STORYMIRROR

gopal krishna

Tragedy Classics Fantasy

4  

gopal krishna

Tragedy Classics Fantasy

ఋణానుబంధ రూపేణా....

ఋణానుబంధ రూపేణా....

7 mins
291

“ఏం రమణా! ఇదేనా రావడం !” అన్న పిలుపుతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగిచూసాడు. ఎదురుగా ఎప్పటిలాగే చేతిలో ఒక బడ్ పట్టుకొని చెవిలో తిప్పుకుంటూ కనిపించాడు శంకరం."ఇక్కడే ఉన్నావా బావా" ఆప్యాయంగా పలకరించాడు రమణ. శంకరం పక్కనే చెట్టుకింద ఉన్న సిమెంట్ దిమ్మమీద సర్దుకొని కూర్చుంటూ, "ఏంటి విశేషాలు"? అడిగాడు సన్నగా గొణుగుతున్నట్లు.  "ఏమన్నారు ఇంట్లో" ఇయర్ బడ్ జేబులో పెట్టుకొని, నిర్లక్ష్యంగా అతనివైపు చూస్తూ అడిగాడు శంకరం. "ఇదేమైనా శుభకార్యమా బావా, వెళ్లిరమ్మని చెప్పడానికి. నేనేమీ ఇంట్లో మాట్లాడలేదు. అయినా నాకంటూ ఎవరున్నారని...అందుకే చెప్పాలని అనిపించలేదు" నిర్లిప్తంగా జవాబిచ్చాడు ఆ చెట్టుకిందనుండి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వైపు చూస్తూ రమణ. 

"సూపర్నెంట్ డాక్టర్ మురళి ఇంకా డ్యూటీ కి రాలేదు. నీ మాట సెప్పి ఉంచాను. పేపర్స్ అవీ పక్కాగా ఉంటేనే కిడ్నీ ఇవ్వడానికి సాధ్యమని పదేపదే చెప్పాడు. ఇవన్నీ మామూలే గానీ, ఇప్పుడు కిడ్నీ ఇవ్వాల్సిన పనేముంది రమణా"! మనసుపొరల్లో ఎక్కడో మానవత్వం ఉన్నట్లుంది శంకరానికి, అనునయంగా అడిగాడు. "ఇంట్లో పరిస్థితులు బాగాలేవు బావా! కొంచెం డబ్బులు ఎక్కువ ఇప్పించు. నీ కమిషన్ పోనూ నాకో లక్షరూపాయలు కావాలి" అన్నాడు రమణ.”నీకు చెప్పానుగా నా కొడుకు మురళి గురించి. బొత్తిగా బాధ్యతలు పట్టని మనిషి. ఎలా పెంచిందో వాడిని రాజ్యం. నాకు వాణ్ణి పెంచడం చేతకాలేదు బావా, రాజ్యం నన్నొదిలి వెళ్ళిపోయింది. బ్రతుకే శూన్యమైపోయింది”. ఆకాశం కేసి చూస్తూ దణ్ణం పెట్టాడు రమణ. 

కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. కళ్ళల్లో నీళ్లింకిపోయాయనడానికి సూచనగా ఎండిపోయాయి కళ్ళు. పాపం ఎన్నాళ్ళైందో సరిగా తిని. "రమణా, పద ఇంటికి వెళదాం" అనునయంగా భుజంమీద చెయ్యేసి అతని చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. "ఒద్దులే బావా, నా పని కొంచెం తొందరగా చూడు. ఊళ్ళో అప్పులవాళ్ళు ఎదురుచూస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీలు తీర్చేస్తే, నా బాధ్యత ఒడ్డెక్కిపోతుంది. లేదంటే రాజ్యానికి చెడ్డపేరు వస్తుంది" కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు రమణ. "నేను సూపర్నెంట్ గారితో మాట్లాడాను రమణా, నీ పని సులభంగా అయిపోతుంది" భరోసాగా అన్నాడు శంకరం . "బావా, నాకు ముందుగా డబ్బిప్పించగలవా? వాళ్ళకి నమ్మకం లేకపోతే నాతో రమ్మను. ఊళ్ళో బాకీలు కట్టేసి తిరిగి వస్తాను" అన్నాడు రమణ. 

