gopal krishna

Abstract Classics Fantasy

4  

gopal krishna

Abstract Classics Fantasy

రెండు గుండెల చప్పుడు

రెండు గుండెల చప్పుడు

3 mins
342


             

       తనలో తానే బాధపడుతోంది. మౌనంగా టేబుల్ సద్దుతోంది. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ. మతాలు వేరు. ఆచారాలు వేరు, అలవాట్లు వేరు. అందుకే భయం. ఈ స్నేహం ఎప్పుడైనా ప్రేమ వైపు దారితీస్తే ... ఈ ఆలోచన మొదట్లో వచ్చి ఉంటే అసలు స్నేహమే చేసి ఉండేది కాదు. ఎంత వద్దు అనుకున్నా మనసు అటే వెళ్ళిపోతోంది.

తనతో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. తాను కోప్పడ్డా నవ్వుతూ తన కోపాన్ని పోగొట్టేవాడు. తన గురించి వింటూ ఉంటే కన్నీళ్లు ఆగలేదు. అప్పుడు కూడా తాను నవ్వుతూనే ఉన్నాడు తప్ప ఎప్పుడూ ఎమోషన్ అవ్వలేదు. తానే అతణ్ణి అపార్థం చేసుకుందేమో. తన లైఫ్ లో జరిగిన ముఖ్యమైనసంఘటనలు చెప్పినప్పుడు చాలాబాధపడ్డాడు. అసలు ఎందుకు తెలియకుండానే ఒకరి మీద ఇంకొకరికి అలా దగ్గరగా ఉండాలనే ఫీలింగ్ కలిగిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. పోనీ ఇదేమైనా కోరికా అంటే అదేమీ కాదనే మనసు చెప్తోంది.

తానూ అతని మాటలకు స్పందించకుండా ఉండి ఉంటే సరిపోయేది. కానీ అతడు బిజీ గా ఉండి మెసేజ్ లేకపోతే తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. కొంచెం బిజీ గా ఉన్నానండీ అన్నప్పుడు అతనిపట్ల తెలియకుండానే ఆరాధనా భావం పెరిగింది.

తానే అతణ్ణి మాటలతో ఎక్కువ ఇబ్బంది పెట్టానేమో. సద్దుతున్న టేబుల్ వైపు చూసింది. అసలు ఈ పని తాను చెయ్యక్కర్లేదు. ఇంట్లో పనులు చేసేవాళ్లున్నారు. తోచకపోవడంతో ఏదో చేస్తోంది. "టేబుల్ అంతా అలా చిందరవందర గా చేసావేంటమ్మా" అంటూ వచ్చారు వాళ్ళమ్మ.

"ఏమీ లేదమ్మా, ఏదో సద్దుదాం అనుకున్నా. ఇలా అయిపోయింది. అన్యమనస్కంగా ఉన్న కూతురు మొహంలోకి చూసారు. "అసలు ఏమైంది నీకు" అంటూ, "నాకేమీ కాలేదు అంటూ కంగారుగా అక్కడినుండి వెళ్ళిపోయింది" అప్పుడైనా అమ్మా ఇలా జరుగుతోంది అని చెప్పెయ్యల్సింది. ఏదో ఒకటి అవుతుంది. "ఆమ్మో, వద్దు. తన ఇంట్లో వాళ్ళు చాలా ఎమోషనల్. తెలియకుండా ఏమైనా జరిగితే ఇంకేమైనా ఉందా?"

ఒక పెన్ తీసుకొని, పేపర్ మీద రాయాలని మొదలుపెట్టాలని కూర్చుంది. ఏమని సంబోధించాలి. చాలాసేపు ఆలోచించింది. కొన్ని పుస్తకాలు తిరగేసింది. అసలు ముఖపరిచయమే లేని ఒక స్నేహితునికి ఎలా రాయాలో అర్థం కాలేదు.

 "రమేష్ గారూ , ఇలా సంబోధించకూడదేమో, నాకు ఏమీ తెలియదు. మన స్నేహం చిరకాలం ఉండిపోవాలి. అది కూడా ఇలాగే ఉండిపోవాలి. మన స్నేహాన్ని బంధంగా మార్చాలనిపించినా, దానికి సమాజం అంగీకరించదు . మన మతాలు అంగీకరించవు. మన చుట్టూ ఉన్నవాళ్లు అంగీకరించరు. మన గుండెలు చేసే చప్పుళ్ళ అర్థాలు మనకి తెలుసు. ఈ జన్మకి ఇది ఇంతే. నేను ఇలా అన్నానని తప్పుగా అనుకోవద్దు. నా మనసులోని భావాల్ని మీతో పంచుకోడం తప్పు వాళ్ళకి అవేమీ అర్థం కాదనిపించింది. అందుకే మీ గురించి వాళ్ళకి నేనేమీ చెప్పలేకపోయాను. నన్ను మన్నించండి. మీ మనసులో లేనిపోని ఆలోచనలు రేకెత్తించి మీకేమీ కాకుండా మిగిలిపోతున్నా " ---మీ స్నేహాన్ని ఎప్పుడూ కోరుకునే "రజియా"

లెటర్ రాసింది సరే, ఎలా పంపించాలి. తన అడ్రస్ తెలియదు. ఏంచేస్తూ ఉంటాడో తెలియదు. నిజంగా ఈ లెటర్ అతనికి చేరితే అతని మనసులో భావాలు ఎలా ఉంటాయో తెలియదు. రెండు కన్నీటి బొట్లు వెచ్చగా చేతిని తాకి పేపర్ మీద పడిపోయాయి. బెడ్ మీద పడి వెక్కివెక్కి ఏడ్చింది. ఎప్పటికో నిద్ర పట్టేసింది. లేస్తూనే మొబైల్ చూసింది. ఒక సుదీర్ఘమైన మెసేజ్.

    "రజియా, మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం ఇదే మొదటిసారి. ఆఖరి సారి కూడా. మనం స్నేహంగా ఉందాం. ఇప్పటిలాగే.ఎప్పటికీ కలుసుకోవద్దు. మీరు కన్నీరు కారుస్తున్నట్లు అనిపించింది. నిజమో కాదో కూడా నాకు తెలియదు. నాకోసం ఎవరూ ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఎంత ప్రశాంతంగా జీవించామో, అంత ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. మన గుండె చప్పుళ్ళు మనలోనే దాచుకుందాం. అందులో మాధుర్యం మనకి తప్ప ఎవరికీ తెలియదు.

మీ మనసులో నేనూ, నా మనసులో మీరూ ఉన్నామని మన ఇద్దరికీ తెలుసు. ఇదంతా కుదిరేది కాదని అర్థం చేసుకోగలను. సమాజంలో మనం ఒక భాగం కాబట్టి మనం సమాజనికి ఆమోదయోగ్యంగా బ్రతకక తప్పదండీ. అందుకే నా గుండె చేసే చప్పుడులో, మీరు నాతోనే నా పక్కనే ఉన్నట్లు ఫీలౌతాను. నేనేమైన తప్పుగా అని ఉంటే క్షమిస్తారు కదూ... "రమేష్".

    బుగ్గల మీద జారిపోతున్న కన్నీటిని తుడుచుకుంది. ఈ బంధాలు శాశ్వతం కావు సర్. స్నేహమే శాశ్వతం అంటూ మెసేజ్ చేసింది. అప్పటికే అలసిన ఆ రమేశ్ గుండె ఆగిపోయి చాలాసేపు అయ్యిందని పాపం రజియాకు తెలియదు.


Rate this content
Log in

Similar telugu story from Abstract