gopal krishna

Comedy Classics Fantasy

4.5  

gopal krishna

Comedy Classics Fantasy

మోసం

మోసం

7 mins
314


  "అర్థరాత్రి ఈ మేనేజర్ కుంక ఫోన్ చేసి చచ్చాడు. కిందటినెలలోనే కదా ఆడిట్ అయ్యింది. అంతా బాగుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఏంటో. ఉదయాన్నే ఆఫీస్ కి తగలడాలిట. అర్థరాత్రిళ్ళు ఫోన్ చేస్తారు. స్విచ్ ఆఫ్ చేస్తే నానా తిట్లూ తిడతాడు కుంకాక్షి. నీ గురక ఆపి ఉదయాన్నే అయిదు గంటలకి లేచి నా ముఖాన ఇంత కాఫీ చుక్క తగలెయ్యి". అర్థరాత్రి బెడ్ మీద కూర్చొని భార్య సుబ్బులు మీద రంకెలు పెడుతున్నాడు సుబ్బు అనే సుబ్బారావు.

   "అర్థరాత్రి ఈ మద్దెలదరువులేంటి బావా. మేనత్త కొడుకువని నీ పీనాసి తనానికి ఆడపిల్లలు ఎవరూ పెళ్ళి చేసుకోడానికి ముందుకు రావడంలేదని మా అమ్మా, మీ అమ్మా నా గెడ్డం పట్టుకొని బతిమాలితే నిన్ను పెళ్ళి చేసుకున్నాను చూడూ అదీ నా పొరపాటు. సుఖంగా నిద్రపోనివ్వవు. కడుపు నిండా తిండి తిననివ్వవు. మంచి చీర కట్టుకోనివ్వవు. పోనీ పిల్లల్ని కందాం బావా అంటే, పిల్లలెందుకు డబ్బు దండగ అంటావు" గయ్యి మంది సుబ్బులు.

   "ఒసేయ్... ఒసేయ్.. నేను మాట్లాడే దానికి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా లింక్ ఉందంటే, ఉదయాన్నే అయిదు గంటలకే రెడీ అయ్యి రమ్మన్నాడు మేనేజర్ అక్కుపక్షి. ఆ మాట నీకు చెప్తే లింక్ లేకుండా మాట్లాడి పిచ్చెక్కిస్తున్నావు. ఇంక చాల్లే నోరుమూసుకుని పడుకో" అంటూ "శ్రీ ఆంజనేయం" అంటూ ఎప్పట్లా ఆంజనేయ దండకం చదువుకుంటూ నిండా ముసుగుతన్ని ముడుచుకుని పడుకున్నాడు సుబ్బు.

   "ఉదయం లేపమన్నావు. తొందరగా లే" అంటూ సరిగా అయిదు అయ్యేసరికి సుబ్బులు భర్తని నిద్రలేపింది. న్యూస్ పేపర్ తీసుకొని చదువుతూ కాఫీ తాగి "ఏమోయ్, ఇది చూసావా" అంటూ గావు కేక పెట్టి భార్యని పిలిచాడు. ఏదో అయిపోయిందని పరుగులు పెట్టి హాల్లోకి వచ్చిపడింది సుబ్బులు. ఇదిగో ఈ ప్రకటన చూడు అంటూ ఒక ప్రకటన చూపించాడు.

   "తప్పిపోయాడు అంటూ ఒకబ్బాయి ఫోటో వేసి, శ్రీశ్రీశ్రీ రాజా వీరేంద్ర బహద్దూర్ వారి ఏకైక పుత్రుడు శ్రీశ్రీశ్రీ రాజకుమార్ బహద్దూర్ వారు తప్పిపోయారు. తప్పిపోయిన రాజకుమార్ వారి వయసు ఆరేళ్ళు. స్కూల్ కి అని వెళ్ళిన బాబుగారు మళ్ళీ ఇంటికి రాలేదు. హైద్రాబాదు శివార్లలో లేదా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి ఉండొచ్చని అనుమానం. వాళ్ళ మనుషులు కూడా వెతుకుతున్నారు. బాబుగారి ఆచూకీ తెలిపితే ఏభై లక్షలు, పట్టి అప్పగిస్తే కోటి రూపాయలు బహుమానంగా ఇస్తారు" అంటూ ఆ ప్రకటన లో ఫోన్ నంబర్స్ తో సహాకనిపించేసరికి ఇద్దరికీ కళ్ళు మిలమిలా మెరిసాయి.