"సరే, చూద్దాం. అలా జరగదు రమణా. అయినా ప్రయత్నం చేద్దాం. అన్నీ సరిగా జరిగితే రేపీవేళకి ఆపరేషన్ అయిపోతుంది" చెప్పాడు శంకరం .కాసేపు ఇద్దరిమధ్యా నిశ్శబ్దం. అప్పుడే వరసగా నాలుగు కార్లు వచ్చి ఆగాయి. డాక్టర్ కార్ దిగి లోపలికి గబగబా నడుస్తూ ఉంటే వెనకాలే మరో ఇద్దరు మగవాళ్ళు, ఆ వెనకాల ఇద్దరు ఆడవాళ్ళూ నడుస్తూ లోపలికి వెళ్ళారు. "ఇదిగో శంకరం, సూపర్నెంట్ గారు నిన్ను రమ్మన్నారు" కారు డోర్ లాక్ చేస్తూ చెప్పాడు డ్రైవర్ సింహాచలం. ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు" రమణ జవాబు కోసం ఎదురుచూడకుండా లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళాడు శంకరం.

             *****

    రమణ ఆలోచనల్లో మునిగిపోయాడు. పోయిన సారి హాస్పిటల్ కి వచ్చినప్పుడు తనకు పరిచయమయ్యాడు శంకరం. భార్యని హాస్పిటల్ కి నడిపించి తీసుకొచ్చిన రమణ దగ్గర అందరిలాగే డబ్బు పుచ్చుకొని బెడ్ ఏర్పాటు చేసాడు. కానీ తెలియకుండానే శంకరం కి దగ్గరయ్యాడు రమణ. రమణ నెమ్మదస్తుడవ్వడం కారణం కావచ్చేమో. రమణ భార్య రాజ్యం శవాన్ని మార్చురీ వ్యాన్ లో తీసుకెళ్తూ ఉంటే ఎన్నో చావులు స్వయంగా చూసిన శంకరం చలించిపోయాడు. అతనికి తెలియకుండానే కన్నీళ్లు వచ్చి తుడుచుకోడం కూడా మరిచిపోయి అలాగే ఉండిపోయాడు.

   భార్యని గురించి రమణ చెప్తూ ఉంటే ఆమెలో మంచితనాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు. ఆమె ఇంక బతకదని డాక్టర్లు చెప్పినప్పుడు రమణ కళ్ళల్లో నీళ్ళు చూసి చలించిపోయాడు. మొదటి భార్య సావిత్రి చనిపోయాక మురళిని పెంచలేక బాధపడుతున్న సమయంలో రాజ్యం రమణ జీవితంలో అడుగుపెట్టింది. ఆమె రాకతో రమణ కష్టాలు తీరిపోయాయి. లోకం తీరు తెలిసిన రాజ్యం సిగ్గుపడకుండా కూలి పని చేస్తూ మూడు నెలలలో ఒక గేదెను కొని పాల వ్యాపారం మొదలెట్టింది. ఆరు నెలలు తిరిగేసరికి మూడు గేదెలు ఇంటికి చేరాయి. అప్పటినుండి తిరిగి వెనక్కి చూడలేదు. పట్నంలో మురళిని చదివించింది. వాడు ప్రయోజకుడవుతాడు అని అనుకుంటే వాడొక తిరుగుబోతు అయ్యాడు.

    వాణ్ణి చదివించడం అనవసరమని రాజ్యం కొంత పొలం కౌలుకు తీసుకొని కొడుకుని పనిలోకి దింపి వ్యవసాయం కూడా మొదలెట్టింది. తాను ఏ పనిచేసినా ఒక పధ్ధతి ప్రకారం చేసేది. రాజ్యం చలవతో చక్కగా మూడుగదుల ఇల్లుకట్టుకున్నారు. సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయనగా రాజ్యానికి ఈ జబ్బొచ్చింది. తగ్గిపోతుందని కొన్నాళ్ళు అశ్రద్ధ చేసినా, పదిమంది పదిరకాలుగా చెప్పడంతో హాస్పిటల్ కి భార్యని తీసుకొని వచ్చిన రమణ, తిరిగి ఆమెను శవంగా ఇంటికి తీసుకెళ్లవలసి వచ్చింది.

