Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Likhith kumar Goda

Inspirational

4.5  

Likhith kumar Goda

Inspirational

కుట్టు ఎవుసం

కుట్టు ఎవుసం

2 mins
396



నా ఏడో ఏటా,

మా నాన్నకి మధుమేహం వచ్చి

మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు,

అమ్మ మా బతుకు మొక్కలను

తన భుజాల పెరట్లో పెంచుకోవడం మొదలెట్టింది.


మా బతుకు మొక్కలను పరమాన్నాలతో పండించడానికి, 

అమ్మ కుట్టు మిషన్ తో దోస్తీ కట్టింది.


అప్పటి నుంచి

మా ఇంట్లో

అమ్మ నాన్నై బరువు మోయడం,

నాన్న అమ్మై ఇంటిని కాయడం,

మా ఇద్దరి జీవితాలు 

కొత్త అవతారంతో వెలిగాయి..


అందరి బాధ్యతాయుత తల్లిలాగే

అమ్మకి కూడా సూర్యోదయం కంటే ముందే

కనురెప్పల తలుపులు తెరుచుకుంటాయి..


తలంటు స్నానం చేసుకొని

తులసమ్మని పూజించడం అమ్మ రోజు విధి.


దర్జీ అయిన అమ్మకి,

కత్తెర, సూది, దారం ,కొలతలు టేపు

దేహంలో అవయవాలు.

కుట్టు మిషన్ శరీరం..


నాట్లు వేసేటప్పుడు భూదేవిని 

మొక్కుకునే హాలికునిలాగా,

పొద్దున్నే కుట్టు మిషన్ ఎక్కగానే,

"మాకు అన్నం పెట్టే తల్లి..

నీకు వందనాలు" అంటూ

కుట్టు మిషన్ ని ఆరాధ్యదైవంగా, 

పంట పండించుకునే పైరులా భావిస్తుంటే,

అమ్మ నుంచి

"పని గౌరవం" మా గుండెల్లో మొలుస్తుంది.


డీజు ముక్కల సహాయం తీసుకోదసలు,

అమ్మకి తన కుడిచేతి బొటనవేలి గోరే,

తన మార్కర్...


ఉలి శిల్పి చేతిలో ఎలా ప్రేమతో ఒదిగి పోతుందో, 

అమ్మ చేతిలో కత్తెర కూడా అంతే..

చేతికి కత్తిర అమ్మకు గాజుబొమ్మ లాంటిది.

కింద పడిపోకుండా ఎంత జాగ్రత్త పడుతుందో..


ఎప్పుడూ మొండివైఖరిగా వ్యవహరించే

మా అన్నదమ్ముల్లాంటి సూది దారాలను చూసినా,

అమ్మకు విసుగసలు రాదు ఎందుకో..?

తనకు మేమంటే ఎంత లాలనో,

తన కుట్టు మిషనన్నా, సూది దారాలన్నా అంతే..

అమ్మ సహనం సూది దారాల గొడవ

సద్దుమణిగేలా చేసినప్పుడే

నాకు బోధపడుతుంది...


హెడ్ చక్రానికి, స్టాండ్ చక్రానికి

తాడు నాగలి తొడిగి,

దుస్తులను సాగుచేస్తూ

అమ్మ "కుట్టు ఎవుసం" చేస్తుంది..


కొలతల అంశం తీసుకోకుండా

ప్రేమతో సూదికి దారానికి స్నేహం కలిపి

యంత్రం కన్నా మిన్నగా ఆ కాళ్లు చేతులు,

క్షుణ్ణంగా ఆ చూపులు వేగంగా,

మోడల్ డ్రెస్సులను, జాకెట్లను కుట్టేసి

అందంగా ఒంటిని కప్పేస్తాయి.


పొద్దున్నుంచి సాయంత్రం వరకు

కూర్చొని పనిచేసే అమ్మని చూస్తే,

తపస్సులా అనిపిస్తుంది 

అమ్మ పని తీరు..

రాత్రి పూటే,

అన్నం మెతుకులు, మంచినీళ్లు

అమ్మ ముఖాన్ని చూసేది..

పొద్దంతా బట్టలోళ్ళు అమ్మను 

తినేస్తారు, తాగేస్తారు కదా..


శుభకార్యాలప్పుడు

బ్లౌజుల సదనానికి

రాత్రి ఆకాశంలో నుండి

రంగు రంగుల చంకీలు కోసుకొచ్చి,

లైటింగ్ అమర్చుతుంది.

అప్పుడప్పుడు అమ్మ వెంట

నేను,తమ్ముడు చంకీలను అమర్చే వాళ్ళం..

ఎప్పుడూ

అది మా జీవితాలలో

మిగిలిపోయే ఆత్మీయ అనుభూతి..


ఎండాకాలంలో

విరగ కాసిన మామిడి పళ్ళలా

మా ఇళ్లు చెట్టు నిండా,

గదుల కొమ్మలకి,

బట్టల మామిడి పళ్ళు ఉంటుంటాయి..

మా జీవితాలు విరగపండి,

పువ్వులా విరబూసేది కూడా అప్పుడే మరి..


పండుగైన, పబ్బమైనా

పెళ్లిళ్లైనా, పేరంటాలైనా

ఊరంతా అమ్మ కుట్టిన హరివిల్లులు ధరించి,

మురిసిపోతుంది.

కానీ అమ్మకి,

మా మొక్కల బాధ్యత యాదొచ్చి

ముక్క చీరలను ముత్యాలుగా చేసుకుంటుంది..


నా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలని,

నలుగురిలో గొప్పగా నవ్వుతూ ఉండాలని,

మనసులో అనుకొని,

వాళ్లని వీళ్ళని చూసి,

వాళ్లు వీళ్లు చెప్పింది ఆలకించి,

అమ్మ తన కుట్టు ఎవుసాన్ని,

రాత్రి కూడా పండించడం మొదలెట్టింది.

అప్పుడు నాకు పదేళ్లు..

ఒకో రాత్రి అలసటొస్తే,

కుట్టు మిషనే అమ్మ నిద్రించే

నవ్వారు మంచం అవుతుంటుంది..


కొన్ని కళ్లకు అమ్మ కాయకష్టం,

అత్యాశ లాగా అర్థమవుతుంది కానీ,

ఆ అత్యాశ లో ఎంత గొప్ప బాధ్యత దాగుందో

అది మా ముగ్గురికే ఎరుక..


నిన్నటి వరకు అమ్మ మాకోసం "కేవలం దర్జీ",

ఈరోజు,

టైలరింగ్ మాస్టర్ అయ్యింది.


మాకు

అమ్మ, అమ్మ మాత్రమే కాదు

బాధ్యతలు చూసే

నాన్న కూడా...


Rate this content
Log in

Similar telugu poem from Inspirational