానికి బాక్సుకి అన్నం, పప్పు, కూర వండేసాను. ఇక టిఫిన్లోకి చట్నీ చేసాను, ఈ లోపు అత్తయ్య, మామయ్య నిద్రలేస్తే వాళ్ళకోసం టీ పెడుతుండగా పిల్లలు కూడా నిద్రలేచొచ్చి, ఇద్దరూ చెరో పక్క నిలుచుని ఒక చేత్తో నన్ను హత్తుకుని మరో చేత్తో కళ్ళు నలుపుకుంటూ నిలబడ్డారు. 


పెద్దవాళ్ళకి టీ, అలాగే మా వారికేమో కాఫీ ఇచ్చేసి, పిల్లలకి పళ్ళు తోమి, స్నానాలు చేయించి, స్కూలుకి తయారు చేసేసరికి ఎనిమిది కావొచ్చింది.


"ఊహూ....నాకు దోస వొద్దు...!", మొండికేసాడు మా బుజ్జిగాడు.


"ఇవాళ్టికి తినరా...నీకు దండం పెడతా...అక్క చూడు ఎంత బాగా తింటుందో దోస.... ఈ పూటకి తినరా...నా బుజ్జి కదూ...", వాడి గడ్డం పట్టుకుని బతిమాలనగా అన్నాను.


అదేంటో వాడికి దోస నచ్చదు. ఆ విషయం తెలిసినా ఇవాళ కాస్త వంట్లో బాగోలేకపోడంతో ఎలాగోలా ఈ రోజుకి అదే తినిపిద్దాము అనుకున్నాను. కానీ పసివాళ్ళు కదా...వింటారా....


"ఊహూ...అదేం కుదరదు. నాకు వొద్దు నేను తినను...", పేచీ పెట్టాడు మా బుజ్జిగాడు.


"సంయుక్త...! వాడు ఏది తింటే అది చేసిపెట్టరాదూ! ఎందుకు పిల్లాడిని అలా ఎడిపిస్తావు..", టీవీలో వార్తలు చూస్తున్న మా మామయ్య మందలింపుగా అన్నారు.


అలాగే అన్నట్లు తలూపి ఒక నిట్టూర్పు వదిలి వంటింట్లోకి వెళ్ళాను. పొద్దున ముగ్గు వేసేటప్పుడు కళ్ళు బైర్లు కమ్మాయి కదా, దాని ప్రభావం అనుకుంటా బాగా తలపోటుగా అనిపించింది. ఓపిక తెచ్చుకొని అప్పటికప్పుడు బుజ్జిగాడు ఇష్టంగా తినే చిత్రన్నం కలిపి తినిపించి, పిల్లల స్కూలు బ్యాగులు సర్ది పెట్టాను. 


అప్పుడే..."ఏయ్...సంయుక్త..! ఏంటీ... ఇవాళ నేను వస్తానని తెలిసి కూడా నన్ను మర్చిపోయావూ? నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. నన్ను మర్చిపోయావో ఏం జరుగుతుందో తెలుసుగా, నీ పని ఔట్...", అంటూ టంగుమని నా బుర్రలో గంట మోగించి మరీ చెప్పింది మా ఇంటి మంచినీళ్ళ ట్యాపు. దాని ఈగో హర్ట్ చేస్తే తర్వాత నేను హర్ట్ అవ్వాల్సొస్తుందని తక్షణమే ఆ పని కానిచ్చి దాని ఈగో సాటిస్ఫై చేసేసి 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకున్నాను.


ఇంతలో..."సంయుక్త...! నాకు, మీ మామయ్యకి టిఫిన్ తీసుకురా...", పూజ గదిలోంచి బయటకొస్తూ చిన్నగా కేకేసారు అత్తయ్య.


"అలాగే అత్తయ్య...", అని చెప్పి వాళ్ళకోసం దోసలు వేసుకొద్దామని వెళ్ళాను.


గరిటతో దోస పిండిని పెంనంపై పోసి గరిటని గుండ్రంగా తిప్పుతూ ఉండగా ఒక్కసారిగా దానితోపాటు పెంనం, అలాగే వంటిల్లంతా గిర్రున తిరిగినట్లయ్యింది, అప్రయత్నంగానే నేను క్రింద పడిపోయాను.


ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు కానీ కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి మంచంపై పడుకుని ఉన్నాను. 


అప్పటివరకు నేను ఎప్పుడు కళ్ళు తెరుస్తానా అని బెంగగా నా పక్కనే కూర్చున్న పిల్లలు, "నానమ్మా...! తాతయ్య...! అమ్మ కళ్ళు తెరిచింది...!", అంటూ కేకలు వేస్తూ పరుగున హాల్లోకి వెళ్లారు.


పక్కనే లాప్టాప్ లో తల దూర్చి బిజీగా ఆఫీసుకి సంబంధించి ఏదో ముఖ్యమైన పనిలో మునిగిపోయి ఉన్న మా వారు నా వైపు చూసి, "ఇప్పుడెలా ఉంది...?", అని అడిగారు.


"హ్మ్....కొంచం పర్వాలేదు...", తల పట్టుకుని నెమ్మదిగా పైకి లేచి కూర్చుంటూ అన్నాను.


