కాపలాదారు
కాపలాదారు
చాలా కాలం కిందట రంగాపురం లో వీరభద్రుడు అనే షావుకారు ఉండేవాడు. ఊరు మొత్తానికి వీరభద్రుడిది ఒక్కటే దుకాణం అతను సాధ్యమైనంత నిజాయతీగా వ్యాపారం చేస్తూ గ్రామంలో మంచి పేరు సంపాదించాడు. దాంతో అతనికి చక్కని లాభాలు వచ్చి లక్షాధికారి అయ్యాడు. వీరభద్రుడి దగ్గర ఒక పనివాడు ఉండేవాడు. అతనిపేరు వీరయ్య. వీరయ్య కి నా అన్నవాళ్ళు లేకపోవడంతో రాత్రి పూట వీరభద్రుడి దుకాణంకి కాపలా ఉండేవాడు.
వీరయ్య స్వతహాగా అమాయకుడు. కానీ ఎంతకష్టమైన పనైనా చేసేవాడు. ఒకరోజు వీరభద్రుడు గ్రామాంతరం వెళ్తూ "ఒరేయ్, వీరయ్యా దుకాణం, ఇల్లు కూడా జాగ్రత్త సుమా. గుమ్మం కనిపెట్టుకొని ఉండు" అని పదేపదే హెచ్చరించి వెళ్ళాడు.
ఆ సాయంత్రం ఊళ్ళో హరికథా కాలక్షేపం జరుగుతూ ఉంటే , వీరయ్య మనసు అటువైపు లాగసాగింది. అమాయకుడైన వీరయ్యకు జీవితంలో ఒక్కసారైనా హరికథ వినాలని కోరిక కలగసాగింది. యజమాని గుమ్మం భద్రంగా చూడమని చెప్పడంతో బలవంతంగా గుమ్మాన్ని తవ్వి భుజాన వేసుకొని హరికథను వినడానికి వెళ్ళిపోయాడు.
తరువాత వీరభద్రుడు తన ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఇంటికి ఉండాల్సిన గుమ్మం లేదు. ఇల్లంతా లూటీ అయిపోయింది. వీరభద్రుడు నెత్తీనోరూ బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే , భుజంమీద గుమ్మాన్ని మోసుకొని ఆయాసపడుతూ వచ్చాడు వీరన్న. అప్పటికి వీరభద్రుడుకి అర్థమైంది వీరన్న పనితనం. ఊళ్ళో వాళ్లంతా వీరన్న పనితనాన్ని తల్చుకుంటూ ఎంతో కాలం పాటు పగలబడి నవ్వుకునేవాళ్ళు.
