హమ్మయ్యా
హమ్మయ్యా
#హమ్మయ్యా#
"బాచీపట్ల వేసుకు కూర్చున్నా
చుట్టూతా రకరకాల కలాలు
మదినిండా అనేక రకాల కలలు
ఏదో రాసేయాలి ఈరోజు
భూనభోంతరాళాలు దద్దరిల్లేలా
రాసేయాలి...
ఆకాశం విరిగి
భూమి చీలి
నా రాతలు చెప్పుకునేలా రాసేయాలి
బెత్తెడు రాతో
జానెడు కవితో
మూరెడు వ్యాసమో
బారెడు కథో
ఏదో రాసేయాలి
నీ గురించిన ప్రణయ కావ్యమో
నన్ను గురించిన ఆవిష్కరణో
విచ్చుకునే సంతోషాలో
ఎగసే లావాల విచారాలో
అరె ఏదో ఒకటి
ఆ కాగితం పై కక్కేయాలి
తెల్లదనం నాకు నచ్చట్లేదు
దాన్ని నల్ల సిరాతో నింపేయాలి
సమాజాన్ని ప్రశ్నిస్తూనో
సభ్యతను ప్రస్తావిస్తూనో
లోకానికి వెన్నుదన్నుగానో
ఆడతనానికి బాసటగానో
మృగత్వానికి చెంపపెట్టు గానో
మగ మనసులోని వెన్నపూసల ను కరగదీస్తూనో
చిన్నారుల నవ్వులనో
విరి తోటల అందాలనో
ఉషోదయ బింబాన్నో
అస్తమయ అరుణాన్నో
తినే తిండినో
తొడుక్కునే బట్టనో
పీల్చే గాలినో
వుండే నేలనో
అరె అదీ ఇదీ అని కాదు
ఏదో ఒకదాన్ని వర్ణించేయాలి
ఏకాకితనాన్ని
మందిలోని మాధుర్యాన్ని
కన్నీటి వీడ్కోలుని
క్యారు ఏడుపు స్వాగతాన్ని
అన్నింటినీ అలవోకగా
అద్భుత భావాలుగా ఒంపేయాలి"
ఏంటీ కల తెల్లవారుజామున
నిజమౌతుందా ఏంటి
జనాలను బలి తీసుకుంటానా ఏంటి
హహహ అంత లేదు కానీ....
తెల్లారింది
అల్లారం మోగింది....
లే లేచి తయారవ్వు...
పిలిచాడు సూరయ్య బాబాయ్
హమ్మయ్యా బతికిపోయారు జనాలు
నా మీద ఏ కేసులూ బుక్ కావు
మనసు ఎగురుతోంది....
✍️✍️సుధామురళి
