STORYMIRROR

gopal krishna

Classics Inspirational Others

4  

gopal krishna

Classics Inspirational Others

ఇదంతా మామూలే

ఇదంతా మామూలే

7 mins
12

     “మళ్ళీ ఆమె కనిపించిందా,” నూతి చపటా మీద కూర్చొని బ్రష్ చేస్తూ నాన్నని అడిగాను. “లేదురా..” రాత్రి ఏమైందో పాపం అలా చేసింది సూరమ్మ” ముఖం కడుక్కుంటూ చెప్పేసి ఇంట్లోకి వెళ్లిపోయారు. “బ్రష్ చేసి వచ్చేసరికి కంచు గ్లాస్ లోకి ఫిల్టర్ కాఫీ వంచుతోంది అమ్మ. ఇద్దరం ఎదురెదురుగా కూర్చొన్నాం. “మళ్ళీ ఏమైనా తెలిసిందా” అడిగాను. మౌనంగా ఆ పాక వైపు చూసి లేదన్నట్లు ఆకాశం వైపు చూసింది. “ఏమైందిట అసలు” అడిగాను. మౌనమే సమాధానం మళ్ళీ. “పోనీ ఆడగలేకపోయావా” అడిగాను. అమ్మ ఏమీ అనలేదు.

    తల తిప్పి చూసేసరికి ఎదురుగా తాటాకు పాక అరుగు మీద సూరమ్మ. మనిషి బాగా నీరసంగా కనిపించింది. “పోనీ కాఫీ ఏమైనా తాగుతుందేమో ఇవ్వనా వెళ్ళి” అడిగాను అమ్మని. గ్లాస్ లో కాఫీ పోసి బల్లమీద పెట్టింది. వెళ్ళి ఇవ్వు అన్నట్లు చూస్తూ. “నాన్నా నేను కాఫీ తీసుకుని వెళుతున్నా” అంటూ వేడి గా ఉన్న ఇత్తడి గ్లాసు ని గుడ్డతో పట్టుకొని అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళాను సూరమ్మ ఇంటి వైపు. ఒక్కర్తే కూర్చొంది గుమ్మంలో. “మొహం కడిగావా”..? అడిగాను వేడి గ్లాసు కింద పెడుతూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. “ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా కూర్చొంటే ఏమవుతుంది , ప్రతి సమస్య కి ఒక పరిష్కారం ఉంటుంది కదా, అన్ని సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారం కాదని నా ఉద్దేశం”.

    నేను గట్టిగా అరుస్తూనే ఉన్నాను. ఆమె నా మొహం లోకి వింతగా చూస్తోంది. చివరగా “నాకు చెముడు లేదు కిట్టయ్యా” అంటూ వేడి ఇత్తడి గ్లాసులో ఉన్న కాఫీ ని కొబ్బరి చిప్పలోకి పోసుకోబోయింది. నా మనసు చివుక్కుమంది. “కాఫీ ని కొబ్బరి చిప్పలో తాగమని ఎవరు చెప్పారు. దీంతోనే తాగు” అంటూ ఆమె చేతిలో కొబ్బరి చిప్పని తీసుకొని పక్కన పెట్టేసాను. చాలా పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ వెనకటి తరం వాళ్ళు పెద్దవాళ్ల ఇళ్ళకి వెళ్ళినప్పుడు అలా తాగడం చూశాను. ఎన్నోసార్లు తాతయ్యని అడిగాను, ఏమిటీ వింత అని. “పల్లెటూళ్ళల్లో ఇంకా ఈ ఆచారం పోలేదురా కృష్ణయ్యా, ఎప్పటికీ పోతుందో కూడా తెలీదు. తొందరగా అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుందాం” అన్నారు . తాతయ్య ఆ రోజుల్లో ఎఫ్ ఏ చదివారుట. ఇప్పుడు దాని సమానమైన కోర్సు నాకు తెలీదు కానీ, తాతయ్య తెలివి తేటల ముందు నా చదువు దేనికి పనికిరాదు అనేది నా ఉద్దేశం. ఇవాళ సూరమ్మ చేతిలో కొబ్బరి చిప్ప చూసేసరికి మనం ఎక్కడున్నామో, మన సంస్కారమేంటో అర్థం కాక నాకు మనసు అదోలా అయ్యి సిగ్గుతో తలవంచుకునేలా చేసింది.