ఇంతలో మా అత్తయ్య, మామయ్య, పిల్లలు గదిలోకి వచ్చారు. నేను చప్పున మంచం దిగబోతుంటే.."ఆ...ఆ..పర్వాలేదులే...", అన్నారు మామయ్య.


అత్తయ్య కాఫీ కప్పుతో నన్ను సమీపించి, "మాకు ఇప్పుడిప్పుడు బీపీలు, శుగర్లు వస్తుంటే, మీకేమో ఈ వయసు నుంచే అన్ని సమస్యలు వస్తున్నాయి. డైటింగులు గీటింగులు అంటూ సరిగా తినకుండా వచ్చిన తంటాలివి. శుబ్బరంగా కడుపునిండా తిని పని చేసుకుంటే ఏవీ ఉండవు. నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎన్ని పనులు చేసేదాన్నో...హ్మ్..సరేలే ముందు ఈ కాఫీ తాగు కాస్త హుషారుగా ఉంటుంది...", అంటూ నా చేతికి కాఫీ కప్పు ఇచ్చారు.


"కడుపునిండా తిండి తినేంత సమయం కూడా ఉందా అత్తయ్య నాకు..! అయినా కళ్ళు తిరిగి పడిపోతే చాలు డైటింగ్ వల్లే అంటూ అందరూ అదే డైయాలోగ్ కొడతారే తప్ప అసలు కారణం తెలుసుకోరు, ఎందుకు అలా అవుతోందని కనుక్కోడానికి ప్రయత్నించరు. నిద్ర సరిపోకపోడమో, పని వొత్తిడి ఎక్కువై కూడా అవ్వొచ్చు కదా అని ఆలోచించరు కానీ ఏదో అనాలి కాబట్టి ఓ మాట అనేస్తారు అంతే. ఇది మామూలే కదా అత్తయ్య...", అని అనాలని ఉన్నా ఆవిడపై ఉండే గౌరవం అడ్డుపడి పైకి అనలేక మనసులోనే అనుకుని ధీర్ఘంగా శ్వాస తీసుకుని మౌనంగా, మోహమాటంగా ఆవిడ చేతిలోంచి కప్పు తీసుకుని, అందులో ఉన్న వేడి వేడి కాఫీని గొంతులోకి పోనిచ్చాను, ప్రాణం లేచొచ్చినట్లైంది.


"ఇప్పుడెలా ఉందమ్మా...!", అడిగారు మామయ్య.


"కొంచం పర్వాలేదు మామయ్య...!", నిదానమైన స్వరంతో చెప్పాను.


ఆయన సరే అన్నట్లుగా చూసి హాల్లోకి వెళ్లిపోయారు. ఆయన వెంటే అత్తయ్య, కూడా వెళ్లారు. 


"అమ్మా...! ఇందాక నీకు ఏమైంది? ఎందుకు పడిపోయావ్? నాన్నే నిన్ను ఎత్తుకొచ్చి మంచంపై పడుకోపెట్టారు తెలుసా...నేను, తమ్ముడు నిన్ను ఎంత పిలిచినా పలకలేదు నువ్వు ఎందుకు...?", అమాయకంగా నా ముఖంలోకి చూస్తూ అడిగింది మీను.


నేను మా వారి వైపు ఆప్యాయంగా చూసి, మళ్ళీ పిల్లల వైపు చూసి వాళ్ళను దగ్గరికి తీసుకుని, "ఎంలేదమ్మా...కాస్త తల తిరిగడం వల్ల అలా పడిపోయాను అంతే...ఇప్పుడు బాగానే ఉన్నాను...", అన్నాను లాలనగా.


నేను బాగానే ఉన్నాను అన్న మాట విన్న క్షణం పిల్లలిద్దరి ముఖాల్లో ఆనందం, ఉత్సాహం చూసాను.


"సరే... మీరు వెళ్లి ఆడుకోండి నేను కొద్దిసేపటిలో వస్తాను", అని చెప్పగా, వాళ్ళు హాల్లోకి వెళ్లారు.


పిల్లలు వెళ్ళాక, కప్పులో ఉన్న మిగతా కాఫీ గబగబా గొంతులోకి పోనిచ్చి మెల్లిగా మంచం దిగి రెండడుగులు ముందుకు వేసాను.


"ఆ...మరిక నేను ఆఫీసుకి బయలుదేరుతా...", అన్నారు మా వారు లాప్టాప్ ఆఫ్ చేసి దాన్ని బ్యాగులో పెట్టుకుంటూ.


"టిఫిన్...?"


"వొద్దు...నీకు బాగోలేదని ఇంతసేపు వెయిట్ చేసా. స్కూలుకి కూడా ఫోన్ చేసి పిల్లలు ఇవాళ ఓ గంట లేటుగా వస్తారని వాళ్ళ టీచర్కి ఇన్ఫోర్మ్ చేసాను. ఇప్పటికే అలస్యమయ్యింది, వాళ్ళను స్కూలు దగ్గర డ్రాప్ చేసి వెళ్లేసరికి నాక్కూడా ఆలస్యమవుతుంది. ఇట్స్ ఒకే.. ఇవాళ్టికి ఆఫీసు కాంటీన్ లో తింటాలే..."


"ఐదునిమిషాలు..... దోసలు వేసుకొస్తా...."


"ప్చ్....కాంటీన్ లో తింటానన్నాను కదా. ఇప్పుడు అంత హడావిడిగా నువ్వు వేసుకొచ్చినా తీరిగ్గా కూర్చుని తినేంత టైం నాకు లేదు"


మౌనంగా నిలుచున్నా నేను.