    "ఇలాంటి ఒక్క తప్పిపోయిన అబ్బాయిని పట్టుకుంటే మన అదృష్టం తిరిగిపోయినట్లే" స్నానం చేస్తూ చెప్పాడు సుబ్బారావు. "అయినా తప్పిపోయిన అబ్బాయి ఇంతవరకూ అక్కడ ఎందుకు ఉంటాడు. పైగా వాళ్ళేమో కోటీశ్వరులు" హైదరాబాద్ కి ఎటువైపు శివార్లలో తప్పిపోయాడో, అయినా నీకు ఆఫీస్ టైం అవుతోంది. తొందరగా బయల్దేరు" అంటూ తొందరపెట్టింది సుబ్బులు.

   "హైదరాబాద్ శివార్లలో అబ్బాయి ఉండొచ్చు అంటే మనదీ శివారు ప్రాంతమే కదా, పైగా పెద్దవాళ్ళ పిల్లలు చదివే స్కూళ్ళు ఇటువైపే గా ఉన్నాయి. మనకి ఆ అదృష్టం ఎందుకు పట్టకూడదూ", లాజిక్ లాగాడు సుబ్బు.

   "దొరికితే చూడొచ్చులే, టేబుల్ మీద టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ కూడా సద్దేసాను. బ్యాగ్ లో పెట్టుకో" అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది సుబ్బులు. ఇంకా చీకట్లు పూర్తిగా విడిపోనే లేదు. ఈ చివరి నుండి సిటీ మధ్యలోకి వెళ్లేసరికి ఎలాగైనా ఒక గంట పట్టేస్తుంది అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసాడు సుబ్బారావు. వీధి మలుపు తిరుగుతూ ఉండగా ఎవరో అబ్బాయి ఏడుస్తూ కనిపించాడు చెట్టుకింద.     "అయ్యయ్యో ఎవరో ఈ చిన్నబ్బాయి" అనుకుంటూ బైక్ ముందుకు పోనిచ్చాడు టైం అయిపోతోందని. కొంచెం దూరం వెళ్లేసరికి హఠాత్తుగా గుర్తొచ్చింది పేపర్ ప్రకటన. కొంపదీసి తప్పిపోయిన వాడు వీడు ఒకటి కాదు కదా అనుకున్నాడు. "అమ్మో, వాడే వీడైతే ఇంకేమన్నా ఉందా? కోటిరూపాయలు పోయినట్లే కదా! మేనేజర్ కి ఏదో స్టోరీ చెప్పచ్చులే లేట్ అయినందుకు. ఒక్కసారి వెనక్కి వెళ్ళొద్దాం" అనుకుంటూ బండి వెనక్కి పోనిచ్చాడు. ఆ అబ్బాయి చెట్టుకిందే పడుకున్నాడు. వాడి దగ్గరగా వెళ్ళి ఇందాక పేపర్ లో చూసిన మొహంతో పోల్చుకున్నాడు. "ఒరేయ్ సుబ్బిగా ఎప్పుడో ఒకరోజు నీకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పడుతుందిరా" అని బామ్మ అనేది. అది ఇదేనేమో" అనుకున్నాడు.

   "ఒరేయ్ బాబూ ఎవర్రా నువ్వు? నీ పేరేంటి" అంటూ అడిగాడు. "నా పేరూ... పేరూ... అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ రాజకుమార్ అండీ.. అందరూ రాజు అంటారు" అన్నాడు. "ఒరేయ్ సుబ్బీ ఉదయాన్నే నక్క తోకను తొక్కావురా..శెభాష్.. అంటూ తనని తాను అభినందించుకొని, తమరు ఇక్కడెందుకు ఉన్నారు సర్" అని అడిగాడు వినయంగా వంగి వంగి దండాలు పెడుతూ. వాడికేమీ అర్థం కాక ఎవరో పిచ్చివాడేమో అనుకుని పక్కనే ఉన్న రాయి అందుకున్నాడు. "తప్పు బాబూ.. అలా రాళ్లతో కొట్టకూడదు. అసలు ఎవరు నువ్వు ఇక్కడెందుకు ఉన్నావు"? అని అడిగాడు. "తప్పిపోయానండీ" అంటూ వాడు మళ్ళీ ఏడుపు లంకించుకున్నాడు.