                      ****

      రాత్రి సుమారు ఎనిమిదిన్నర దాటుతోందేమో, మా కాలనీ లో ఒక్కసారిగా గోలగోలగా జనాలు పరుగులు పెడుతున్నారు “సూరమ్మ నూతిలో దూకిందిట.......” . ఆయాసపడుతూ చెప్పారు రెండిళ్ళవతల ఉన్న నారాయణ భార్య సుందరి. “సూరమ్మ నూతిలో దూకిందిట......” అమ్మ చెప్తూ ఉండగానే తాతయ్య “ఏమైంది.....?” అంటూ గట్టిగా అరవడం, అప్పటికే నాన్నా, నేను కలిసి ఆ చీకట్లో గుడ్డి టార్చ్ వేసుకొని నూతివైపు వెళ్ళడం జరిగిపోయాయి.

    బలమైన ఇద్దరబ్బాయిలు ధైర్యంగా నూతిలోకి దిగి సూరమ్మని ఎలాగో పైకి తీసుకొచ్చారు. మనిషి బాగా భయపడిపోయినట్లుంది. అందరూ ఆమె చుట్టూ మూగి తలా ఒక్కో ప్రశ్న వేయడం మొదలెట్టారు. చేతికి బలంగా దెబ్బతగిలినట్లుంది. అమ్మ వెళ్ళి తడి గుడ్డ తెచ్చి కట్టు కట్టింది. అందరూ ఎంత తొందరగా అక్కడికి చేరుకున్నారో అంతే తొందరగా చీకట్లో పురుగు పుట్రా ఉంటాయని అనుకుంటూ తిరిగి పెళ్ళాం పిల్లలతో క్షణాల్లో మాయమైపోయారు. ముసలమ్మని నూతిలోంచి తీసిన అబ్బాయిలు ఈ సంఘటనతో తమకేమీ సంబంధం లేదన్నట్లు అందరికంటే ముందుగానే అక్కడినుండి వెళ్లిపోయారు.

     సూరమ్మ షాక్ లో ఉన్నట్లుంది. పైన ఆకాశం లో నల్లని మబ్బులు కమ్ముకున్నాయి అనడానికి సూచనగా ఒక్క చుక్క కూడా కనపడడం లేదు. గాలి నెమ్మదిగా మొదలైంది వర్షం రాబోతోందనడానికి సూచనగా. తాతయ్య వీధి అరుగు మీద నిలబడి ఇళ్ళకి వెళ్తున్న వాళ్ళతో గట్టిగా మాట్లాడుతున్నారు. “అసలు సూరమ్మకి ఏమైందిట..?” అంటూ ఆరాలు తీస్తూ. తాతయ్యకి వయసు సుమారు ఎనభై ఎనిమిది. ఈ మధ్య వినికిడి బాగా తగ్గిపోయింది అనడానికి సూచనగా, ఒక ప్రశ్న పదిసార్లు ఆడగడం, గట్టిగా మాట్లాడడం చేస్తున్నారు. ఇంటిదారి పట్టినవాళ్ళు తాతయ్య యక్ష ప్రశ్నలకి జవాబులు చెప్తూ ముందుకు వెళుతున్నారు.

     “ఏరా, కృష్ణయ్యా, ఏమైందిట సూరమ్మకి?” , మళ్ళీ అందరినీ అడిగిన ప్రశ్నే నన్నూ అడిగారు. నేను నూతి దగ్గరకి వెళ్ళేసరికి అక్కడ సినిమా ఐపోయిందని చెప్తే దానికి అనుబంధంగా చాలా ప్రశ్నలు సంధిస్తారని తెలుసు. అందుకే నాకేమీ తెలియకపోయినా, “చీకట్లో బయటికి వచ్చిందిట తాతగారూ , పొరపాటున ముందుకు తూలి నూతిలో పడిపోయిందిట. ఎవరో దబ్బు మన్న శబ్ధం విని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశారుట. పది మంది వెళ్ళి లైట్లు వేసి చూస్తే గానీ తెలియలేదుట పడిపోయింది సూరమ్మ అని”, ముగించాను. నా సమయస్పూర్తికి తెలివితేటలకు నేనే అబ్బుర పోయాను. “ఇంతకీ ఆ మొదట చూసినది ఎవరై ఉంటారురా అబ్బాయ్”, అంటూ నాన్నని ప్రశ్నించారు. ఈ ప్రశ్న మేమెవ్వరం ఊహించలేదు. నాన్నకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు.