అప్పటికే ఫార్మల్ దుస్తుల్లో ఆఫీసుకి తయారయ్యి ఉన్న మా వారు నడుముకి బెల్టు తొడుక్కుని, భుజానికి లాప్టాప్ బ్యాగును తగిలించుకుని, "సరే...నే వెళ్ళొస్తా...", అంటూ కదిలారు.


సరే అన్నట్లు తలూపాను నేను.


మా వారు వెళుతూ వెళుతూ..."అన్నట్లు వర్క్ లో పడి చెప్పడం మర్చిపోయాను...", అన్నారు వెనక్కి తిరిగి.


ఏమయుంటుందోనని ఆతృతగా ఆయన ముఖంలోకి చూసాను.


"నిన్న నువ్వు లంచ్ కి పెట్టిన అరటికాయ కూర అస్సలు బాగోలేదు తెలుసా...మా కొలీగ్... అతని కూర షేర్ చేస్తే తినాల్సొచ్చింది. కాస్త చూస్కో...ఆ కూర మా కాలీగ్స్ తినుంటే ఎంత ఇన్సల్టింగ్ గా ఉండేది నాకు...?", కొంచం సీరియస్గా చెప్పి గదిలోంచి బయటకు వెళ్లిపోయారు.


మనసు నొచ్చుకుంది నాకు.


"ఎప్పుడో ఒకసారి వంటలో పొరపాటు జరగొచ్చు, అది అందరి ఇళ్లల్లో జరిగేదే. ఇందులో అంత ఇన్సల్ట్ అవ్వడానికేముంది...! వంట్లో బాగోలేదు కదా అన్న కన్సర్న్ కూడా లేదు. ఎప్పుడూ ఆఫీసు గొడవే...ఛా...", లోగొంతుకతో నాలో నేనే అనుకుని, నేను కూడా హాల్లోకి వెళ్లి, పిల్లలకి, మా వారికి బాయ్ చెప్పడానికి వాళ్ళతో పాటు గుమ్మంలోకి నడిచాను.


పిల్లలు నన్ను చూస్తూ, "బాయ్ అమ్మా...!", అని పెద్దగా అంటూ నాకు ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చారు. నేను కూడా వాళ్ళకి బదులుగా ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చాను. వాళ్ళ మొహాల్లో ఉత్సాహం, కళ్ళల్లో మెరుపు చూస్తే నా మనసుకి చాలా తేలికగా ఆనందంగా అనిపిస్తుంది. 


మా వారేమో 'వెళ్ళొస్తాను' అన్నట్లుగా హెల్మెట్లోంచి నా వైపు బాణం లాంటి ఓ చూపుని విసిరి, బండిని స్టార్ట్ చేశారు. ఆయన ఇందాకటి మాటల్లాగే ఆ చూపు కూడా నా మనసుకి బాగానే గుచ్చుకుంది. వాళ్ళు వీధి చివరివరకు వెళ్ళేదాకా గుమ్మంలోనే ఉండి, లోపలికి వచ్చేసాను.


హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్న అత్తయ్య, మామయ్యలను చూసి, "టిఫిన్ తిన్నారా అత్తయ్య...?", అని అడిగాను. 


"లేదు సంయుక్త.... వేసుకురా...", అన్నారు అత్తయ్య.


మనసులోనే అసహనంగా నిట్టూర్చి వంటింట్లోకి వెళ్లి చూడగా ఎక్కడి పని అక్కడే ఆగిపోయి నా కోసం మూలుగుతున్నట్లుగా కనిపించింది వంటిల్లంతా. ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకుని అత్తయ్య, మామయ్యలకు టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం వంటకి మళ్ళీ రెడీ అయిపోయాను.


మొదట్లో పొద్దున మా వారికి వండినప్పుడే అందరికీ ఒకేసారి వండేదాన్ని. 


కానీ.."పొద్దునెప్పుడో వండినది, మేము తినేసరికి చల్లారిపోతుంది తినబుద్దికాదు అందుకే మా వరకు వేడి వేడిగా మళ్ళీ వండు సంయుక్త...", అని అన్నారు అత్తయ్య. అంతేనా...ఈ పూటకి వండినవి మళ్ళీ రాత్రికి తినరు. అప్పుడు మళ్ళీ వేడి వేడిగా వండి పెట్టాలి అందరికీ.


నేను ఎప్పుడూ అనుకుంటాను....ఈ లోకంలో కనీసం ఒక్క పూట తిండి దొరికినా చాలు అనుకునేవారు ఉన్నారు, ఇంకొందరు ఆ ఒక్క పూట తిండి కోసం కూడా వెంపర్లాడేవాళ్ళు ఉన్నారు. అలాంటిది మనమేమో ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా తిండి విషయంలో పలు వంకలు పెడతాం. అన్ని రోజులు మనవి కావు అన్నట్లు ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది ఒకవేళ ఏదైనా కష్టకాలం వచ్చి ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురుపడితే మా ఇంట్లో లాంటి వాళ్ళు ఆ పరిస్థితులకు సర్దుకుని ఉండగలరా....? అని. అయినా ఎవరి ఇష్టాలు వాళ్లకు ఉంటాయిలే, కాకపోతే ఇలా బాగోలేని సమయాల్లోనైనా మినహాయింపు ఇస్తే నాక్కూడా బాగుంటుంది కదా.....


