Dinakar Reddy

Comedy Drama

4  

Dinakar Reddy

Comedy Drama

రేటింగ్ ప్లీజ్

రేటింగ్ ప్లీజ్

2 mins
72


ఈ రోజు చాలా ఆకలిగా ఉంది. వంట చేసుకునే ఓపిక లేదు. రూమ్ చేరుకోకముందే ఆన్లైన్లో భోజనం ఆర్డరు చేయాలి అంటూ ఫుడ్ డెలివరీ యాప్ చూస్తున్నాడు సమీర్.

అంతలో తన బాస్ అమర్ నుండి ఇంటర్ కాంలో ఫోన్ వచ్చింది. సమీర్ ఫోన్ ఎత్తగానే వెంటనే క్యాబిన్ లోకి రమ్మని చెప్పాడు అమర్.

సమీర్ లోపలికి వెళ్ళగానే నీకో గుడ్ న్యూస్ అంటూ నవ్వాడు అమర్.

ఏంటి సర్ అని అడగ్గానే అమర్ ఇలా అన్నాడు.

సమీర్! హెడ్డాఫీసు నుండి ప్రమోషన్ కోసం రేటింగ్స్ పంపమన్నారు.నాకు తెలుసు నువ్వు ఈ ప్రమోషన్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నావో అని ఆగాడు అమర్.

సమీర్ మొహం ఆనందంతో వెలిగిపోతోంది. నాకు తెలుసు సార్ మీరు నా పనికి ఖచ్చితంగా మంచి రేటింగ్ ఇచ్చుంటారు అని అమర్ వైపు చూశాడు. సమీర్ ఓ పెద్ద ఆఫీసులో డెస్క్ జాబ్ చేస్తున్నాడు. నాలుగేళ్ళుగా అతడు పడ్డ శ్రమకి ప్రమోషన్ ఇవ్వడం ఏ మాత్రం తప్పు లేదు అని ఆ ఆఫీసులో అందరికీ తెలుసు.

అమర్ సమీర్ భుజం తడుతూ ఎందుకు ఇవ్వనోయ్. నాలుగేళ్ళుగా నువ్వు పడ్డ కష్టం నాకు తెలుసు కనుక నేను నీ గురించి గొప్పగా వ్రాసి మెయిల్ పంపాను.

మరీ అంటూ నసిగాడు అమర్.

అర్థమైంది సార్. పార్టీ గురించేగా. ప్రమోషన్ రాగానే మీకోసం రిసార్ట్ లో హాలిడే ప్లాన్ చేస్తాను సార్. మీరు ఫుల్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు అంటూ ధీమాగా చెప్పాడు సమీర్.

అమర్ నవ్వుతూ నువ్వు తగ్గకూడదు మరి అంటూ సమీర్ మీదున్న తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

ఇద్దరూ కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకుని ఎవరి దారిన వాళ్ళు డ్యూటీ ముగించుకుని వెళ్ళిపోయారు.

సమీర్ రూమ్ చేరుకోకముందే ఫుడ్ ఆర్డరు పెట్టేశాడు. ఎంత సేపటికీ ఫుడ్ డెలివరీ జరగలేదు. సమీర్ చిరాకు పుట్టి యాప్ లో చెక్ చేసి తన పార్సిల్ తీసుకు వస్తున్న అతనికి ఫోన్ చేశాడు. హోటల్ వాళ్ళు లేట్ చేస్తున్నారని తను తొందరగా రావడానికి చాలా ప్రయత్నిస్తున్నాను అని ఆ వ్యక్తి తన పరిస్థితి చెప్పుకున్నాడు.

ఆర్డర్ క్యాన్సిల్ చేసుకునే వీలు లేక అంత రాత్రి ఇక బయటికి వెళ్లి తినే ఓపిక లేక సమీర్ ఫుడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. డెలివరీ చేయాల్సిన దాని కన్నా ముప్పావు గంట ఆలస్యంగా ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి సమీర్ రూమ్ దగ్గరికి చేరుకున్నాడు.

సమీర్ కిందకు వెళ్లి చికాకు పడుతూ పార్సిల్ రిసీవ్ చేసుకొని వెనుదిరగబోతుండగా ఆ వ్యక్తి సార్ కొంచెం మంచి రేటింగ్స్ ఇవ్వండి సార్ అని వేడుకోలుగా అడిగాడు.

సమీర్ సరే అని విసురుగా అని రూమ్ వైపు నడిచాడు. ఆ వ్యక్తి హెల్మెట్ తీసి థాంక్స్ అని చెప్పి తన స్కూటర్ స్టార్ట్ చేశాడు. వయసు అరవై పైబడి ఉంటాయేమో. అతడి ముఖంలో వయసు తాలూకు ఛాయలు తెలుస్తూ ఉన్నాయి.

ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి స్కూటర్ స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయాడు.

ఫుడ్ డెలివరీ లేట్ అవ్వడానికి హోటల్ వాళ్ళదే బాధ్యత కదా. ఎందుకో అతడిని చూశాక అతడు మర్యాద పూర్వకంగా మాట్లాడిన తీరు నచ్చి సమీర్ కి మంచి రేటింగ్ ఇవ్వాలనిపించింది.

అయినా అందరూ రేటింగ్స్ కోసం పార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని తనలోనే తను సణుక్కున్నాడు సమీర్.



Rate this content
Log in

Similar telugu story from Comedy