9.గంతకు తగ్గ బొంత
9.గంతకు తగ్గ బొంత


అరవైలో కూడా ఇరవయ్యేళ్ళ యువకుడిలా కనబడాలని ఆకాష్ తాపత్రయం. ఉదయాన్నే లేచి వాకింగ్ కెళ్లడం..సాయంత్రం జిమ్ కెళ్లడం మాత్రం మానడు. వయసు రీత్యా వచ్చే పెద్దరికం తనలో కనిపించకూడదని ఫిట్నెస్ కోసం తెగ తపత్రాయపడుతూ ఉంటాడు. తెల్లబడుతున్న తల వెంట్రుకులకు ఎప్పటికప్పుడు డైచేస్తూ ఉంటాడు. మీసాలు, గడ్డం షేవ్ చేసుకోవడం ఏనాడూ బద్ధకించడు. జీన్స్ పాంట్.. టీ షర్టుల్లో.. కుర్రోడిలా కనిపించాలని ఎంతగా ఇష్టపడతాడో. వాడిపోతున్న వయసుకు మెరుగులు దిద్దుతూ ఉంటాడు...తన గ్లామర్ తగ్గిపోకుండా.
కారణం... తనకింకా పెళ్లి కాకపోవడమే. ఆకాష్ కి ముగ్గురక్కచెల్లెళ్లు ఉండడంవల్ల తనకు పెళ్ళీడు దాటిపోయింది . వారందరికీ పెళ్లిళ్లు చేసాకా తన పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. నలభై ఏళ్లప్పుడు మొదటి పెళ్లి చూపులు చూశాడు . చూసిన ఆ అమ్మాయి తనకు నచ్చలేదు. తాను చేసుకోబోయే అమ్మాయి అప్సరసలా ఉండాలని కలలు కంటూ ఉండేవాడు. తాను వయసులో ముదిరినా లేలేత అమ్మాయి తన భార్యగా రావాలని చూసేవాడు.
ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి తనకు నచ్చక పోవడమో... అవతల వారికి తాను నచ్చకపోవడమో.. జాతకాలు కుదరకో... వయసెక్కువనో ..తప్పి పోతూ ఉండేవి. ఈ లోపు వయసు కాస్తా అరవైలోకి ఎదిగిపోయింది.
ఇక లాభం లేదు అనుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే శ్రేయస్కరం అనిపించింది.
అలాంటి ప్రయత్నంలో తనకు నచ్చిన అమ్మాయి తారసపడ్డంతో... మనసులోని మాట చెప్పాడు.
అజంతా పార్కులో ఒకరికెదురుగా ఒకరు కూర్చుని వున్నారు.
"చెప్పు భూమికా...నీకు నేను పూర్తిగా నచ్చాను కదా"...ఆమె అభిప్రాయాన్ని సూటిగా అడిగాడు.
సిగ్గుతో తల దించుకుంది భూమిక. "నచ్చారు కాబట్టే మీతో ఇక్కడకు రాగలిగాను. మీ విషయం మా ఇంట్లో కూడా చెప్తాను . త్వరలోనే వివాహం చేసుకుందామంది". తన అభిప్రాయం కూడా చెప్తూ..!
 
;" థాంక్స్ భూమికా... నువ్వింత త్వరగా ఇలాంటి అభిప్రాయానికి వస్తావని నేననుకోలేదు" . ఆమె చేయి పట్టుకొని చేతిని చుంబించాడు ఆకాష్.
ఆకాష్ కి మాహానందంగా ఉంది. తాను త్వరలో ఓ ఇంటి వాడవుతున్నందుకు.
* * *
ఆకాష్ పెళ్లైపోయింది భూమికతో.
పెళ్లయ్యాక గానీ...తెలుసుకోలేకపోయాడు. భార్య తనని మోసం చేసిందని.
"చ...నువ్వింత మోసగత్తెవని నేననుకోలేదు. పాతికేళ్ల పడుచులా కనిపించేసరికి నీ వెంట పడ్డాను. చిన్న పిలక మాత్రమే మిగిలిన ఆ వెంట్రుకలకి సవరం పెట్టి జడ వేసావనీ... ముఖంలో ముడతలు కనిపించనీకుండా కప్పిపుచ్చుకోడానికి బ్యూటీ పార్లర్ కెళ్ళి మెరుగులు దిద్దుకున్నావనీ తెలిస్తే నీజోలికే రాకపోదును"...భార్యతో అన్నాడు ఈసడింపుగా ఆకాష్.
నువ్వు మాత్రం... అరవైలో కూడా ఇరవయేళ్ళ యువకుడిలా పెద్ద పోజు కొట్టావు కదా. నీ వేషాలు మాత్రం నాకు తెలియదా ఏంటి...? తల పండిన జుట్టుకు రంగేసినంత మాత్రాన్నా....కుర్రాడిలా బట్టలేసుకున్నంత మాత్రాన్నా ...యువకుడిగా మారి పోతావా ఏంటి...? పెళ్లి కోసం నువ్వెన్ని పాట్లు పడ్డావో... నేనూ అన్నే పాట్లు పడ్డాను. వయసుని కప్పిపుచ్చుకోవాలంటే ఎన్ని వేషాలైనా వేయాల్సిందే కదా...గంతకు తగ్గ బొంతలు దొరక్కమానరనే సామెత ఉండనే ఉందిగా. నీకు నేను దొరికినట్టే... నాకూ నువ్వు దొరికావు అంటూ...కడిగిపారేసింది భర్తను భూమిక.
ఆకాష్ మరిక నోరెత్తలేదు... భార్య భూమికతోరాజీపడిపోయి...కిమ్మనకుండా...సంసారంలో పడి పోయాడు.*
*** *** ***