    రాజ్యం హాస్పిటల్ ఉందని తెలిసినా మురళి మనసు మారలేదు. ఊరొదిలి, ఎక్కడెక్కడో తిరిగి వ్యాపారం లో నష్టమొచ్చిందని అప్పులవాళ్ళని ఇంటిమీదికి తీసుకొచ్చాడు. రాజ్యం చనిపోయిన రోజు, శవాన్ని ఇంటి ముందు ఉంచితే అప్పులవాళ్ళు చుట్టూ చేరి నానాగొడవ చేసారు. అందరికీ బాకీలు తీరుస్తానని చనిపోయిన రాజ్యం సాక్షిగా ప్రమాణం చేసి, ఆమె కార్యక్రమాల్ని ఒడ్డెక్కించాడు రమణ. ఈ హడావుడిలో తాను ఉండగానే, తనను పెంచి పెద్ద చేసిన తల్లి అని కూడా ఆలోచించకుండా ఆమె దాచుకున్న కొన్ని నగలను దొంగతనంగా ఇంట్లోంచి పట్టుకొని పోయాడు మురళి. పోనీలే కొడుకు ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉంటాడని అనుకున్నాడు రమణ. సరిగా నెలతిరక్కుండానే ఒకమ్మాయిని తీసుకొచ్చినప్పుడు మౌనంగా ఆమెను కోడలిగా అంగీకరించాడు.

    తనకు తెలీకుండా కొడుకు కోడలు కలిసి ఇల్లు తాకట్టుపెట్టిన రోజున రమణ తట్టుకోలేకపోయాడు. కొడుకు మీద మొదటిసారి చెయ్యి చేసుకున్నాడు. అడ్డొచ్చిన కోడల్ని కూడా వదల్లేదు. దాంతో పంచాయతీ జరిగింది. ఊళ్ళో పెద్దలు మురళిని, అతని భార్యని సమర్థించి, సర్దుకుపోవాలి కానీ కుటుంబాన్ని రోడ్డున పడెయ్యకూడదని రమణకి హితబోధ చేశారు. 

   ఇల్లు రమణ చెయ్యి జారిపోయిందని తెలిసిన అప్పులవాళ్ళు మళ్ళీ రమణ మీద పడ్డారు. అప్పులకి తనకి సంబంధం లేదని రమణ ఎంత మొత్తుకున్నా వాళ్ళు ఒప్పుకోలేదు సరికదా, చనిపోయిన రాజ్యం మీద నిందలు వెయ్యడంతో భరించలేక తానే అప్పులు తీరుస్తానని మాటిచ్చాడు. వ్యవసాయం చెయ్యడం కూడా చేతకాని రమణ కూలో నాలో చేసి అప్పులు తీర్చుదామంటే అదేమీ జరిగేపని కాదని అర్థమైంది. దిక్కుతోచని రమణ ఊరి మొదట్లో ఉన్న రామాలయం దగ్గర కూర్చొని ఉండగా, పేపర్ చదువుతున్న పోస్టుమాష్టారి ద్వారా తెలుసుకున్నాడు కేజిహెచ్ లో కిడ్నీ కోసం ఎదురుచూస్తున్న పేషెంట్ ఉన్నారని.

   శంకరాన్ని కలిసి తన సమస్య చెప్తే ముందు ఒప్పుకోలేదు. కానీ కమిషన్ ఆశ చూపించేసరికి సూపరింటెండెంట్ కి, మిగిలిన అధికారులకి రమణ విషయం చెప్పి తన టాలెంట్ తో వాళ్ళని ఒప్పించాడు. తరువాత పరీక్షలన్నీ చేయించి రమణ కిడ్నీ పనికొస్తుందని తేల్చాక రమణ ముఖంలో ఆనందం చూసి శంకరం ఆశ్చర్యపోయాడు. "రాజ్యానికి వచ్చిన చెడ్డపేరు పోతే అదే చాలు. నా శరీరం అమ్మేసి అప్పులు తీర్చేసినా ఆమె ఋణం నేను తీర్చుకోలేనిది" అన్నాడు.

