స్వాతంత్ర సుమాలకు చెప్పరా జయహో
స్వాతంత్ర సుమాలకు చెప్పరా జయహో
ఈ దేశ చరితను ఏలుగెత్తి చాటరా
ఈ వెలుగుల చాటున దాగిన వీరత్యాగాన్ని కాంచరా
తెగిన గాలిపటమైన దేశాన్ని
వందేమాతరం అన్న సూత్రంపై నడిపించిన
మహానుభావుల మహోద్గతాన్ని ముందు తరాలకు తెలుపరా
స్వాతంత్ర సుమ గుభాళింపులను మనకందించిన సుయోధులకు జేజేల జయగీతం పాడరా
సమగ్రతతో సమైక్య అనుబంధంతో
భారతీయ బంధాన్ని సుమాల తోరణంలా ఒకటిగా బంధించిన
ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్ వ్వక్తిత్వాన్ని చాటరా
అహింసా నాదం అను అరుణకిరణంతో
హింసా ప్రతినిధులకు శాంతి సహనం నేర్పిన
జాతిపిత ఔన్నత్యాన్ని చాటి జగతిని జాగృతి చేయరా
ఎందరో వీరయోధుల రక్తం రుచిచూసిన మట్టితో
దిద్దిన వీరతిలకంతో
సమర సంగ్రామం లో ఉవ్వెత్తున ఎగసిపడే పులిలా
యువతలో స్వాతంత్ర చైతన్య శంఖం పూరించిన భగత్సింగ్ కు విప్లవ జయహో చెప్పరా
విశాల భారతం విధించిన విషాద ఛాయలలో
విగత జీవులై విలపిస్తున్న వనితలతో
ఉజ్వలాంగి ఉర్వి యందు జ్వలించే శక్తిరూపమని
ఉజ్వల భవిష్యత్తునకు కృషి చేసిన వీరేశలింగం, రాజరాంలకు జేజేల రథం పట్టరా
ముత్యాల మాటలతో మానవత్వపు విలువలతో
దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులని
మన మదిలో మట్టివాసనను
పదిలంగా నాటిన గురజాడకు గౌరవంగా జై కొట్టరా
మాతృత్వం వీరత్వం కలబోసిన మూర్తిత్వంతో
తిరుగుబాటు సైన్యంకు దూసుకెళ్లే ధైర్యపు నీడనిచ్చి
ఆంగ్లేయులను అబ్బురపరచిన రాణీ ఝాన్సీ కి జయగీతం పాడరా
స్వాతంత్రపు పూలు పూయించడానికి సమర సేద్యంలో సేనను సమీకరించి శ్రమతో
భారతావని బానిసత్వపు శృంఖలాల సంకెళ్ళను తెంచి
దేశ భవిషత్తును బాధ్యతగా బహుకరించిన
భారతాంబ ముద్దుబిడ్డలకు నీరాజన నివాళులు అర్పించరా