     అంతలో అమ్మ “భోజనాలకి వేళయింది లేచి కాళ్ళూ , చేతులూ కడుక్కొని రండి” అనడంతో ఆ విషయం మరుగున పడిపోయింది. “అమ్మాయ్, ఇంతకీ సూరమ్మ ఏమైనా తిని ఉంటుందంటావా”..? , భోజనం మధ్యలో అడిగారు తాతయ్య. “మీరు తినండి, నేనెళ్ళి కనుక్కొని వస్తాను తరువాత” అంది అమ్మ. భోజనాలయ్యాక, నేనింకా అక్కడే నిలబడడం చూసిన అమ్మ, “కృష్ణా, సూరమ్మకి ఇచ్చేసిరా” అంటూ ఒక పళ్ళెం లో భోజనం పెట్టి, పైన విస్తరి కప్పి ఇచ్చింది. “నేనూ వస్తానుండు” అంటూ నాన్న నా వెంట బయల్దేరారు. మా ఇంటికి పదిహేను అడుగుల దూరంలో సూరమ్మ ఇల్లు.

     అప్పుడప్పుడు ఒక్కో వర్షపు చినుకు టాప్.. టాప్ మంటూ పడుతోంది. సూరమ్మ ఇంటి అరుగుమీద ఒక్కర్తే కూర్చొంది. ఇంతలోనే ఎంత మార్పు. సరిగా అరగంట కూడా అయ్యిందో లేదో, గుంపులుగా ఆమె చుట్టూ చేరిన జనాలు ఆమెను ఒంటరిని చేసి ఎవరిదారిన వాళ్ళు ఇళ్ళకి వెళ్లిపోయారు. “అన్నం తినేసి, తొందరగా ఇంటికి రా, రుక్మిణమ్మ ఎదురుచూస్తోంది” చెప్పారు నాన్న. “బాబూ నువ్వా. సీకట్లో సూసుకోలేదు” బలహీనంగా ఉంది ఆమె గొంతు. “ఆ చూసుకోకపోబట్టే నూతిలో పడ్డావులే కానీ, భోజనం తిను” అక్కడే మట్టి అరుగుమీద కూర్చొన్నారు నాన్న. “అయ్యో బాబూ, నీకెందుకు ఇక్కడ కూసునే పని” కంగారు పడుతూ అంది సూరమ్మ. “నువ్వు ముందు తినేసి, ఇంటికి రా”.... చెప్పారు నాన్న. “నాకేటీ భయం లేదు బాబయ్యా”..., అంది మొహమాటంగా.

     “ముందు భోజనం తిను” అంటూ కూర్చొన్న చోటు నుండి కదల్లేదు నాన్న. గబగబా భోజనం విస్తరిలో పెట్టుకొని తినేసింది సూరమ్మ. “నేను పళ్ళెం ఉదయం తెత్తానులే కిట్టయ్యా, మీరెళ్ళండి” అంది. “మాట్లాడకుండా ఇంటికి నడువు” , నాన్న గొంతు కొంచెం గట్టిగా వచ్చింది. ఏమనుకుందో, మాట్లాడకుండా మా వెంట బయల్దేరి ఇంటికి వచ్చింది. సూరమ్మ వచ్చేసరికి తాతయ్య ఇంకా పడుకోలేదు. “ఏమే, సూరమ్మా, చూసుకోకుండా చీకట్లో ఎందుకు బయటికి వచ్చావు” చనువుగా అడిగారు తాతయ్య. “అవన్నీ ఉదయం మాట్లాడదాం నాన్నగారూ, పడుకోండి బాగా ఆలస్యం అయ్యింది” అంటూ తాతయ్యకి మందులు ఇచ్చి ఆయన గదిలోకి తీసుకెళ్లారు నాన్న.

