మోయాల్సిందే
మోయాల్సిందే
మోయాల్సిందే...
ఆవేదనల తోటల్లో
ఆక్రోశపు క్రోటన్లూ ఉంటాయి
గడ్డకట్టిన మంచు స్వప్నాల్లా
ఆవిరైపోయిన ఆశలన్నీ
హరిత స్వప్నాల ఆనవాళ్ళే
దుశ్శాలువల మాటుదాగిన కవి దుఃఖంలా
రాలిన ఆకుల్లోంచి చెదిరిన కలలను
కలంతో పిండాలనేకదా నీ తాపత్రయం
అంగలేస్తూ కాలం కిసుక్కున నవ్వింది
కొత్త పల్లవులను పెకలించే కబంధులే ఎటుచూసినా
నిర్జీవనదిలా రాగాలతోట గొల్లుమంటోంది
పునరుత్థానపు పిలుపు కోసమే అన్వేషణ
పూరించని ఖాళీలా మనసంతా దుఃఖస్పర్శ
దూరతీరాల నావకు దుఃఖముంటుందా
నావికుడా..ఓడకు కాస్త ఓర్పు ఔషధాన్నివ్వు
పదాలన్నీ కవిత్వపు నురగలై పాదాలను చుట్టేస్తాయి
కనులజారే నీటిచుక్క అమ్మప్రేమలా హత్తుకుంటుంది
చీకటి నుదిటిపై సింధూరంలా జ్వలించే ఉదయం ఊపిరిపోయదు
కాలిబాటలో పల్లేరుకాయల్లా గుచ్చుకునే ప్రశ్నలు
ఎండిపోయిన పూలల్లా పరిమళంలేని జవాబుల మధ్య
జీవితాన్ని బాటసారిలా గమ్యంచేరేవరకూ మోయాల్సిందే