    "సరే, మీ ఇంట్లో దింపుతాను రా" అంటూ బైక్ ఎక్కించుకొని వాణ్ణి తిరిగి తన ఇంటికి తీసుకెళ్లి తలుపు దబదబా బాదుతూ "ఒసేయ్ సుబ్బులూ అర్జెంటు గా తలుపు తియ్యవే" అంటూ గావు కేకలు పెట్టసాగాడు. తూర్పున సూర్యోదయం అవుతోంది. "కొంపదీసి ఉదయాన్నే ఏ పిచ్చికుక్కైనా కరవలేదు కదా" అనుకుంటూ తలుపు తీసింది. భర్త పక్కనే ఎవరో బిచ్చగాళ్ల అబ్బాయిలా ఉన్నాడు. సుబ్బారావు వాణ్ణి ఎంతో భద్రంగా బైక్ మీంచి దింపి, "నేను ఆఫీస్ కి వెళ్ళొచ్చేదాకా రాజావారిని జాగ్రత్తగా చూసుకో" అన్నాడు.

   "వీడు రాజావారేంటి బావా. నీ పిచ్చికి అంతం లేనట్లుంది. వీడి పక్కన నిలబడితే వాంతి అయ్యేలా ఉంది. వెధవ బట్టలూ వీడూనూ" అంటూ మూతికి చెయ్యడ్డుపెట్టుకొని ముక్కు కూడా మూసుకుంది. "గొప్పవాళ్ళు ఒక్కోసారి అంతే. నేను తొందరగా వచ్చేస్తాగా. రాజావారికి ఏంకావాలో చూసుకో" అంటూ సుబ్బులు పిలుస్తున్నా వినిపించుకోకుండా రివ్వున వెళ్ళిపోయాడు.

దారిలో కోటి రూపాయలు కళ్ళముందు ఫెళఫెళ శబ్దాలు చేస్తూ మురిపిస్తూ ఉంటే, ఎలాగో ఎనిమిది గంటలకు ఆఫీస్ కి చేరుకున్నాడు. అప్పటికే సుబ్బారావు రానందుకు మేనేజర్ గారు కాలుగాలిన పిల్లిలా ఆఫీస్ అంతా తిరుగుతూ, సుబ్బారావు ని చూడ్డంతో, "ఏమయ్యా సుబ్బు, ఆరు గంటలకు ఆఫీస్ కి రమ్మని పిలిస్తే నామాట కొంచెం కూడా నీకు లెక్కలేదా?" అంటూ రంకెలు వెయ్యసాగాడు. "సారీ సర్, మా ఆవిడకి సడన్ గా ఆరోగ్యం బావుండలేదు. అదీ..అదీ అంటూ ఏదో చెప్పబోయాడు. ఇప్పుడు సోది ఆపి నిన్నటి ఫైల్ పది నిమిషాల్లో రెడీ చెయ్యి. ఇంకో అరగంటలో హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. తేడా వస్తే నీ ఉద్యోగం ఊడిపోతుంది అన్నాడు.

   "పోరా.. వెధవాయ్.. నువ్వెంత నీ బోడి ఉద్యోగం ఎంత, రేపీపాటికి నేను కోటీశ్వరుణ్ణి కదా!" అనుకున్నాడు. "జీతాలు మాత్రం లోటులేకుండా ఫస్ట్ తారీఖు కి పుచ్చుకుంటారు. ఆఫీస్ లో కూర్చుని అరగంటకోసారి లీటర్లకొద్దీ టీలు, కాఫీలు తాగుతారు. పని దగ్గరకొచ్చేసరికి తాబేలు నయం మీ ముందు" అంటూ నానా తిట్లు తిట్టాడు. ముందురోజు ఫైల్ రెడీ చేసి సుబ్బారావు మేనేజర్ టేబుల్ మీద పెట్టడం హెడ్ ఆఫీస్ వాళ్ళు రావడం ఒకేసారి జరిగాయి.

