శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Comedy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Comedy

దుర(అ)దృష్టం

దుర(అ)దృష్టం

2 mins
588


                దుర(అ)దృష్టం

                -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

            

   మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి...!

   సదాశివం కోరిక నెరవేరకుండానే...పాపం అతని పెళ్లైపోయింది. ఈపెళ్లి నాకొద్దు నాకొద్దని ఎంత మొత్తుకున్నా...పీటలపై కూర్చోపెట్టేశారు. 


   తాననుకున్న ఆశయం నెరవేరనేలేదు. అయినా భార్యను అన్యాయం చేయకూడదని పూవుల్లో పెట్టుకుని చూసుకున్నా...ఆమె మాత్రం రోజు రోజుకి వాడిపోతూనే ఉండేది. కొన్నాళ్లకు చిక్కిశల్యమై హరీ అంది. ఓ కాన్సర్ పేషెంట్ నిచ్చి పెళ్లిచేసారన్న విషయం తెలిసాక సదాశివం తల్లిదండ్రులు వాపోయి...ఇంకో తప్పు కొడుకు విషయంలో చేయకూడదనుకున్నారు.


  "ఒరేయ్ సదాశివం...జరిగిందేదో జరిగిపోయింది. ఇక నీఇష్టానికే వదిలేస్తున్నాము. ఇక నీకెలాగూ పిల్లనివ్వడానికి ముందుకు వచ్చేవాళ్లుండరు. ఒకవేళ వచ్చినా వయసు ముదిరిన వాళ్లే వస్తారు గానీ...నీకు తగ్గా పిల్లలెవరూ రావడం కష్టమే. ఇప్పుడైనా నీ ఇష్టప్రకారం వితంతువునే చేసుకుంటావో...పేదింటి పిల్లనే చేసుకుంటావో నీ ఆదర్శాన్ని చాటుకో" అంటూ పక్కకు తప్పుకున్నారు తల్లితండ్రులు. 


  సదాశివానికి కూడా ఆమాటలు నచ్చడంతో...ఇదే తనకొచ్చిన మరో అవకాశం అనుకున్నాడు. మళ్లీ పెళ్లికి సిద్ధమవుతూ...ఆఫీసులో తోటి ఉద్యోగస్థురాలైన కనకానికి చెప్పాడు. "వితంతువుని పెళ్లిచేసుకుని ఉద్ధరించాలని ఉండేది నాకు. ఆకోరిక తీరనీయకుండా...మావాళ్ళు వాళ్లకు నచ్చిన అమ్మాయిని కట్టబెట్టారు. అయినా ఆమెతో సవ్యంగానే కాపురం చేసుకుంటున్నా...విధి వక్రించి నాకు భార్యను లేకుండా చేసాడు ఆదేవుడు. ఇప్పుడైనా ఓ వితంతువుని పెళ్లిచేసుకుని నా ఆదర్శం నిలబెట్టుకోవాలని ఉంది. అలాంటి వ్యక్తి మీకు తెలిసిన వారెవరైనా ఉంటే చెప్పండి. నేను పెళ్లిచేసుకుంటాను" అన్నాడు.


   అతనంతలా కోరుకుంటుంటే...టక్కున గుర్తుకొచ్చింది కనకానికి... సంవత్సరం క్రితం భర్తను కోల్పోయిన పంకజం.

ఆ విషయం ఇరువురికీ తెలియచేసి పెళ్లి పెద్దయిపోయింది.


   సదాశివం కోరుకున్నట్టుగానే ...పంకజంతో పెళ్లైపోవడం జరిగిపోయింది. పెళ్ళై సంవత్సరం నిండకుండానే పంకజం ఓబిడ్డను కంది.


   ఆవిషయం తెలిసి...కనకం పిల్లాడికి నాలుగు జుబ్బాలు కొని సదాశివం ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది.


   అదేపనిగా లోపల నుండి పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. "ఎవరూ" అంటూ వచ్చి తలుపు తీసింది పంకజం.

   

   ఆమెను చూస్తూనే..."నువ్వటే కనకం....వచ్చిలా కూర్చో" అంటూ...అద్దం ముందుకెళ్లి మిగిలివున్న ముస్తాబుకి మెరుగులు దిద్దుకుంటూ...కనకంతో కబుర్లాడుతుంది.


   కనకం మాత్రం ....సదాశివం పాలడబ్బాల్ని ముందేసుకుని... చంకకింద పాలసీసాను పెట్టుకుని తానే తల్లిగా పాలిస్తున్న తీరునూ... అతను పడుతున్న అవస్ధలనూ ఓకంట గమనిస్తూనే ఉంది.


  " సరే గానీ పంకజం....నువ్వేంటి పిల్లాడు అలా గుక్కపెడుతూ ఏడుస్తున్నా పట్టించుకోడం మానేసి ముస్తాబవుతున్నావు...? పాపం మీ ఆయన చేతిలోంచి అందుకోవచ్చు కదా... సదాశివంపై జాలిపడుతూ చెప్పింది కనకం.


   "నేనేదో కనడమైతే కన్నాను గానీ...అన్నీ ఆయనే చూసుకుంటారే. నువ్వు చెప్పినట్టుగానే నన్ను పూవుల్లో పెట్టుకుని...కాలు కదపనీయకుండా చూసుకుంటారని చెప్పావనేగా ఇతన్ని చేసుకున్నాను. మరో అవకాశం వచ్చి ఈ పెళ్ళిచేసుకున్నందుకు అదృష్టం వరించిందని నేననుకుంటుంటే...ఇప్పుడు నువ్విలా అంటే ఎలా...? నేను ఏ పనీ చేయను, చేయలేను.  నాకు పనులు చెప్తున్నాడనేగా ...నా మొదటి మొగుడ్ని పైలోకానికి పంపించేసాను" నిజాన్ని నోటితో వదిలేసింది కనకం.

   

  ఆమాటలు వింటూనే...సదాశివానికి తన ప్రాణాలు పైకి పోతున్నట్టే అనిపించి...ముచ్చెమటలు పట్టేయడంతో ఏమిటి నాకీ దురదృష్టం అనుకున్నాడు...!!*


   



Rate this content
Log in

Similar telugu story from Comedy