Spoorthy Kandivanam

Drama

4.1  

Spoorthy Kandivanam

Drama

తోడూ నీడ (మినీ కథ)

తోడూ నీడ (మినీ కథ)

1 min
391


ఎండాకాలం ఎర్రటి ఎండలో నీరసంగా ఇంటికి చేరుకున్న సోమయ్య, అతని భుజాన ఉన్న ఖండువాతో నుదుటికి పట్టిన చమటను తుడుచుకుని భారంగా నిట్టూరుస్తూ కుర్చీలో నిస్సత్తువగా కూలబడ్డాడు.

వంటింట్లో ఉన్న సోమమ్మ, భర్త వచ్చినట్టున్నాడని గబగబా గూట్లో ఉన్న గ్లాసుని అందుకుని కుండలోని చల్లటి నీళ్లను తీసుకుని వడివడిగా నడుస్తూ భర్తను సమీపించి, "మంచి నీళ్ళు..", అంటూ నీళ్ల గ్లాసు అతని చేతికి ఇచ్చి ఆతృతగా అతని ముఖంలోకి చూసింది.

భార్య వైపు చూడకుండానే గ్లాసుని అందుకుని గుక్కెడు నీళ్లు గొంతులోకి పోనిచ్చి మళ్ళీ దిగాలుగా ఆలోచనల్లోకి వెళ్లిపోయాడు సోమయ్య.

సోమమ్మ, "ఎల్లిన పని అయినట్లేనా..!", అని అడిగింది సన్నని గొంతుతో.

సోమయ్య భార్య కళ్ళల్లోకి చూసి ఒక నిట్టూర్పు విడుస్తూ "అయ్యింది" అన్నట్లుగా తలాడించాడు. అలా చూస్తున్నప్పుడు భర్త కళ్ళల్లోని నీటి పొర సోమమ్మ మనసుని చివుక్కుమనిపించింది. అతని భుజంపై ఆమె అరచేతిని ఉంచి, "బాధవడకయ్య!" అంది.

"బాధవడకుండ ఎట్లుంటనే! ఇన్నేండ్లసంది మన గేదెలే మనకు జీవనాధారమయినయి, అవి ఇచ్చే పాలు, పేడతోనే నాలుగు రాళ్లు సంపాదించుకుని కడుపు నింపుకోగల్గుతున్నాం. ఇన్నేండ్లు కన్న బిడ్డల్లాగ సాకుకున్న గేదెలను ఇయాల ఎవరికో అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది", ఉద్వేగంగా అన్నాడు సోమయ్య.

"పిల్ల పెండ్లి కొరకే కదయ్యా ఇదంతా. పెద్దింటి సంబంధం, పిల్లగాడు పట్నంల పెద్ద నౌకరి. ఇట్లాంటి సంబంధం మల్ల దొర్కదు, మన పిల్ల సుఖపడ్తదనే కదయ్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. నీవిగ దాని గురించి చింతజేయకు, పైసలు కూడవెట్టి గేదెలను మల్ల తెచ్చుకుందాంలే. మనమిట్లుంటే పిల్ల బాధవడ్తది, పెండ్లే వొద్దంటది", అంటూ భర్తకు నచ్చజెప్పి ధైర్యం చెప్పింది సోమమ్మ.

భార్య మాటలు సోమయ్యకు కొంతవరకు ఉపశమనమిచ్చాయి.

నిజానికి భర్తకు ధైర్యం చెప్పడంకోసం పైకి అలా చెప్పినా కన్న బిడ్డల్లాంటి గేదెలను అమ్మేయాల్సి వచ్చినందుకు మనసులోనే విలవిల్లాడింది. తాను భర్త సుఖదుఃఖాల్లో తోడూ నీడై అతనికి బలమే అవ్వాలి కానీ బలహీనతగా మారొద్దన్నదే సోమమ్మ ఆలోచన.

...........సమాప్తం.......

(ఈ కథ విశాలాక్షి సాహిత్య మాస పత్రిక ఆగస్టు నెల సంచికలో ప్రచురితమయ్యింది)



Rate this content
Log in

Similar telugu story from Drama