Dinakar Reddy

Comedy Romance

4  

Dinakar Reddy

Comedy Romance

సంధ్యా కుంకుమ

సంధ్యా కుంకుమ

1 min
538


కోరికల వలయం ఆమెను చుట్టుముట్టినట్లుంది. చంద్రుడి కోసం వేచి ఇక చాలన్నట్లున్న కలువ ముడుచుకున్నట్టు ఆమె పెదాలు ముడుచుకున్నాయి.


గడియారం ఆరు గంటలు కొట్టేసింది అప్పుడే. ఏడీ ఈ ప్రవరాఖ్యుడు అని మళ్లీ గుమ్మం వైపు చూసింది సుదీప.

మధ్యాహ్నం ఏదో సినిమా చూసింది. అందులో హీరో పెళ్లైన కొత్తలో సాయంత్రం ఐదు కాగానే ఇంటికి వాలిపోతాడు. 


మరి ఈయన గారికి పెళ్లయి ఏ అరవై ఏళ్లో అయినట్లు నన్ను మరచిపోతారేమిటో అనుకుంది.


ఏడయ్యింది. మాధవ్ ఇంటికి రావడంతోటే సుదీపను వెనక నుంచి వాటేసుకున్నాడు.

వంటిట్లో వంట చేస్తున్న ఆమె చప్పున కోపంతో అతని వైపు తిరిగింది.


ఎప్పుడు వస్తానని చెప్పి ఎప్పుడు వచ్చారో అయ్యగారు అంటూ ఆమె అటు వైపు తిరిగింది. 

కొత్త దంపతుల గిల్లికజ్జాలు బాణలిలోని నూనెలో వేగుతున్న ఆవాలూ, జీలకర్రల్లా టపటపలాడుతున్నాయి.

ఆమె తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో వేసింది.


అతను ఆమె ముఖం పైన పడుతున్న జుట్టును పక్కకు జరిపి చెవికి వెనుకగా పెట్టాడు. పెట్టినవాడు అలా వదిలేయకుండా ఆమె చెవిని మెల్లిగా కొరికాడు.


చటుక్కున ఆమె అతడి కాలిని గట్టిగా తొక్కింది. అతడు అమ్మ బాబోయ్ అంటూ హాల్లోకి పరుగెత్తాడు. ఆమె కూడా స్టవ్ ఆఫ్ చేసి అతడి వెనుకే వెళ్ళింది.


ఏవండీ! నొప్పిగా ఉందా అంది ఆమె. అతడు లేని నొప్పిని నటిస్తూ ఒక ముద్దిస్తే నొప్పి పోతుందేమో అని ఆమెను హత్తుకున్నాడు.


అతడి స్పర్శతో ఆమెకు హేమంత ఋతువులో కూడా ఆమెకు చెమటలు పట్టేస్తున్నాయి అంటూ అతనో రొమాంటిక్ నవలలోని డైలాగులు చెబుతున్నాడు.


అంత లేదు. ఇవి వంటింట్లో పని చేయడం వల్ల వచ్చిన చెమటలు అని అతడి కౌగిలిని విడిపించుకుంది. అతను బుంగ మూతి పెట్టుకుని అటు వైపు నిలుచున్నాడు. 


వెనుక నుండి అతడి బుగ్గ మీద ముద్దు పెట్టి కోపమొచ్చిందా అంది. అతను ఆమెను కౌగిలిలోకి తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. చెమట వల్ల ఆమె కుంకుమ కాస్త అతడి ముఖానికి అంటుకుంది. 


ఆ దృశ్యం చూడకుండానే సూర్యుడు వెళ్లిపోయాడే అని ఆకాశంలోని చందమామ నవ్వుకున్నాడు.



Rate this content
Log in

Similar telugu story from Comedy