   సుబ్బు అక్కడే ఉన్నాడు కానీ మనసంతా ఇంట్లో ఉన్న రాజకుమార్ బహద్దూర్ వారిమీదే ఉంది. హెడ్ ఆఫీస్ వాళ్ళు వెళ్ళిన ఒక గంటకి ఇంటికి బయల్దే రాడు సుబ్బారావు. సరిగా ఏడుగంటలకు ఇంటికి వచ్చిన సుబ్బు కి ఇల్లు చూసాకా నోట మాట రాలేదు. సుబ్బులు కుడిచేతికి కట్టు కట్టుకొని మూలుగుతూ సోఫాలో కూర్చుంది.

    సుబ్బు ఇంటికి వస్తూనే "రాజావారూ" అంటూ పిలిచాడు ముద్దుగా. కిచెన్ లోంచి ఒక ప్లేట్ రివ్వున మీదికి దూసుకొచ్చింది. క్షణం ఆలస్యం చేస్తే మెడ తెగిపోయేదే. కానీ ఒడుపుగా ఆ ప్లేట్ ని క్యాచ్ పట్టుకున్నాడు సుబ్బు. ఏమైందన్నట్లుభార్యవేపు అయోమయంగా చూసాడు. "పసివాడు కదా అని నాలుగు ఇడ్లీ పెట్టాను బావా. నాలుగేసి ఇడ్లీల చొప్పున నాలుగు వాయలు లాగేసాడు. ఉదయం వచ్చే అరలీటరు పాలూ కాచకుండానే తాగేశాడు".

"సరిగా తొమ్మిది గంటలనుండి ఆకలి అంటూ ప్రాణాలు తోడేసి, ఫ్రిడ్జ్ లో ఉన్న డ్రింకులు, పళ్ళూ అన్నీ తినేసాడు. పదకొండు గంటలకి సుష్టుగా భోజనం చేసి ఆడుకోవడం మొదలెట్టాడు. వాడు తినగా ఏమీ మిగలకపోవడంతో నేను మళ్ళీ వంట చేసుకోలేక కొంచెం ఉప్మా చేసుకుంటే సరిగా ఒక స్పూన్ నాకోసం మిగిల్చి మిగిలినదంతా నాకేసాడు. మూడుగంటలకి జొమాటో లో మంచురియా ఆర్డర్ పెడితే అది తిని, గ్లాసునిండా పాలు తాగి ఆడు కుంటూ ఉన్నాడు కదా అని టీవీ చూస్తూ సోఫా లో నడుం వాల్చానా ఎప్పుడు కోసేసాడో సోఫా దేనికి పనికిరాకుండా కోసేశాడు. వాణ్ణి కొట్టబోతే నా చేతిని పట్టుకొని వెనక్కి వంచేశాడు. విరిగిపోయిందో ఏమిటో ఖర్మ"ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంది సుబ్బులు.

"రేపు వీడి సంగతి తేల్చేద్దాం" అంటూ సుబ్బు భార్యకు నచ్చచెప్పబోయాడు. నీకు నచ్చినన్ని రోజులు ఉంచుకో కానీ నేను మా ఇంటికి వెళ్ళిపోతా", ముక్కు చీదుతూ చెప్పింది సుబ్బులు.

   "సరేలే ఆ పేపర్ ఇలా ఇవ్వు" అంటూ ఉదయం పేపర్ తీసుకొని వాళ్ళిచ్చిన నెంబర్ కి కాల్ చేసాడు. అవతలి వైపు నుండి "హలో, ఎవరూ" అంటూ వినిపించేసరికి, "నమస్కారమండీ నా పేరు సుబ్బారావు. మీరు వీరేంద్ర బహద్దూర్ వారేనా" అడిగాడు. "రాజావారి సెక్రటరీ నండీ నేను. చిన్న రాజావారు తప్పిపోయినప్పటినుండి రాజావారు మాట్లడడం లేదండీ" చాల మర్యాదస్తులవారిలా ఉన్నారు అవతలి నుండి.