          ******

   "ఇదిగోబాబూ ముందే చెప్తున్నాం, ఆపరేషన్ అయ్యాకే నీ డబ్బు ఇస్తాము చెప్పాడు ఒక లావుపాటి ఆయన నిర్లక్ష్యంగా. మా నాన్న గురించి మేమేమీ ఆలోచించడం లేదు. నువ్వు కూడా ఏదో అవసరాల్లో ఉన్నావని, నీకు కూడా సాయం చేసినట్లుంటుందని మేము కిడ్నీ తీసుకుంటున్నాం.అతని మాటలు రమణకి చివుక్కు మనిపించాయి. "నాకు డబ్బులు ముందే కావాలని నేను చెప్పానండీ. మీరూ, మీరూ ఏం మాట్లాడుకున్నారో నాకు అనవసరం. నాకు లక్షరూపాయలు ఇస్తే, మా ఊరు వెళ్ళి బాకీలు కట్టేసి వస్తాను అప్పుడు ఆపరేషన్ పెట్టుకోండి. మీకు నా మాటమీద నమ్మకం లేకపోతే నాతో రావచ్చు" అన్నాడు రమణ. ఇక్కడ పేషెంట్ పరిస్థితి బాగోలేదంటే నీ మాట నీదే తప్ప మేం చెప్పేది వినవేంటి? విసుగ్గా అన్నారు. 

    డబ్బు ఇస్తే ముందే తీసుకొని నువ్వు వెళ్ళిపోతే ఎలా అడిగింది ఒకావిడ. అదేంటమ్మా అలా అంటారు. నేనెక్కడికి వెళతాను. పోనీ నాతో ఎవరినైనా పంపించండి మీకు నమ్మకం లేకపోతే అన్నాడు రమణ. సరేలే, రేపుదయం వెళ్ళివద్దాం చెప్పారు ఒకరు. బహుశా అతను పేషెంట్ ఆఖరి సంతానమేమో. ఆపరేషన్ రేపు సాయంత్రం అంటున్నారుగా. ఇవాళే వెళ్ళొద్దామండీ. నేను అప్పులు తీర్చేస్తే రాజ్యానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడినౌతాను చెప్పాడు రమణ.

   రమణ చెప్పినట్లు అప్పటికప్పుడే బయల్దేరి కారులో అతని ఇంటికి చేరుకున్నారు. రమణ ని చూసి చాలామందే పలకరించారు. రమణ మంచి హుషారుగా ఇంట్లో అడుగుపెట్టి, కొడుకుని కోడలిని వచ్చినవాళ్ళకి పరిచయం చేసాడు. తరువాత ఊళ్ళో పదిపదిహేను మందిని కలిసి బాకీలు తీర్చేసాడు. "ఏంటి రమణా చాల హుషారుగా ఉన్నావు" పలకరించాడు చిన్నప్పటి స్నేహితుడు రాజు. "ఏంలేదురా, ఊళ్ళో మురళి పెట్టిన బాకీలన్నీ కట్టేసానుగా. చాల సంతోషంగా ఉంది ఇవాళ. బంధువులొచ్చారు రేపు వైజాగ్ వెళ్లాల్సిన పని ఉంది. ఒక వారం రోజుల్లో వచ్చేసి, ఇక్కడే ఏదో ఒకపని చేసుకుంటాను" చెప్పాడ

   "వెళదామా , తనతో వచ్చిన ఆ పేషెంట్ కొడుకు చెప్పడంతో అతనితో కలిసి కారు ఎక్కాడు. రాజు తననే చూస్తూ ఉండడంతో కారు లోంచి అతనికి చెయ్యూపుతూ వీడ్కోలు పలికాడు. రాజు రమణనే చూస్తూ, ఆహా అదృష్టమంటే నీదేరా రమణా! భార్యపోయినా, బాదరబందీలు లేని జీవితం రా నీది. ఇవాళ హాయిగా కారు లో తిరుగుతున్నావు అనుకున్నాడు. రమణ కారు ఊరు దాటుతూ ఉంటే వూరు గుర్తొచ్చి ఒక్కసారి కళ్ళల్లోంచి నీళ్ళు సుడులు తిరుగుతూ తెలియకుండానే చేతిమీద వెచ్చగా జారిపడ్డాయి.  

