హరితమనస్కులు
హరితమనస్కులు
మనమిద్దరం ఒకే రేఖపై వున్నాం
మనిద్దరం కల్లాకపటం లేని
కాఠిన్యమసలే ఎరుగని
కరుణ రసాలను గ్రోలిన
పవిత్ర మనస్కులం..
చేదోడువాదోడుకు అర్థం తెలిసిన
ఆకుపచ్చని పత్రహరితాలం..
మమత నిండిన ఇరు మనసులకు
మూగ సాక్షులం మనం..
మంచి మానవత్వానికి మారుగా
నిలిచిన నిండైన సంస్కారం మనం..
మాలిన్యమెరుగని మలినమంటని
పసిమనసుకు నిదర్శనం మనం..
జాతిని మరచి నీతిని మలచి
జగతిని జాగృతం చేసే చైతన్య దీపికలం..
భాష రాకున్నా మనసు తెలుసుకుని
నడుచుకునే సద్గుణ సంపన్నులం...
మానవత్వ పరిమళాలద్దుకుని
మహిలో నిలిచిన సుగంధ సౌరభాలం