ఇలా పలు ఆలోచనల్లో మునిగి తేలుతూనే ఏదో ఒకరకంగా మొత్తానికి ఈ పూటకి వంట పని ముగించేసాను.


సింకులో అంట్లు, బకెట్లో బట్టలు..."మరి మా సంగతేంటి సంయుక్త...!", అన్నట్లు నా వంక దీనంగా చూశాయి. వాటిని మాత్రం నిరాశ పరచడం ఎందుకు అని వాటి పని కూడా ముగించేసాను. 


బట్టలు ఆరేద్దామని మేడ మీదకి వెళ్తూ మా పక్కింట్లో ఉండే కల్యాణి కనిపిస్తే..."హయ్ కల్యాణి...! నాకు కొంచెం వంట్లో బాగోలేదు. ఈ ఒక్క రోజుకి ఏమనుకోకుండా మీ పాపతో పాటు మా బుజ్జిని కూడా స్కూలు నుంచి ఇంటికి తీసుకురాగలవా...?", మొహమాట పడుతూ నానుస్తూ అడిగాను.


మా బుజ్జిగాడు ప్లే స్కూల్ కాబట్టి ఒక్క పూటే ఉంటుంది స్కూలు, పెద్దది మాత్రం సాయంత్రం స్కూలు వ్యానులో వస్తుంది. ఇవాళ లేటుగా వెళ్లారు కదా అందుకే పొద్దున మా వారే వాళ్ళను స్కూలు దగ్గర దిగబెట్టి వెళ్లారు.


"ఓకే సంయుక్త... అలాగే తీసుకొస్తాను. దీనికి ఇంత మోహమాటంగా అడగాలా...!", అంది కల్యాణి మృదువుగా నవ్వుతూ.


నేను నిశ్శబ్దంగా నవ్వి, "థాంక్యూ...", అని చెప్పి మేడ మీదకు వెళ్ళాను.


బట్టలు ఆరేస్తుండగా వళ్ళంతా నీరసంగా అనిపించింది, వంట్లో సత్తువ లేనట్లుగా ఉందని అక్కడే ఓ పక్కకి పూల కుండీల వద్దనున్న చిన్న చెక్క స్టూలు మీద కూర్చున్నాను.


ఈ పని అయిపోయాక స్నానం చేసేలోపు బుజ్జిగాడు స్కూలు నుంచి వచ్చేస్తాడు. అత్తయ్య, మామయ్యలకు భోజనం పెట్టి, వాడికి కూడా అన్నం తినిపించాలి. గంట గంటన్నర సేపు వాడి వెంట పడుతూ అన్నం తినిపించేలోపు నా తల ప్రాణం తోకకొస్తుంది. అనంతరం వాడిని పడుకోపెట్టి నేను తిని, మేడ మీద బట్టలు తెచ్చి మడతపెట్టి అవి సర్దేలోపు పెద్దది కూడా స్కూలు నుంచి ఇంటికొచ్చేస్తుంది. ఇక సాయంత్రం అందరూ టీవీ ముందు రిలాక్స్ అవుతుంటే, నేను మాత్రం అందరికీ స్నాక్స్ రెడీ చేస్తూ వంటింట్లోనే గడిపేయాలి. ఒక్కోసారి సాయంత్రం పూట అంతా ఇంటి వెనుక పెరట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పిల్లల ఆటపాటలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. నేను స్నాక్స్ చేస్తూ మధ్యమధ్యలో దూరం నుంచే చూస్తూ, "నేను కూడా అందరితోపాటు అలా కూర్చుని టైం స్పెండ్ చేసేలా ఉంటే ఎంత బాగుండు..", అని ఫీలవుతుంటా.


ఆ తర్వాత ఒక వైపు పిల్లలను చదివిస్తూ, వాళ్లకు హోంవర్కులు చేయిస్తూనే వంట చేయాలి. రాత్రి అందరికీ భోజనం పెట్టి, భోజనాలు ముగిశాక మళ్ళీ అంట్లు తోముకొని వంటిల్లంతా సర్దుకుని, పిల్లలను పడుకోబెట్టి, వాళ్ళు ఇంటినిండా పడేసిన బొమ్మలు, చెత్త క్లీన్ చేసి, నేను పడుకునేసరికి వళ్ళు హూనమయిపోతుంది. మళ్ళీ పొద్దున్నే లేవాలి లేకపోతే అన్ని పనులు ఆలస్యమవుతాయి, ఇంట్లో వాళ్ళ కోపాలకు, చిరాకులకు బలి కావాలి. హ్మ్...ఇక కడుపునిండా తిండి, కంటి నిండా హాయిగా నిదురపోయే సమయమెక్కడిది నాకు. నాకంటూ ప్రత్యేక సమయం ఎప్పుడు దొరుకుతుందో ఏమో.


ఎండాకాలంలో అయితే ఇక నా అవస్థ చెప్పనక్కర్లేదు. భగ భగ మండే ఆ భానుడికి నేనంటే ఎంత కోపమో ఏమో మరి అన్నట్లు ఇంట్లో వాళ్లంతా ఫ్యానుల కిందా, ఏసీలు, కూలర్ల ముందు చల్లగా సెదతీరుతుంటే నన్ను వంటింట్లో ఉక్కపోతతో ఉడికిస్తూ, చెమటలతోనే స్నానం చేయిస్తాడు.