   "అయ్యా, తమరి చిన్న రాజావారు నా దగ్గర ఉన్నారు. చాల కష్టపడి వెతికి తీసుకొచ్చాను" సుబ్బు మాట పూర్తి కానేలేదు. "అవునా, రాజావారు దొరికారా? ఎప్పుడూ ఎలా?" ప్రశ్నలు వేస్తున్నారు అవతలివాళ్ళు. ఫలానా చోట ఉన్నాడు అని చెప్పేద్దామని అనుకున్న సుబ్బు ఎందుకో చప్పున ఆ ప్రయత్నం విరమించు కొని, నేరుగా వ్యవహారంలోకి దిగాడు. "మరి తమరిస్తామన్న ప్రైజ్ మనీ సంగతి... అంటూ నసిగాడు. మీకు ఆ విషయంలో ఏమీ సందేహం వద్దు. మీకు క్యాష్ కావాలా? చెక్ కావాలా? లేక డైరెక్ట్ అకౌంట్ లోకి ఫోన్ పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ లో వెయ్యాలా చెప్పండి" అన్నాడు అవతలి వ్యక్తి.

    "అయ్యో ఎంతమాట, నాకు ఇప్పుడు డబ్బు లెక్కపెట్టుకొనేటంత తీరిక ఎక్కడా? తమరు నా అకౌంట్ లో డబ్బులు వెసెయ్యండి" అన్నాడు. "సరే సుబ్బారావు గారూ మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలో చెప్తే అక్కడికొచ్చి మీ ఎదురుగానే డబ్బులు మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాం. మా రాజావారు ఎక్కడున్నారు"? అడిగాడు అవతలి వ్యక్తి. "నేను నా లొకేషన్ మీకు షేర్ చేస్తాను. అక్కడికే వచ్చి రాజావారిని తీసుకెళ్లండి" అంటూ భరోసాగా చెప్పాడు.

   "వాళ్లేమంటున్నారు బావా" అడిగింది సుబ్బులు. "వ్యవహారం కొలిక్కి వచ్చిందోయ్ సుబ్బులూ. నీకు రేపు వడ్డాణం పక్కా" అన్నాడు సుబ్బు. "అది సరే ఈ పిల్ల పిశాచంగాడిని తీసుకెళ్తారా ఇప్పుడు" అడిగింది. "తప్పు తప్పు అది పిల్ల పిశాచం కాదు. నడిచొచ్చే లక్ష్మీదేవి మగ అవతారం. లక్ష్మీదేవికి మనల్ని కనికరించాలని అనిపించిందిటోయ్ సుబ్బులూ" అన్నాడు ఆమె బుగ్గ మీద చిటికె వేస్తూ. పది నిమిషాల్లో నీట్ గా తయారై, పిల్లాణ్ణి పట్టుకొని భార్యాభర్తలు ముందుగా అనుకున్న దుర్గ గుడికి చేరుకున్నారు.

  లొకేషన్ షేర్ చేసిన పది నిమిషాల్లో రెండు ఇన్నోవా కార్లు గుడి ముందు ఆగాయి. "వాళ్ళొచ్చే సారు రాజావారి కోసం" అంటూ పిల్లాణ్ణి ఎత్తుకొని కారు దగ్గరకి నడిచారు ఇద్దరూ. ఒకావిడ హిందీ తెలుగు కలిపిన యాసలో మాట్లాడుతోంది. ఆమె చిన్న నిక్కరూ, టైట్ గా ఉన్న చిన్న బ్రాలాంటి బ్లౌజ్ వేసుకుంది. ఆమె అందాన్ని చూస్తూ ఉంటే స్వర్గంలో ఉన్నట్లుంది సుబ్బుకి. ఆమె అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ "మీకు ముందుగా వెయ్యిరూపాయలు ఎకౌంట్ లో వేస్తాము. వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. మళ్ళీ మమ్మల్ని మీరు నమ్మకపోతే మా పరువు పోతుంది" చెప్పింది.

   "అయ్యో అదెంత మాటా. మీలాంటి పెద్దవాళ్ళకి మాలాంటి పేదల డబ్బు కావాలా"? అంటూ ఆమె అందాల్ని కళ్ళతోనే జుర్రుకుంటున్నాడు.