     కరోనా పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నానేమో, రోజులో ఎక్కువ భాగం నా గదిలోనే గడిపేస్తూ ఉంటాను. నన్ను ఇబ్బంది పెట్టకూడదని నాకో చిన్న గది కేటాయించారు అమ్మా, నాన్న. మిగిలిపోయిన కొంచెం పని ఒక అరగంటలో పూర్తి చేసేసి వచ్చాను హాల్లోకి. అమ్మా, నాన్న ఇంకా టివి చూస్తూ కూర్చొన్నారు. కొంచెం దూరంగా చిన్న నులకమంచం మీద పడుకుంది సూరమ్మ. “పాపం, ఈ వయసులో ఎవరూ చూసేవాళ్ళు లేకుండా పోయారు”.... అమ్మ నెమ్మదిగా మాట్లాడుతోంది. “కొందరి జీవితాలు అంతే రుక్మిణీ. అందరూ ఉన్నా ఏకాకి సూరమ్మ. ఉన్నంతలో తృప్తిగా బతికేస్తోంది” అన్నారు. “ఈ కాలనీ లో అందరూ సూరమ్మకి ఋణపడి ఉన్నారు. ఒక్కరి దగ్గరా రూపాయి పుచ్చుకోకుండా తన పంట పొలాల్ని ఇళ్ళ స్థలాలకి ఇచ్చిన గొప్ప మనసున్న మనిషి. ఇవాళ ఏమైందో ఈ సూరమ్మకి” అంది అమ్మ.

     “చీకట్లో పొరపాటున కాలుజారీ పడిపోయిందేమో” అన్నాను నేను అమ్మ పక్కన కూర్చొంటూ. “అది కాదురా కృష్ణయ్యా, ఆమెకు పాపం ఏం కష్టమొచ్చిందో. ఒకప్పుడు కొడుకులు తల్లితో ఉండి , బాగా చూసుకున్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి దోవన వాళ్ళు వెళ్లిపోయారు సూరమ్మని అనాథగా చేసి, ఆ ఇల్లు చూస్తేనే అర్థమవుతోంది ఆమె ఎంత కష్టాల్లో ఉందో”అమ్మ ఏదో చెప్తూనే ఉంది. “మనం ఏమీ చేయలేమా నాన్నగారూ”....... అడిగాను మనసొప్పక. “రేపుదయం ఆలోచిద్దాంలేరా”.. .. అన్నారు నాన్న.

   బంగాళాఖాతం లో ఏర్పడిన తుఫాను వారం రోజులు అందరి జీవితాల్ని అతలాకుతలం చేసేసి, ఏమీ తెలియనట్లు వెళ్ళిపోయింది. “హమ్మయ్యా” అని ఊపిరి పీల్చుకున్నాం అంతా. నాన్న ఏం చేయాలనుకున్నారో అమ్మకి తప్ప ఎవరికీ తెలియదు. అమ్మ ఎంతో అవసరమైతే తప్ప నోరు విప్పి మాట్లాడదు . సూరమ్మ తాటాకు పాకని నిలబెట్టడానికి తాతయ్య నడుం బిగించారు. ఎవర్నీ పిలవలేదు. ఎవరు సాయం చేస్తారో చెయ్యరో నాకు అర్థం కాలేదు. అక్కడకి తాతయ్యా , నాన్న ఇద్దరే వెళ్ళి ముందు నిల్చనున్నారు.

      ఎప్పటిలాగా నేను కంప్యూటరు ముందు కూర్చొన్నానే కానీ కిటికీ లోంచీ చూస్తూ ఉంటే సూరమ్మ కనిపిస్తోంది. సన్నని పుల్లల్లాంటి కాళ్ళు చేతులు, ముడుతలు పడిన చర్మం. లోతుగా పోయి ఎండిపోయిన కళ్ళు . సూరమ్మని చూస్తే జాలేస్తుంది . తుఫాన్ ఆగిన తరువాత రావాలా వద్దా అని ఆలోచిస్తున్న సూర్యుడు సూరమ్మ ఇంటి పైకప్పు కి ఉన్న కన్నాల లోంచి నేలమీదికి తన కిరణాలను ప్రసరిస్తున్నాడు . వర్షానికి తడిసిపోయిన తాటాకుల సందులలోంచి నీటి ఆవిరి పొగలాగా ఆకాశం కేసి పయనిస్తూ , ఆహ్లాదంగా ఉంది. అప్పుడే ఎద్దుల బండి లోంచి ఇద్దరు మనుషులు కిందికి దిగి, తాటాకు సూరమ్మ ఇంటి ముందు పరిచారు. ఒక పదిమంది మనుషులు ఇంటి పైకప్పుకి కావలసిన కర్రలు వగైరా సామగ్రి మోసుకొచ్చారు. కాలనీ లో ప్రతి ఇంటినుండి ఒకరిద్దరు అక్కడికి చేరారు.