ఇదంతా ఒకెతైతే.... ప్రతి నెలా ఆ మూడు రోజులూ నా అవస్థ ఆ దేవుడికే ఎరుగు. కాదు...ఆ దేవుడు కూడా ఎరుగడేమో, అందుకే ఆ మూడు రోజులు వచ్చే భరించలేని నొప్పిని తట్టుకోలేక వళ్ళంతా చమటలు పట్టి నా కాళ్ళు, చేతులు వణుకుతూ నా శరీరమంతా బలహీనమైపోయి, నిలబడలేకా, కూర్చోలేక, ఒక్కదాన్నే ఇటు పనంతా చేసుకోలేక, అటు పిల్లలను మేనేజ్ చేసుకోలేక, తిందామంటే తిండి తినలేక, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా ఎవ్వరికీ పట్టదు. ఆ క్షణం నా బాధను ఎవ్వరితోనూ చెప్పుకోలేక దుఃఖమంతా మౌనంగా కళ్ళవెంట జారీ చెక్కిళ్ళని చేరుతుంటే, వంటగది వేడికి నా వదనానికి పట్టిన చమట బిందువులు వాటిని ఇంట్లోవాళ్ళకి కనిపించకుండా కప్పిపుచ్చేస్తాయి. 


అందరికీ టైముకు అన్నీ కావాలి. ప్రాణం పోతుందన్నా అన్నీ నేనే చేయాలి. పోనీ పనిమనిషినైనా పెట్టుకుందాము అంటే.."మన పని మనం చేసుకుంటే పనిమనుషులతో పనేంటి మనకు. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ సరిగా రారు, వచ్చినా ఆదరా బాదరా ఏదో చేసేసి వెళ్ళిపోతారు..", అని చెప్పి వద్దన్నారు అత్తయ్య వాళ్ళు.


మొదట్లో ఉద్యోగానికి కూడా వెళ్ళేదాన్ని, బుజ్జిగాడు పుట్టాక, ఇంటి పని, ఆఫీసు పనితో వొత్తిడి బాగా పెరిగింది చేయలేకపోయేదాన్ని. అందుకే ముప్పైవేల జీతం వస్తున్న ఉద్యోగం కూడా వదిలేసాను.


ఇంట్లో అన్ని పనులు ఒకే మనిషి ఎలా చేస్తుంది... ఒక్కతే కష్టపడుతుంది, పాపం మనం కూడా ఏవైనా చిన్న చిన్న పనులు చేస్తూ తనకి సహాయపడదాం అని ఒక్కరు కూడా ఆలోచించరు. పైగా చేసిన వాటికి పేర్లు పెడుతుంటారు.


అవును...! ఆలోచించరు...ఎందుకు ఆలోచిస్తారు? ఒకప్పుడు పెళ్లికాక ముందు నేను కూడా ఇంతే కదా.


మా ఇంట్లో నేనే చిన్నదాన్ని, నాకంటే ముందు ఇద్దరు అన్నయ్యలు. ఒక్కతే ఆడపిల్ల, అందులోనూ చిన్నదాన్ని కావడంతో ఇంట్లో నాకు గారబం ఎక్కువ, మా నాన్న గారబం మరీ ఎక్కువ. అది అడ్డం పెట్టుకునే ఇంట్లో నాదే రాజ్యంగా ఉండేదాన్ని.


అమ్మ ఉద్యోగానికి వెళుతుంది. ఆఫీసులో పనితో పాటు ఇంటి పని, వంట పని అన్నీ తనే చేసుకునేది. నేనైతే అమ్మ ఎంత కష్టపడుతున్నా అస్సలు ఒక్క పని ముట్టేదాన్ని కాదు, వంటింట్లోకైతే కనీసం కాలు కూడా పెట్టేదాన్ని కాదు. అసలే నేను ఫ్యాను లేకుండా నిముషం ఉండలేను, ఉక్కపోతని ఏమాత్రం భరించేదాన్ని కాదు. అందుకే నాకు అప్పట్లో వంటింట్లోకి వెళ్లాలంటే చిరాకుగా ఉండేది.


అమ్మ రోజూ పొద్దున్నే అయిదు గంటలకు నిద్రలేచి అన్ని పనులు చేసేస్తుంది. మాకు, నాన్నకు, నానమ్మా, తతయ్యాలకు అందరికీ ఏదీ తక్కువకాకుండా చూసుకుంటుంది.


పనిమనిషి ఉన్నా సరిగా వచ్చేది కాదు, ఎప్పుడూ డుమ్మాలు కొడుతూ అమ్మని బాగా సతాయించేది. వాళ్ళు ఉండేది మా వీధిలోనే కావడంతో ఎప్పుడైనా పనిమనిషి రాకపోతే..."సమ్మూ...! పనిమనిషి ఇంకా రాలేదు కాస్త వాళ్ళ ఇంటిదాక వెళ్లి కనుక్కుని రావే...నాకు లేటవుతుంది...", అంటూ తట్టి లేపేది పొద్దున్పొద్దున్నే అమ్మ.


