ఊగులాడే గూడు
ఊగులాడే గూడు
ఏమే ఏమే పిచ్చుక
ఓ నా బంగారు పిచ్చుకా
ఊరంతా తావుంటే
నా ఇంట్లో పెట్టావే గూడు
అంటే అన్నానంటావు
నాదసలే పాత ఇల్లు
అంటే ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటిది
ఆ దూలాల మీద పెట్టావే గూడు
ఎంత చెప్పినా పిచ్చుక వినలేదు
పాపం ఒక్కటే తిండి తెస్తోంది
ఋతుపవనాల రాకతో వర్షాలు విజృంభించాయి
ఇంకా పిచ్చుక రాలేదు
నాలాగే ఆ పిచ్చుక పిల్లలు భయపడుతున్నాయేమో
సొద్దలు తింటాయా
తినలేవేమో
ఎన్ని పదున్ల వర్షం పడుతుందో
ఈ ఇల్లు కూలకుండా ఉంటుందా
అదిగో పెద్ద పిడుగు
దగ్గరిలో పడ్డట్టుంది
ఇంటి దూలం నా వీపు మీదే కూలింది
హమ్మయ్య
పిచ్చుక గూడు నా చేతిలోనే ఉంది
దేవుడా
తల్లి పిచ్చుక వచ్చే వరకు నా ప్రాణాన్ని తియ్యకు
పాప
పాపం పిచ్చుక
వర్షంలో చిక్కుకుందేమో
పోయే ఊపిరిని వెచ్చగా పిచ్చుక పిల్లల వైపు ఊదాను
మూతబడే కళ్ళతో నా చేతిలో ఊగులాడే గూడును చూశాను