     మౌనంగా టిఫిన్ తింటోంది అమ్మ. మాటికీ కిటికీలోంచి అటువైపు చూస్తోంది. అమ్మ ఏదో ఆలోచనలో ఉందని అర్థమైంది. “ఏదో ఆలోచనలో ఉన్నట్లున్నావు కదమ్మా” అన్నాను. “ఏమీ లేదు నాన్నా, నువ్వు బాగా చదువుకున్నావు. మొన్నటిదాక బెంగళూరు లో జాబ్ చేశావు. ఇప్పుడు కరోనా పుణ్యమా అని నా కళ్ళ ఎదుట ఉన్నావు. నీకు పెళ్ళి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది కదా”! అని ఆలోచిస్తున్నాను అంది అమ్మ. అమ్మ చెప్పాలనుకున్నది అది కాదని నాకు తెలుసు. “ఇప్పుడే పెళ్ళా?” అడిగాను ఒకింత ఆశ్చర్యంగా. “తప్పదు కదా! ఇరవై మూడెళ్లి ఇరవై నాలుగొచ్చాయి నీకు, కానీ పెళ్లయ్యాకా”.. .. అంటూ అర్ధోక్తి లో ఆగిపోయింది.

     ఏమిటన్నట్లు ఆమె ముఖంలోకి చూశాను. “ఏంలేదులేరా”.. అంది తేలిగ్గా. “నీ మనసులో ఏవో ఆలోచనలున్నాయి. అవేంటో చెప్పమ్మా” అడిగాను. “కోడలు వస్తే........ పరాయి ఇంటి పిల్ల కదా నాన్న, మమ్మల్ని చూస్తుందో చూడదో. పోనీ నిన్నయినా మిమ్మల్ని చూడనిస్తుందో లేదో!” అమ్మ గొంతు బాధగా వస్తోంది. “అమ్మా, అందరూ ఒక్కలాగా ఉండరు కదమ్మా , మన ఇంటికి వచ్చిన అమ్మాయి, నీ కోడలుగా మాత్రమే కాదు, ఈ ఇంటి కూతురుగా కూడా ఉండగలిగితేనే వస్తుంది” చెప్పాను భరోసాగా.

  “పాపం సూరమ్మ కి అందరూ ఉన్నా ఏకాకిగా బతుకుతోంది . ఆమెను నూతిలోంచి బయటకి తీశాం తప్ప ఆమె మనసులో ఉన్న బాధని తీయగలమా చెప్పు. ఎవరి జీవితం ఎప్పుడెలా ముగుస్తుందో చెప్పలేం కదా ! కొడుకులు పొరుగూళ్ల లోనే ఉన్నప్పటికీ తల్లి గొడవ పట్టదు. కూతుర్ని స్వయానా తమ్ముడికే ఇచ్చి చేసినా అతడూ అక్క మంచి చెడ్డలు తెలుసుకోకుండా బాధ్యత లేకుండా తిరుగుతాడు. సూరమ్మ స్వతహాగా ఆత్మాభిమానం గల మనిషి నాన్నా, అందరూ అలా ఉండలేరు కదా!” అంటే అమ్మ భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది. తమ జీవితాలు సూరమ్మ జీవితాల్లా కాకూడదని ఆవిడ ఆలోచన.“అమ్మా, ఇప్పుడేమీ ఆలోచించవలసిన పని లేదు. మీరంతా చూసి, మీకు నచ్చిన అమ్మాయిని చేసుకో అన్నరోజు మీరు చెప్పినట్లే చేసుకుంటాను. పెళ్ళికి ఇంకా టైమ్ ఉంది. నా కెరీర్ లో ఇంకా అభివృద్ధి సాధిస్తే తప్ప నేను పెళ్లి చేసుకోదల్చుకోలేదు. ఒక్క సూరమ్మ జీవితాన్ని చూసి అందరి జీవితాలు అలాగే ఉంటాయని అనుకోవడం కూడా మన భ్రమ అవుతుందేమో” అన్నాను.

    సూరమ్మ ఇంటి పైకప్పు పూర్తిగా తీసేసి, కొత్తగా తెచ్చిన ఒక్కొక్క కర్రా పేర్చుతూ ఉన్నారు పని వాళ్ళు. ఉదయం పదకొండు గంటలకి ఆ పని పూర్తయ్యిందేమో, తాతయ్య, నాన్న ఇంటికి వచ్చి స్నానాలు పూర్తి చేసి, మళ్ళీ పని దగ్గరకి వెళ్లారు. సాయంత్రం నాలుగు అయ్యేసరికి సూరమ్మ ఇంటికి అందమైన పైకప్పు తయారైపోయింది. గుమ్మాలూ, కిటికీ లు అన్నీ సక్రమంగా ఉండడంతో గచ్చు పని చేయించడానికి మనుషుల్ని మాట్లాడేశారు మా ఎదురింట్లో ఉన్న రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ సుందరరావ్ గారు.