"అబ్బా...ఏంటమ్మా...పడుకొనివ్వవు. రాత్రంతా చదువుకుని పడుకున్నా పొద్దున్నే లేపుతావు. నేను లేవను...నువ్వే వెళ్ళొచ్చు కదమ్మా...", అని విసుక్కునేదాన్ని.


అమ్మ బతిమిలాడి బతిమిలాడి ఇక నన్ను అడిగి లాభం లేదని తనే వెళ్ళేది. అన్నయ్యలు కూడా పెద్దగా అమ్మకు సహాయం చేసేవాళ్ళు కారు. ఎప్పుడైనా మరీ అవసరమైతే మా పెద్దన్నయ్య చేసేవాడు.


పెద్దన్నయ్య కాస్త నెమ్మదస్తుడు, కానీ చిన్నన్నయ్య మాత్రం బాగా హుషారు. ఎప్పుడూ నాకు అన్నింటిలో పోటీ, మా ఇద్దరికీ క్షణం కూడా పడేది కాదు, ఎప్పుడూ కొట్టుకునేవాళ్ళం.


"ఆడపిల్లవైయ్యుండి బుద్ధిలేదు...అమ్మకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా...", అంటూ తిట్టేవాడు చిన్నన్నయ్య.


నాకు మండి, "ఆడపిల్ల అయితే మాత్రం ఇంట్లో పనులు ఆడపిల్లే చేయాలని మన రాజ్యాంగంలో రూల్ ఏమైనా రాసిపెట్టి ఉందా? ఎప్పుడూ నాపై ఏడ్చే బదులు నువ్వే చేయొచ్చుగా ఆ హెల్పేదో...", అంటూ గొడవ పడేదాన్ని.


అప్పుడు మా నాన్న వచ్చి నాకు సపోర్ట్ చేస్తూ చిన్నన్నయ్యను మందలించేవారు. ఈ గొడవంతా చూసి విసుగుచ్చి, "అబ్బాబ్బా...! ఆపండి ఇంక మీ గొడవలు. ఎవ్వరూ ఏమీ చేయిద్ధులే..నేనే ఎలాగో చేసుకుంటాను..", అంటూ చిరాగ్గా వెళ్లిపోయేది అమ్మ.


మాకేమో అప్పుడు పొద్దున్నే ఆరు గంటలకు మంచినీళ్ళు వచ్చేవి, కేవలం అరగంట మాత్రమే వదిలేవాళ్ళు. అప్పుడు ఒక్కోసారి అమ్మకు కుదరకపోతే నన్ను నిద్రలేపేది. కానీ నేను..."అబ్బా...నాకు తలనొప్పిగా ఉందమ్మా...నేను లేవలేను, అన్నయ్యని పట్టమను", అని చెప్పి తప్పించుకునేదాన్ని.


అప్పుడు మా నాన్న, "దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు, దానికి పొద్దున్నే నిద్రలేస్తే తలనొప్పి వస్తుందని తెలుసుకదా..", అనేవారు అమ్మని మందలింపుగా. ఇక చేసేదేమీ లేక పెద్దన్నయ్యను బతిమిలాడి నీళ్లు పట్టించేది అమ్మ. అప్పుడు నేను దుప్పట్లో దూరిపోయి ఏదో వరల్డ్ కప్ సాధించినట్లుగా ఫీలవుతూ ముసిముసి నవ్వులు నవ్వుకునేదాన్ని.


ఇవేనా...ఇంకా ఉన్నాయి...


వంటలో ఏ చిన్న తేడా వచ్చినా, నాకు నచ్చనివి చేసినా పెద్ద గొడవే చేసేదాన్ని. వంటల్లో పచ్చిమిర్చీ వేస్తే అస్సలు తినేదాన్ని కాదు. ఒకవేళ అమ్మ పొరపాటున పచ్చిమిర్చి వేసి ఏదైనా కూర వండిందా, అంతే...గొడవ గొడవ చేసి "నేను తినాలా వద్దా...", అని ఏడ్చేదాన్ని. దాంతో మా నాన్న..."అది కారం తినదని తెలుసుగా, తెలిసి ఎందుకు ఇలా వండావు...", అంటూ అమ్మని కోప్పడి మళ్ళీ నాకోసం ప్రత్యేకంగా ఇంకో కూర చేయించేవారు.


నానమ్మ..."ఒరేయ్...అది ఆడపిల్ల...రేపు మరో ఇంటికి పంపాల్సిన పిల్లను నీ అతి గారభంతో దాన్ని మరింత చెడగొడుతున్నావు. ఇలా ఏ పనీ నేర్చుకోకుండా, చేయకుండా, చేసినవాటికి వంకలు పెడుతూ ఉంటే అది రేపు అత్త గారింటికి వెళ్ళాక అక్కడ సర్దుకోగలదా...", అని నాన్నకి క్లాసు పీకేది.


కానీ నాన్న..."పనులు చేయాల్సినవసరం నా చిట్టి తల్లికేంటమ్మా... ఇంటి నిండా పని వాళ్ళను పెట్టుకుంటుంది...", అని నానమ్మకి చెప్పి, నన్ను దగ్గరికి తీసుకుని, ప్రేమగా నా తల నిమురుతూ, "అంతేకదూ సమ్మూ...", అని నవ్వేవారు.


నేనేమో..."హా....అంతే మరి...", అంటూ అల్లరిగా నవ్వుతూ నానమ్మ వైపు చూసేదాన్ని. నానమ్మేమో మా తండ్రీ కూతుళ్ళ వైపు చూసి పెదవి విరిచేది.