ముందుగా సుబ్బుల్ని ఇలా తయారు చెయ్యాలి అని ఆవిణ్ణి చూసి ప్లాన్ వేసుకున్నాడు. సుబ్బు ఇచ్చిన అకౌంట్ కి వెయ్యి రూపాయలు ట్రాన్స్ఫర్ చేసారు వాళ్ళు. అది రావడంతో భార్యాభర్తల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. "అయ్యో మరిచిపోయి లాగౌట్ చేసేసా. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాను మీ అకౌంట్ నెంబర్ చెప్పండి" అంటూ గుమస్తా లాగ ఉన్నతను చెప్పాడు. ఆవిడ సుబ్బారావు ని మాటల్లోకి దించింది. సుబ్బులు అకౌంట్ నెంబర్ చెప్పాకా, మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి అన్నాడు అతను. "ఆఁ...వచ్చింది" అంటూ సంతోషంగా సుబ్బులు ఆ నెంబర్ చెప్పింది. "హమ్మయ్య ట్రాన్స్ఫర్ చేసేసాను సుబ్బారావు గారూ" అంటూ తన ఫోన్ చూపించాడు. "నా అకౌంట్ లోకి ఇంకా డబ్బులు రాలేదు. బహుశా నెట్ వర్క్ ప్రాబ్లెమ్ ఏమో" అన్నాడు. "అదే అయ్యుంటుంది సుబ్బు గారూ. కాసేపట్లో మీ అమౌంట్ పడుతుంది. డోంట్ వర్రీ సర్" అంటూ ఒక షేక్ హ్యాండిచ్చి, మా వాణ్ణి మాకు సేఫ్ గా అప్పగించారు. మీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది" అంటూ, పిల్లాణ్ణి కారు లో కూర్చోపెట్టి, సుబ్బులుకి ఆవిడ ఒక హగ్ ఇచ్చి సిటీ వైపు వెళ్లిపోయారు.

   "హమ్మయ్య ఒకపూట నరకం చూపిస్తే చూపించాడు వెధవ మనం కోటీశ్వరులం ఇప్పుడు" అంది సుబ్బులు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఇల్లంతా సద్దుకొని పడుకున్నారు. పడుక్కున్నాడే కానీ సుబ్బుకి డబ్బు పడిందో లేదో అని చింత మొదలైంది. అర్థరాత్రి లేచి చూసుకున్నాడు. "యువర్ అకౌంట్ హాస్ డెబిటెడ్ నైన్టీన్ లాక్స్ ఎయిట్ థౌసండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ, ప్రెసెంట్ బాలన్స్ ఈస్ జీరో" అని చూపిస్తోంది. కళ్ళు గట్టిగా నులుముకుని మరీ చూసాడు సుబ్బు.

   "అన్యాయం, అక్రమం, దారుణం" అంటూ సుబ్బుల్ని నిద్రలేపాడు. "అబ్బబ్బా, రేపుదయం చూద్దాంలే బావా, కమ్మగా కలలు కంటూ ఉంటే నిద్రలేపుతావేంటి?" అంటూ విసుక్కుంది. "ఒసేయ్, సుబ్బులూ మనకి వాళ్ళు నున్నగా గుండు గీసేశారే" అంటూ మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు ఏడుస్తూ. "ఇల్లు కట్టుకోడానికి దాచుకున్న డబ్బు అది" అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ ఉంటే, "ఆ నెంబర్ కి కాల్ చెయ్యి" అని సలహా ఇచ్చింది సుబ్బులు. ఆత్రంగా ఆ నెంబర్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది.

   మర్నాడు ఇద్దరూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి పరిగెత్తారు. "ఈ మధ్య హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ లలో ఇలాంటి మోసాలు చాలానే జరుగుతున్నాయి. ఇలా ఖరీదైన కుటుంబాల్లో పిల్లలు తప్పిపోయారని ప్రకటనలు ఇచ్చి తిరిగి ఆ పిల్లల్ని కనిపెట్టినవాళ్లనే మోసం చేసి, డబ్బు దోచుకునే ముఠా ఒకటి ఉందని తెలిసింది. మేము త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం. మీరు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి. ఎప్పుడూ ఎవరికీ ఓటీపీ చెప్పకండి" కుర్చీలో విలాసంగా కూర్చొని టీ తాగుతూ చెప్పాడు ఏసీపీ సింహాచలం.

   ఇంక ఓటీపీ చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే అంటూ కంప్లైంట్ ఇచ్చి ఏడుస్తూ ఇంటిదారి పట్టారు సుబ్బూ, సుబ్బులూ.


Rate this content
Log in

Similar telugu story from Comedy