   "మీ ఊళ్ళో మీకు మంచి పేరుంది కదా! ఇప్పుడు కిడ్నీ అమ్ముకోవడం దేనికి? అడిగాడు అతను. నా భార్య రాజ్యం ఉన్న రోజుల్లో రాజాలాగా బతికాను. మా మురళి ఊరంతా అప్పులు చేసి, జల్సాగా బతకడం అలవాటు చేసుకున్నాకా, తాను కష్టపడి సంపాదించి కరిగిపోయింది. మాయదారి కాన్సర్ ఆమెను తినేసి నన్ను మిగిల్చి అనాథను చేసింది. కొడుకు చేసిన అప్పు మీ దయవలన తీర్చేసి, రాజ్యం కి చెడ్డపేరు రాకుండా చేయగలిగాను. ఇప్పుడు నా జీవితానికి ఏ చింతాలేదు. రమణ గొంతులో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ హాస్పిటల్ కి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలు దాటిపోవడంతో ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్ మర్నాడు ఆపరేషన్ చేద్దామని చెప్పి, రమణ తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు.

   ముందుగా అనుకున్నట్లు మర్నాడు ఉదయాన్నే డాక్టర్స్ వచ్చి సర్జరీ చేసి వెళ్ళిపోయారు. రమణ కి మెలకువ వచ్చేసరికి ఒక జనరల్ వార్డ్లో పెట్టారు. పేషెంట్ వాళ్ళ వాళ్ళు ఎవరూ వచ్చింది, చూసిందీ లేదు. రమణకి మెలకువ వచ్చేసరికి ఎదురుగ శంకరం .రమణా, ఇందాకే నీకొడుకు వచ్చి చూసి వెళ్ళాడు అన్నాడు. హాస్పిటల్ అంతా తిరుగుతూ అడుగుతూ ఉంటే ఎవరో ఏమిటో అని వివరాలు అడిగాను చెప్పాడు శంకరం. కిడ్నీ అమ్మిన విషయం చెప్పావా? అడిగాడు రమణ. లేదయ్యా, అనారోగ్యం అని ఆసుపత్రిలో జాయిన్ అయ్యావని, నీకెవ్వరూ లేరని చెప్పావని అన్నాను. మీ నాన్న అంటున్నావు కాబట్టి ఖరీదైన వైద్యం కోసం ఇంకా ఎక్కడైనా జాయిన్ చెయ్యమని అన్నాను. 

   ఇతను నన్ను కన్న తండ్రి కాదు. తెలిసిన ఆయన. నా చిన్నతనంలో పక్కింట్లో ఉండేవాడు. అప్పుడు నాకు తెలిసీ తెలియని వయసులో నాన్న అని పిలిచేవాడిని. అలాగే అలవాటైపోయింది అంటూ తప్పించుకొని వెళ్ళిపోయాడు.మళ్ళీ వస్తానని, ఏదైనా విషయం ఉంటే ఫోన్ చెయ్యమని, ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించే స్థితి లో లేనని చెప్పాడు రమణా! అన్నాడు శంకరం . రమణ కళ్ళల్లోంచి రెండు కన్నీటిబొట్లు కారి బెడ్ మీదికి పడిపోయాయి.

   నీకు మెలకువ వస్తే బలానికి పళ్ళూ అవీ కొనుక్కోడానికి వాళ్ళు పదివేలిచ్చారు. నిజానికి మాలాంటి వాళ్ళ చేతిలో పడితే డబ్బు విషయం కదా సులభంగా మోసం చేస్తారు రమణా, కానీ ఎందుకో ఆ రోజు మీ ఆవిణ్ణి చూసాక నాకు నా చెల్లెమ్మని చూసినట్లు అనిపించింది. ఈ డబ్బు జాగ్రత్తగా పెట్టుకో. నేను ఒక గంటలో వస్తాను అంటూ డబ్బులు రమణ చొక్కా జేబులో పెట్టి వెళ్ళిపోయాడు శంకరం .

  రమణ కి కడుపులో తిప్పేసినట్లు అనిపించింది. కన్న కొడుకు తనని సొంత తండ్రి కాదనగలడని ఊహించలేదు రమణ. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి లేచి కొంచెం నీళ్లు తాగుదామని అనుకున్నాడు. కానీ సాధ్యం కాకపోవడంతో అలాగే నీరసంగా ఉండిపోయాడు.