కానీ మనమొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అని ఆలస్యంగా తెలుసుకున్నాను.


అంతే కాకుండా, ఆదివారం అమ్మకు రెస్ట్ ఇవ్వకుండా స్పెషల్స్ చేసి పెట్టమనేవాళ్ళం. అందుకోసం తొందరగా నిద్రలేచి ఆ పనిలో ఉండేది అమ్మ. నేనైతే ఆదివారం వస్తే పదైన నిద్రలేచేదాన్ని కాదు. నాన్న ఏమీ అనేవారు కాదు కాని తాతయ్య మాత్రం మందలించేవారు.


ఇక పండుగలు ఏవైనా వస్తున్నాయంటే అమ్మకి మరింత శ్రమ పెరుగుతుంది. పనిమనిషి సహాయంతో ఇల్లంతా శుభ్రం చేసుకునేది. 


మా నానమ్మకు చాదస్తం ఎక్కువ, అది పండుగ రోజులు మరీ ఎక్కువ. ఆవిడ చెప్పేవన్నీ ఓపికగా అమ్మ ఒక్కతే చేసేది, పూజ, పిండి వంటలు ఇలా అన్నీ తనే చేసుకునేది. నేను మాత్రం ఏమీ పట్టనట్లుగా హాయిగా టీవీలో పండుగలకు వచ్చే స్పెషల్ ప్రోగ్రాములు, సినిమాలు చూస్తూ, అమ్మ చేసిన పిండి వంటలు ఆరగిస్తూ ఎంజాయ్ చేసేదాన్ని. అది సరిపోనట్టు సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు నా స్నేహితురాళ్లు బాగా తయారయ్యి కనిపిస్తే.."చూసావామ్మా... మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు ఎంత బాగా రకరకాల జడలు వేసి తయారు చేశారు వాళ్ళని. నీకైతే ఏమీ రావు..ఎప్పుడైనా అలా వేశావా నాకు...", అంటూ అమ్మను కోపగించుకొని బుంగ మూతి పెట్టుకుని కూర్చునేదాన్ని.


"నాకు అలా వెరైటీ జడలు, జుట్లు వేయడం రావే ఏం చేయను. అయినా ఇంట్లో పనితోనే సరిపోతుంది ఇక నాకు అంత తీరిక ఎక్కడిది సమ్మూ...", అంటూ నన్ను కూల్ చేయడానికి ఏవో తంటాలు పడేది.


నిజమే...పండుగ పనుల్లో క్షణం తీరికలేని అమ్మకి ఇంక అవన్నీ ఎక్కడ కుదురుతాయి. నేనేమో అర్థం చేసుకోకుండా అమ్మని కోపగించుకునేదాన్ని.


నాకు బాగా గుర్తు. ఓ రోజు నాకు జ్వరం వచ్చింది, అమ్మకేమో ఖచ్చితంగా ఆఫీసుకు వెళ్ళాల్సివొచ్చింది. ఇక నా కోసం నాన్న లీవ్ తీసుకుని నా పక్కనే ఉండి మందులు వేస్తూ నన్ను చూసుకున్నారు. కానీ నేను.."ఊహూ...నాకు వొద్దు...అమ్మ తినిపిస్తేనే నేను తింటాను...", అంటూ తినకుండా మంకు పట్టు పెట్టాను.


అప్పుడు నాన్న.."అమ్మ ఇంటికి రాడానికి ఇంకా టైముంది. అంత వరకు ఇలా ఏమీ తినకుండా ఉంటే నీరసమొస్తుంది..నా తల్లి కదూ.. తినమ్మా...", అంటూ బతిమాలారు. కానీ నేను అస్సలు వినలేదు. ఈ లోగా అమ్మ ఆఫీసునుండి ఇంటికి రానే వచ్చింది. రాగానే నాన్న నా గురించి చెప్తే.."తినొచ్చు కాదే..నేనే తినిపించాలా...", అంటూ కాస్త అసహనంగా అంది. ఇక నేను ఫీలయ్యి రెండ్రోజులు మూతి ముడుచుకుని అమ్మ మీద అలిగాను. ఇప్పుడు అర్థమవుతుంది, అసలే ఆఫీసులో పని చేసి, అక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేసి అలసిపోయి ఇంటకి వచ్చిన అమ్మను సరిగా అర్థంచేసుకోకుండా నేను మరింత ఊపిరాడనివ్వకుండా చేశానని.

నెల నెలా నాకు వచ్చే నొప్పికి తట్టుకోలేక నీటిలోంచి గట్టుపై పడిన చేపపిల్లలా గిలగిలా కొట్టుకుంటుంటే, ఇంట్లోవాళ్ళంతా కంగారు పడేవాళ్ళు, అమ్మ కళ్ళు తడిచేవి. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి పక్కనే ఉండి నా కాళ్ళు పెట్టేది, నడుముకి జండూ బామ్ పూసి మర్దనా చేసేది. నాకు నొప్పి తగ్గేవరకు నా పక్కనే కూర్చునేది.