     “చూశావా అమ్మా, వారం క్రితం సూరమ్మ నూతిలో పడిపోతే, కాలు జారి పడిపోయిందేమో అని కొందరు, తనని కొడుకులూ కూతుళ్లు పట్టించుకొక మనస్థాపంతో నూతిలో దూకి ఆత్మహత్యా యత్నం చేసిందని ఇంకొందరూ అనుకున్నారు. ఇప్పటిదాకా తాను నోరు విప్పి కారణం చెప్పిందీ లేదు. ఎవర్నీ నిందించినదీ లేదు. ఆమెను బయటికి తీసేశాక అరగంట కాకుండానే ఎవరి మానాన వాళ్ళు ఆమెను వదిలేసి వెళ్లిపోతే, ఇంతేనా మానవ సంబంధాలు అనుకున్నాను నేను. కానీ మానవ సంబంధాలు అనుక్షణం మాటలతో చెప్పేవి కాదని, చేతలతో చూపిస్తే చాలని ఇవాళ తాతయ్యని, నాన్న ని చూసి నేర్చుకోవాలి అందరూ అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరిలోనూ మానవత్వం ఉందని, సందర్భానుసారంగా అది బయట పడుతుందని అర్థమైంది మన కాలనీ వాళ్ళని చూశాక”. ఇంత దీర్ఘంగా నేను మాట్లాడుతూ ఉంటే, అమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, చాలా పెద్దవాడివైపోయావురా కృష్ణా అంది.

     సూరమ్మ తన ఆస్తిని తృణప్రాయంగా భావించి అందరికీ తలా ఒక ఇంటి స్థలం ఇచ్చి తన పెద్ద మనసు చాటుకుంది. సూరమ్మ పట్ల కృతజ్ఞత చూపించాలని ప్రతి ఒక్కరూ తపన పడ్డారు. అయితే అది మనసులోనే దాచుకొని ఇవాళ వాళ్ళ పెద్ద మనసు చాటుకున్నారు. ఇదే కదా జీవితం అంటే. నాలుగు రోజుల్లో సూరమ్మ ఇల్లు హుందాగా, ఠీవిగా కాలనీ మధ్యలో నిల్చుని, తన చుట్టూ ఉన్న వాళ్ళని ధీమాగా చూస్తూ నిలబడింది. తాతయ్యకి, నాన్నకి మాత్రమే కాకుండా మా కాలనీ వాళ్లందరికీ ఒక మంచి మనిషిని ఆదుకున్నామనే సంతోషం మిగిలింది. సూరమ్మ ఇంటి అరుగు మీద కూర్చొని సంతోషంగ వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తోంది .

      “రుక్మిణమ్మా , కిట్టయ్య పెళ్లి సూసేసి గానీ నేను పోనులే”. అంటూ సూరమ్మ కులాసాగా నవ్వుతూంటే, ఆ కళ్ళల్లో కాంతులు చూసి తృప్తిగా తలాడించింది చిరునవ్వుతో అమ్మ కూడా. “రుక్మిణీ చూశావా, సూరమ్మ సంతోషం. కన్నబిడ్డలు చూడకపోయినా, మనందరం ఉన్నామన్న తృప్తి సూరమ్మ కళ్ళల్లో కనిపిస్తోంది. ఇదే కదా జీవితం అంటే. భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడు. సూరమ్మ చచ్చిపోవాలని నూతిలో దూకాను అని చెప్పింది. కానీ భగవన్నిర్ణయం వేరుగా ఉంది కదా! ఒక మనిషి కళ్ళల్లో సంతోషాన్ని చూసామనే తృప్తి ఉంది అందరి కళ్ళల్లో” ......... మాట్లాడుతున్న నాన్న కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తోంది అమ్మ. ఇదంతా మామూలే అన్నట్లు సూర్యుడు పడమటి కొండల్లోకి నవ్వుతూ వెళ్ళిపోయాడు.



Rate this content
Log in

Similar telugu story from Classics