                    ******

    "రమణా, రమణా, మందులు వేసుకున్నావా" అంటూ శంకరం తట్టిలేపబోయాడు రమణని. అతని శరీరం చల్లగా తగలడంతో అనుమానం వచ్చి ఊపిరి చూడ్డం కోసం ముక్కుదగ్గర వేలుపెట్టి చూసాడు. ఎప్పుడో శ్వాస ఆగిపోయినట్లుంది. డ్యూటీ డాక్టర్ కి విషయం చెప్పాడు శంకరం. కొంతసేపటికి రమణ చనిపోయాడని డాక్టర్ చెప్పేసి శవాన్ని వాళ్ళవాళ్ళు వచ్చేదాకా మార్చురీ లో ఉంచమన్నారు.

   తనదగ్గర ఉన్న ఫోన్ నెంబర్ తో శంకరం మురళికి ఫోన్ చేసాడు. "నాకు రావడానికి తీరిక లేదండీ. కానీ చిన్నప్పటినుండి నాన్నా అని పిలిచి తెలియకుండానే అభిమానం పెంచుకున్నాను. ఇప్పుడే బయలుదేరి వస్తాను. నేనొచ్చేసరికి సాయంత్రం అవుతుందేమో! చెప్పాడు.

    "నేను మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను బాబూ", అన్నాడు శంకరం. సాయంత్రం ఆరు గంటల సమయంలో హాస్పిటల్ కి చేరుకున్నాడు మురళి. మనిషి బాగా తాగినట్లున్నాడేమో గుప్పున కంపుకొడుతోంది పక్కన నిలబడితే. "పదా, వెళ్లి మీ నాన్నని చూద్దువుగానీ," చెప్పాడు శంకరం. "అంకుల్, శవాన్ని చూడడమంటే నాకు భయం. అసలు హాస్పిటల్ కి రాకూడదనుకున్నా, కానీ తప్పని పరిస్థితిలో రావలసి వచ్చింది. ఒక సాయం చేసి పెడాతారా?" అడిగాడు. "ఏంటి బాబూ, ఏం సాయం చెయ్యాలి?" అడిగాడు శంకరం. "మెడికల్ కాలేజీ వాళ్ళు పాతికవేలో, ఏభైవేలో ఇచ్చి శవాలని కొంటారుట కదా! ఇన్నాళ్లు అతణ్ణి నేనే చూసుకున్నాను. చాల కష్టాల్లో ఉన్నాను. ఇప్పుడు శవాన్ని తీసుకెళ్ళి నేను చేసేదేముంది చెప్పండి. మెడికల్ కాలేజీ వాళ్ళకి ఇచ్చేసి నాకు డబ్బిప్పించండి. మీ కష్టాన్ని ఉంచుకోను అంటూ వెయ్యిరూపాయలు అతని చేతిలో పెట్టాడు మురళి.

   "ఛీ.. నువ్వు అసలు మనిషివేనా, నువ్వు అతని కన్నకొడుకువని, నువ్వు చేసిన వెధవపనులన్నీ చెప్పి, చనిపోయిన మీ అమ్మ ఆత్మ బాధపడకూడదని తన కిడ్నీ అమ్మి నువ్వు చేసిన అప్పులన్నీ కట్టిన మహానుభావుడు. ఇప్పుడు శవాన్ని అమ్మి డబ్బులు పట్టుకెళదామని వచ్చి లంచం ఇవ్వాలనుకున్నావు. నీలాంటి కొడుకు ఉంటే ఎంత, ఛస్తే ఎంత? నా కళ్ళముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో తెలీదు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు" అన్నాడు. శంకరం కళ్ళల్లో ఎర్రటి జీర చూసేసరికి తాగిన మైకం పోయింది మురళికి. మౌనంగా అక్కడినుండి కదిలాడు.

   "రమణా, నీలాంటి మంచివాడికి ఈ లోకంలో జీవించే హక్కు లేదయ్యా, నాలాంటి లంచగొండులు, మోసగాళ్లు, నీ కొడుకులాంటి దుర్మార్గులదే ఈ ప్రపంచం. నీకు ఘనంగా అంత్యక్రియలు నేను జరిపి ఇన్నాళ్లూ చేసిన పాపాలను కడుక్కుంటాను. చచ్చేదాకా నీతిగా బతుకుతాను రమణా! నీ మీద ఒట్టు" మర్నాడు రమణ శవాన్ని మార్చురీ నుండి అధికారుల అనుమతితో తీసుకొని పాడెను భుజానికి ఎత్తుకొని, మనసులోనే చెప్పుకున్నాడు శంకరం.


Rate this content
Log in

Similar telugu story from Tragedy