ఇహ

ఆదివారాలు, సెలవులు వస్తే చాలు అత్తమ్మలు, మామయ్యలు, వాళ్ళ పిల్లలు అందరూ మా ఇంటికే వచ్చేవాళ్ళు. వాళ్ళకి భోజనాలు వగైరా అన్నీ అమ్మే చేసి పెట్టేది. ఇలా సెలవుల రోజులు కూడా అమ్మకి రెస్ట్ ఉండేది కాదు. నేను అవేమీ పట్టించుకోకుండా మామయ్యల పిల్లలతో ఆడుకుంటూ, ముచ్చట్లు పెడుతూ కూర్చునేదాన్ని.


ఇవన్నీ కాకుండా, మా తాతయ్య మంచానికి పరిమితమయిపోయినప్పుడు, నానమ్మకా వయసు మీదపడింది, మోకాళ్ళ నొప్పులతో పాటు బీపీ, షుగరు, పని చేయలేదు. ఇక అమ్మే అన్నీ చేసేది. ఒక్కోసారి మా తాతయ్య అమ్మ చేసిన కూరలు రుచిగా లేవని మళ్ళీ వండిచేవారు.


పాపం అమ్మ...! ఎన్ని పనులైనా, ఎంత కష్టాన్నైనా భరించేది, చాలా సహనంగా ఉండేది, అన్నీ పనులు ఓపికగా చేసేది. వంట్లో బాగోలేకున్నా ఎవ్వరికీ చెప్పేది కాదు, ఒక్కోసారి మరీ వొత్తిడి పెరిగితే పైకి చెప్పదు కానీ కాస్త కోపంగా ఉండేది. 


"అమ్మా...ఎప్పుడు చూసినా ఎందుకలా కోపంగా ఉంటావు...మంచిగా హుషారుగా ఉండొచ్చు కదా...", అంటూ కసిరేదాన్ని నేను. ఇప్పుడు నాకు బాగా తెలిసొస్తుంది అమ్మ ఎందుకు అలా ఉండేదో.


ఇక నేను చేసే పనులకి నా మీద కోపం వచ్చినా నన్ను ఏమీ అనలేక తన కోపాన్ని లోపలే అణచుకునేది. నాకు సపోర్ట్ చేస్తూ నాన్న తనను కోప్పడినా మౌనంగా ఉండేదే తప్పా ఒక్కమాట కూడా అనేది కాదు. ఇంట్లో అంత పని చేస్తూనే, ఆఫీసుకి కూడా వెళ్ళేది, ఆఫీసు పనిలో కూడా ఏమాత్రం అశ్రద్ధ చూయించకుండా తను తీసుకునే జీతానికన్నా ఎక్కువే న్యాయం చేసేది. అంతెందుకు.... వయసు పెరిగినా ఇప్పటికీ ఇంటి పనులతో పాటు తన ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తూనే ఉంది అమ్మా...


ఇప్పుడు అవన్నీ తలచుకుంటే "పాపం అమ్మా...!" అని చాలా బాధేస్తుంది. అమ్మని నేను ఎంత ఇబ్బంది పెట్టాను అని తలచుకున్నప్పుడల్లా చాలా గిల్టీగా అనిపిస్తుంది. 


ఇప్పటికీ ఎప్పుడైనా పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మ నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదు.


"వొద్దులే సంయుక్త.... ఎలాగో రోజూ చేస్తావ్...ఇక్కడికి వచ్చినప్పుడన్నా ఓ నాలుగు రోజులు రిలాక్స్ అవ్వు...", అంటుందే కానీ నన్ను అస్సలు చేయనివ్వదు అమ్మ.


హ్మ్....ఎంతైనా తల్లి మనసు కదా....


అసలు.... ఇంట్లో అన్ని పనులు ఒకరి మీదే వేయకుండా, ప్రతి ఒక్కరూ ఇది మన పనేకదా అని భావించి అంతా కలిసి పనులు పంచుకుని చేసుకుంటే ఎంత బాగుంటుంది...ఆ రోజులు ఎప్పుడొస్తాయో ......


ఇలా ఆలోచనల్లో మునిగిపోయిన నన్ను నా ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో ఉన్న బకెట్లో తడిసి ముద్దయి నీళ్లు కారుతున్న బట్టలు "ఎంతసేపు మేము ఇలా ఈ తడిలో పడుండాలి..." అన్నట్లుగా నా వంక గుర్రున చూస్తున్నట్లు నా అంతర్నేత్రం హెచ్చరించింది. తక్షణమే నా ఆలోచనల్లోంచి తేరుకుని ఈ లోకంలోకి వచ్చి, వాటిని కూల్ చేయడానికి వెంటనే పైకి లేచి, బకెట్ను సమీపించి, అందులోని బట్టలనన్నింటినీ అక్కడ ఉన్న తీగలపై అరేసిన వెంటనే అవన్నీ గాలికి రెపరేపలాడుతూ సంతోషంగా నా వైపు చూశాయి.


ఇంతలో...."అమ్మా.....!", అంటూ గుమ్మంనుంచే గట్టిగా కేకేస్తూ గేటు తెరిచి ఇంట్లోకి పరిగెడుతూ వెళ్లిన బుజ్జిగాడి గొంతు వినిపించగానే ఉలికిపాటుగా గబగబా ముందుకు నడిచి, మెట్లు దిగి క్రిందకు వెళ్ళిపోయాను.


........సమాప్తం......


©స్ఫూర్తి కందివనం.



Rate this content
Log in

Similar telugu story from Drama